భద్రాచల౦ దివ్యక్షేత్ర వివరాలు.

ప్రపంచ ప్రసిద్ధి గాంచిన పుణ్యక్షేత్రం భద్రాచలం. ఇది పుణ్యక్షేత్రమే కాదు.. పుణ్యతీర్థం కూడా ఇక్కడ మహర్షులు నివసి౦చారు. ఇదే దండకారణ్యం. ఈ ప్రాంతంలోనే శ్రీరామచంద్రుడు సీతాలక్ష్మణ సమేతుడై సంచరించాడు. నారథ మహర్షి ఈ భద్రాద్రి రామున్ని సేవించాడు. ఆరాధించి గానం చేశాడు. ఈ ప్రాంతమంతా రామాయణ రసరమస్య సన్నివేశాలతో పులకించిన దివ్యధాత్రి. ఎందరో మహాభక్తులకు ఆలవాలమైన భవ్యధరిత్రి భద్రగిరి.
పవిత్ర పావన గోదావరి..
భద్రాద్రి రామునికి పాధ్యమైన పావన గౌతమి.. భద్రాచలాన్ని పుణ్యక్షేత్రంగానేకాక పుణ్యతీర్థంగా కూడా విలసిల్లజేస్తోంది. గోదావరి తీరాన అందమైన సోపానాలు. వాటి మధ్య శుభ ప్రధాత గోదావరిమాత. మరికొన్ని మెట్లు పైకెక్కితే ఆంజనేయస్వామి ఆశీర్వదిస్తూ కనిపిస్తాడు. ఆపైన వల్లి సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం-అశ్వస్తవృక్షం పవిత్ర భావనను కలిగిస్తాయి. గోదావరిలో పవిత్రస్నానం చేసిన ప్రతి ఒక్కరూ అశ్వస్తవృక్షానికి ప్రదక్షిణలు, నవస్కారాలు చేస్తుంటారు.
యోగానంద లక్ష్మీనర్సింహస్వామి దేవాలయం..
గోదావరి నుంచి రామాలయానికి వెళ్లే మార్గంలో శ్రీయోగానంద లక్ష్మీ నర్సింహస్వామి దేవాలయం ఉంది. భద్రాచలం యోగానంద లక్ష్మీనర్సింహుడు మానవనిర్మితుడు కాడు. మహర్షీప్రతిష్టుడు. దైవలోక నిర్మితుడు. ఈ నర్సింహస్వామి ధృవమూర్తి లభ్యం కావడంలోని అద్భుతమే ఇందుకు సాక్షిభూతం.
గోవిందస్వామి మఠం..
ఈ మఠం గోదావరి తీరాన కల్యాణ మండపానికి ఎదురుగా ఉంది. ఇక్కడ సాదువులు నివసించేవారు. అందుకని సాదువుల మఠం అని కూడా అనేవారు. గోవిందస్వామి అనే యోగి పుంగవుడు.. రామభక్తుడు జీవసమాధిని పొందిన పవిత్రస్థలం ఈ మఠంలో ఉంది.
కల్యాణ మండపం..
ఏటా శ్రీరామనవమికి సీతారాముల కల్యాణ మహోత్సవం మహావైభవంగా జరుగుతుంది. లక్షలాది భక్తులు కన్నుల పండువగా దర్శిస్తారు. ఈ కల్యాణ మండపం అద్భుత శిల్పకళాఖండం అపురూప కమనీయ దృశ్యం. ఇది రామాలయం సమీపంలోనే ఉంది.
వైకుంఠ ద్వారం..
ఆలయ ఉత్తర గోపురం నుంచి కిందకు మెట్లు ఉన్నాయి. అక్కడ ఉత్తర వైకుంఠ ద్వారం ఉంది. 1974లో ఈ ద్వారం ఏర్పాటు చేశారు. లక్షలాది మంది భక్తులు దర్శించడానికి వీలుగా ద్వారానికి ఎదురుగా విశాలమైన కల్యాణ మండప ప్రాంగణం ఉంది. ఏటా వైకుంఠ ఏకాదశినాడు వైకుంఠ రాముడు గరుఢ వాహనరూరుడై అశేష భక్తకోటికి దర్శనమిస్తాడు.
మిథిలానగరం స్టేడియం..
వైకుంఠ ద్వారానికి అభిముఖంగా మిథిలానగరం (స్టేడియం) ఉంది. వేలాదిమంది భక్తులు సీతారాముల కల్యాణం వీక్షించడానికి వీలుగా రూ.38 లక్షల వ్యయంతో ఈ స్టేడియ నిర్మాణం జరిగింది. ఆనాటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు దీనికి శంకుస్థాపన చేశారు.
అన్నదాన సత్రం..
మిథిలాస్టేడియం సమీపంలో గోవిందస్వామి మఠానికి ఎదురుగా స్వామివారి అన్నదానసత్రం ఉంది. భక్తులు సమర్పించిన విరాళాలతో ఈ సత్రాన్ని దేవస్థానం నిర్వహిస్తోంది.
శివాలయం..
రామాలయానికి దక్షిణంగా రంగనాయకుల గుట్ట కింద అతి ప్రాచీనమైన శివాలయం ఉంది. రామునిపేరుతో రామలింగేశ్వరస్వామిగా ప్రసిద్ధికెక్కిన ఈ శివమూర్తి యాత్రికులకు దర్శనీయులు.
కుసుమ హరినాథబాబా మందిరం..
ఇది కొండమీద ఉంది. శివాలయం నుంచి పైకి మెట్లు ఉన్నాయి. ఆ మందిరంలో కుసుమకుమారి, హరినాథబాబాల పాలరాతి విగ్రహాలు ఉన్నాయి.
రామదాసు ధ్యాన మందిరం..
రంగనాయకస్వామి గుట్టపై రామదాసు స్మృతి చిహ్నంగా రామదాసు ధ్యాన మందిరం నిర్మించబడింది. రామదాసు శిలావిగ్రహం ద్వారంలో దర్శనమిస్తుంది. విశాలమైన ధ్యాన మందిరం ఒక అపురూప కట్టడం. మందిరపు గోడలన్నీ రామదాసు కీర్తనలు, దాశరథి శతకం చెక్కబడిన శిలాఫలకాలతో నిండిఉన్నాయి. వాగ్గేయ కారోత్సవాలు ఇక్కడ నిర్వహించేవారు. యాత్రికుల సంఖ్య పెరగడం వల్ల అక్కడ ఇప్పుడు జరగడంలేదు. కల్యాణ మండపం ఆవరణలో వాగ్గేయ కారోత్సవాలు జరిపిస్తున్నారు. భద్రాద్రి పురవిశేషాల్లో ఇది తప్పక దర్శించవల్సిన కట్టడం. ఈ ప్రదేశంలోనే కుటీరం నిర్మించుకొని రామదాసు శేషజీవితాన్ని గడిపి తరించినట్లుగా జనస్మృతి ఉంది.
రంగనాయకస్వామి ఆలయం..
హరినాథబాబా మందిరం నుంచి మెట్లు ఎక్కి పైకి వెళ్తే రంగనాయకస్వామి దేవాలయం కనపడుతుంది. రంగనాథుడు శేష పర్యంకంపై పవళించి ఉంటాడు. ఇది కూడా రామాలయ పరిధిలోనేదే. ఏటా కల్యాణోత్సవాలు, తిరువీధిసేవలు జరిపిస్తారు.
అంబాసత్రం..
రామాలయం ముందర నాలుగైదు మెట్లు దిగి దక్షిణంవైపు మెట్లు దిగితే అంబాసత్రం ఉంటుంది. పమిడి గంటం వెంకటరమణయ్య అనే మహనీయుడు అన్నపూర్ణాదేవిని ప్రతిష్టించి అన్నదాన సత్రం నిర్వహించాడు. తూము నర్సింహదాసుగారు ఆరాధించిన శ్రీసీతారామలక్ష్మణుల దివ్యమూర్తులను ఇక్కడ దర్శించవచ్చు.
గోవిందరాజస్వామి ఆలయం..
రాజవీధిలో విశ్రాంతి మండపం నుంచి కొంత దూరం సాగితే గోవిందరాజస్వామి దేవాలయం కనిపిస్తుంది. భద్రాద్రిరాముడు సీతాలక్ష్మణ సమేతుడై తిరువీధిసేవకు బయలుదేరి ఊరేగింపుగా వస్తూ దారిపొడవునా హారతులు అందుకుంటూ ఈ గోవిందరాజస్వామి ఆలయంలో కొద్దిసేపు విశ్రమిస్తాడు.
దాసాంజనేయస్వామి..
తాతగుడికి అభిముఖంగా దాసాంజనేయస్వామి ఆలయం ఉంది. శ్రీసీతారామలక్ష్మణ సమేతుడైన శ్రీరామచంద్రుడు తిరువీధిసేవకు వేంచేసేటప్పుడు, తిరిగి వెళ్లేటప్పుడు తనివితీరా దర్శించుకుంటాడు దాసాంజనేయుడు. ప్రతీ మంగళవారం అనేకమంది భక్తులు ఈ ఆలయంలో పూజలు నిర్వహిస్తుంటారు.
అభయాంజనేయస్వామి దేవాలయం..
గోదావరి వంతెన దాటగానే రామభక్తులకు అభయాంజనేయస్వామి స్వాగతం పలుకుతుంటాడు. మరో పక్క అయ్యప్పస్వామి ఆలయం కూడా ఉంది.
అభయాంజనేయస్వామి పార్కు..
భద్రాచలం బ్రిడ్జీ దాటగానే అక్కడ నిలువెత్తూ ఆంజనేయస్వామి భద్రాచలం యాత్రికులకు వచ్చేవారికి ఆహ్వానం పలుకుతున్నట్లు కనిపిస్తారు. ఈ పార్కునే అభయాంజనేయస్వామి పార్కు అని పిలుస్తారు. ఇక్కడ పిల్లలు, పెద్దలు ఎంతో ఉత్సాహంగా గడుపుతారు.
ఇతర దేవాలయాలు..
పట్టణంలో ఇంకా అనేక దేవాలయాలు ఉన్నాయి. వెంకటేశ్వరకాలనీలో వేంకటేశ్వర ఆలయం ఉంది. ఇంకా కోదండరామాలయం, గాయత్రి ఆలయం, సాయిబాబా ఆలయం, శివానందస్వామి మందిరం, రాజరాజేశ్వరి ఆలయం, కనకదుర్గ ఆలయం, ఈశ్వరమ్మ ఆలయం భద్రాద్రి పురవీధుల్లో కనిపిస్తాయి.
శ్రీరామాలయ విశేషాలు..
శ్రీసీతారామచంద్రస్వామి ప్రభువు ఆలయం నాలుగు దిక్కుల్లో నాలుగు గోపురాలు, నాలుగు ద్వారాలు ఉన్నాయి. పడమటివైపు ఎత్తైన రాజగోపురం, ఏ వైపు నుంచి ఎంత దూరం చూసినా దర్శనమిస్తుంది. తూర్పువైపు నూతనంగా నిర్మించిన మండపాలతో కూడిన సోపానాలు ఉన్నాయి. భక్తులు ఆ మెట్లపై నుంచి ఆలయంలోకి ప్రవేశిస్తారు. ముందుగా శాసన స్తంభాలు దర్శించవచ్చు. ఆ పక్కనే భద్రుని శిరస్సు, భద్రుని దేవాలయం సేవించవచ్చు. గర్భాలయంపై రామదాసు వారికి గోదావరిలో లభించిన సుదర్శనచక్రం ప్రకాశిస్తూ ఉంటుంది. చుట్టు పరిక్రమిస్తూ ఆళ్వార్‌ల సన్నిధులను ప్రాకార మండపాన్ని దర్శించుకోవచ్చు. స్వామివారి వాహనాలు వెండి రథం కనులవిందు చేస్తాయి. రాజగోపురానికి ఎదురుగా విశాలమైన ముఖ మండపం, ద్వజస్తంభం, రాజగోపురానికి ఇరువైపులా లక్ష్మీతాయారుల సన్నిధి, అమ్మవారి ఆభరణాలు కొన్ని అపూర్వ చరిత్ర విశేషాలు, భద్రపరిచిన రుష్యముఖం, ఆండాల్ సన్నిధి దర్శనీయమై ఉన్నాయి. అక్కడే భక్తరామదాసు విగ్రహం చరిత్రను జ్ఞాపకం చేసుకుంటుంది. రాజగోపురం కింద నుంచి మెట్లు దిగితే ఆంజనేయస్వామి సన్నిధి కనపడుతుంది. అక్కడే స్వామివారి విక్రయశాలలు, శ్రీపెద్దజీయర్‌స్వామివారు ప్రతిష్టించిన శ్రీరామకోటి క్రతు స్తంభాలు ఉన్నాయి. పడమరగా గోదావరి తీరానికి అందమైన సోపానాలు ఉన్నాయి. అక్కడి నుంచి దక్షిణంగా మెట్లు దిగితే స్వామివారి రామాయణ భాగవత కథల చిత్రపటాలతో చాలా విశాలమైన చిత్రకూట మండపం ఉంది. ఈ మండపంలో దేవస్థానం సంస్కృత పాఠశాల కూడా నిర్వహిస్తోంది.

No comments:

Post a comment