రామాయణం -- 22

దశరథుడి కుమారుల పెళ్ళికి, భరతుడి మేనమామ అయిన యుధాజిత్ కూడా వచ్చాడు. అసలు ఆయన భరతుడిని కొన్ని రోజుల కోసం తన ఇంటికి తీసుకువెళదామని వచ్చాడు. కాని అప్పటికే భరతుడు మిథిలకి బయలుదేరాడని తెలుసుకొని ఆయన కూడా మిథిలకి పయనమయ్యాడు. రామలక్ష్మణ భరతశత్రుఘ్నుల వివాహాన్ని కన్నులార చూసి, వాళ్ళతోపాటే అయోధ్యకి వచ్చాడు. కొంతకాలం అయ్యాక యుధాజిత్ భరతుడిని తన ఇంటికి తీసుకెళ్ళాడు, భరతుడు తనతో పాటు శత్రుఘ్నుడిని కూడా తీసుకు వెళ్ళాడు. అక్కడ వాళ్ళు ఎన్ని భోగాలని అనుభవించినా ఎల్లప్పుడూ తమ తండ్రి అయిన దశరథ మహారాజుని తలుచుకునేవారు.
దశరథ మహారాజుకి తన నలుగురు కుమారులు నాలుగు చేతులవంటివారు, ఆయనకి ఒక కొడుకు మీద ప్రేమ ఎక్కువ, మరొక కొడుకు మీద ప్రేమ తక్కువ అనేది లేదు. నలుగురిని సమానమైన దృష్టితో చేసేవారు. కాని ఆయనకి రాముడంటే అమితమైన ప్రీతి, ఎందుకంటే.....
తేషామపి మహాతేజా రామో రతికరః పితుః |
స్వయంభూరివ భూతానాం బభూవ గుణవత్తరః ||
రాముడికి ఉన్న గుణముల చేత, దశరథుడికి రాముడంటే కొంచెం ప్రేమ ఎక్కువ. రాముడికి ఉన్న గొప్ప గుణాలు ఏంటంటే, ఎప్పుడూ ప్రశాంతంగా, నిర్మలంగా ఉంటాడు( ప్రాణుల్లో కొన్నిటికి పుట్టుకతో చెవి వినపడక పోవచ్చు, కన్ను చూడలేక పోవచ్చు, నోటితో మాట్లాడలేక పోవచ్చు, కాలు-చెయ్యి పని చేయకపోవచ్చు, కాని పుట్టుకతో చెడ్డ మనస్సుతో ఎవడూ పుట్టడు, మన మనసుని మనం మార్చుకోగలము, అలా మార్చుకోలేకపోతే అది మన తప్పే, అనవసరమైన విషయాల గురించి ఆలోచించకుండా ఉంటె అందరూ ప్రశాంత చిత్తంగా ఉండగలము), ఎప్పుడూ మృదువుగా, మధురంగా మాట్లాడతాడు, అవతలివాడు వెర్రికేకలు వేస్తే, ఉద్రేకంగా మాట్లాడితే రాముడు మాత్రం మౌనంగానే ఉండేవాడు, వాదనలు చేసేవాడు కాదు, అవతలివాడు తనకి వంద అపకారాలు చెసినవాడైన కాని, తనకి ఒకసారి అనుకోకుండా ఉపకారం చేస్తే మాత్రం, రాముడు అతను చేసిన ఉపకారాన్ని గుర్తుకుతెచ్చుకొని ఆనందపడతాడు(అవతలి వ్యక్తిలో తప్పులు వెతికేవాడు కాదు), బుద్ధిమంతుడు, ముందు తనే పలకరించేవాడు, అలా కాకుండా ఎవరన్నా తనని ముందుగా పలకరిస్తే, అయ్యో! నేను వాళ్ళని పలకరించలేకపోయానే అని బెంగ పడేవాడు, అందుకని అందరినీ ముందు తనే ప్రేమగా పలకరించేవాడు, ఆయన పరాక్రమవంతులకు పరాక్రమవంతుడు అయినప్పటికీ నేను ఇంతటివాడిని అని ఎప్పుడూ అనుకోడు, తనకన్నా పెద్దవాళ్ళని ఎల్లప్పుడూ గౌరవించేవాడు, ఎప్పుడూ ధర్మ విరుద్ధమైన మాట మాట్లాడేవాడుకాదు, శ్రేయస్కరము కాని పని చేసేవాడు కాదు(మనం ఏదన్నా పని చేసేముందు, మన లోపలి బుద్ధి మనం చేస్తున్న పని మంచిదో కాదో చెప్తుంది, కాని మన మనసు ఆ మాట వినదు, అది ఈ పని చెయ్యద్దు అని అనదు, అదేమంటుందంటే, అందరు చేస్తున్నారు, మడి కట్టుకుని కూర్చుంటే ఎందుకూ పనికిరాము, ఈ మాత్రానికే ఏమి కొంపలు మునిగిపోవు, ఆ పని చేసింది నేనే అని నేను స్వయంగా చెప్పేదాకా ఎవడికి తెలీదు అని పలురకాలుగా మభ్యపెట్టి, ఇంద్రియాలకి లొంగి, శ్రేయస్కరము కాని పని చేయిస్తుంది. కాని రాముడు మనసుకి లొంగి శ్రేయస్కరము కాని పనిని ఎన్నడూ చేసేవాడు కాదు), అలాగే......
ధర్మకామార్థతత్త్వజ్ఞః స్మృతిమాన్ ప్రతిభానవాన్ |
లౌకికే సమయాచారే కృతకల్పో విశారదః ||
గురువులు చెప్పిన విషయాలని అవసరమైనప్పుడు స్మరించగలిగే నేర్పు ఉందట, సమయస్పూర్తితో మాట్లాడగలిగే నేర్పు ఉందట, ఆచారాలని పెద్దలు ఎలా పాటించేవారో అలా పాటించేవాడు. ప్రాజ్ఞులైనవారిని, సత్పురుషులని ఎలా రక్షించాలో తెలిసున్నవాడు, ఎవరిని ఎక్కడ ఉంచాలో, ఎవరిని ఎలా నియమించాలో, ఎలా ఆర్జించాలో, ఎలా ఖర్చుపెట్టాలో తెలిసున్నవాడు. సంగీత, శిల్ప, నృత్యములందు ఆరితేరినవాడు. అలాగే లొంగనటువంటి గుర్రాలని, ఏనుగుల్ని లొంగతీసుకుని వాటిమీద స్వారి చెయ్యగలిగే శక్తి ఉన్నవాడు, ప్రపంచంలో ఉన్న అతికొద్దిమంది అతిరథులలో శ్రేష్టుడైనవాడు, ఎన్ని అస్త్ర-శస్త్రాలు తెలిసినా నిష్కారణంగా బాణ ప్రయోగం చెయ్యనివాడు.
ఇన్ని గుణములతో అందరినీ సంతోషింప చెయ్యగలిగేవాడు కనుక రాముడంటె దశరథుడికి అంత ప్రీతి.

No comments:

Post a Comment