అవసాన దశలో తులసి తీర్ధం ఎందుకు పోస్తారు





 “తులాం స్యతి తులసి” అని వ్యుత్పత్తి. విలువ కట్టలేనంత విలువ కలది అని అర్థం. తులసికి అనేకములైన రోగములు తొలగించే శక్తి ఉంది. ప్రాణాన్ని రక్షించేటటువంటి శక్తి ఉంది. కనుక అవసాన దశలో అన్ని ఔషధాలకన్నా మించిన పరమమైనటువంటి ఔషధం తులసితీర్థం. ఈ తీర్థాన్ని మనం అందజేస్తే ఒకవేళ ఆవ్యక్తి ఆత్మ తిరిగి ఆ శరీరాన్ని ఆశ్రయించడంతో బ్రతికి వస్తాడేమో అనేటటువంటి ఆశ. ఒకనాటి కాలంలో అలా బ్రతికి వచ్చిన ఉదాహరణలు కోకొల్లలుగా ఉన్నాయి. ఆ వ్యక్తికి వచ్చిన రోగం తులసి తీర్థం వల్ల తగ్గిపోయేది అయినట్లయితే తప్పకుండా ఆవ్యక్తి జీవిస్తాడు. ఇప్పటికీ ఆధునికులూ అంగీకరించిన సత్యం కూడా. వేదంలో ‘అరుణం’ అని ఒక అధ్యాయం ఉంది. ఒక 130 పనసలు. “ఆపమాపా మపస్సర్వాః” అంటూ ప్రారంభం అవుతుంది. అపః అంటే నీళ్ళు అని అర్థం. ఆ 130 పనసలను పారాయణ చేయడానికి సుమారుగా 45 నిమిషాలు పడుతుంది. రాగి పాత్రలో నీరు పోసి 7తులసి ఆకులను అందులో వేసి ఈ అరుణం పారాయణ చేసి ఆ నీటిని స్వీకరిస్తే బిపి, షుగర్, నియంత్రణలో ఉంటాయి. అనుభవంలో వాస్తవం కూడా ఇది. అరుణం రాని వాళ్ళు రాగి గ్లాసులో నీళ్ళు పోసి 7తులసి దళాలను వేసి సూర్య స్తోత్రములు – ఆదిత్య హృదయ స్తోత్రము, ఇంకేవైనా అష్టకములు, సూర్య సంబంధింతమైనటువంటివి పారాయణం చేసి ఆ నీటిని స్వీకరించి చూడండి. 40రోజులు ఈవిధంగా ఆచరిస్తే మీదేహంలో వచ్చిన మార్పు మీకే తెలియవస్తుంది. ఒబేసిటీ, దీర్ఘకాల వ్యాధులు, దేహబాధలు, కాళ్ళునొప్పులు, సర్వ రోగ నివారిణి తులసి కనుక మరణించే సమయంలో ఆ వ్యక్తికి తులసి తీర్థం అందజేస్తే తిరిగి బ్రతికి వస్తాడు అనే విశ్వాసం సనాతనకాలంలో ఉండేది. ఆ ధర్మం పాటిస్తున్నారు. సకలములైన పాపముల నుంచి మనకు పరిహారం లభించే విధంగా, మోక్షం కలిగించే విధంగా ఉండే దైవం తులసి. అందుకే తులసి తీర్థం. మనం కూడా నిత్యమూ తులసి తీర్థం తీసుకుందాం.

No comments:

Post a Comment