పాండవుల మెట్ట

పచ్చని ప్రకృతిని ఆస్వాదించని వారుండరు. ఎత్తయిన గిరులను అధిరోహించి చుట్టు పరిసరాలను పరిశీలిస్తే కలిగే ఆనందమే వేరు. ప్రకృతి సిద్ధంగా ఏర్పడ్డ ఎన్నో చారిత్రిక గిరులలో ‘అమరగిరి’.’ ఒకటి. పెద్దాపురం పట్టణలో ఇవి దర్శనమిస్తాయి. చాలామంది వీటిని ‘పాండవుల మెట్ట’గా పిలుస్తుంటారు పాండవుల వనవాస సమయంలో కొంతకాలం ఇక్కడే బస చేసారని, దానికి తగిన ఆనవాళ్లు ఈనాటికీ ఉన్నాయనడానికి నిదర్శనం ఈ పాండవుల మెట్ట.
భీముని పాద ముద్రికలు.. ద్రౌపది రజస్వల చాప.. పాండవులు నివాసముండి కాలకృత్యములు తీర్చుకొనుటతోపాటు రహస్య మార్గముగా వాడిన గుహ...నలభీమ పాకాలు వండి వార్చిన వంటశాల వంటి ఆనవాళ్లు స్పష్టంగా ఇక్కడ కనువిందు చేస్తాయి. అంతేకాక ఆధునిక కాలంలో నిర్మించబడిన శ్రీ సూర్యనారాయణమూర్తి దేవస్థానం సందర్శకులకు భక్తి ముక్తిమార్గంగా నిలుస్తుంది.చుట్టూ పచ్చటి పరిసరాలతో చిట్టడవిని కలిగి ఉంటుంది. దీనిలో జీవ వైవిధ్యం అప్పుడప్పుడు సందర్శకులకు కనువిందు చేస్తుంది.
భీముని పాద ముద్రికలు:
పాండవ వనవాస సమయంలో భీముడు తొలిసారిగా ఈ ప్రదేశాన్ని సందర్శించి గిరి అగ్రభాగాన్ని చేరి ప్రకృతి పరికించిన సమయంలో ఆ ప్రదేశం భీముని పాదాల ఒత్తిడికి కొంత కృంగిందని చెబుతారు. ఆ విధంగా ఆ ప్రదేశంలో భీముని పాదముద్రికలు నేటికీ దర్శనమిస్తాయి. మెట్ట ప్రాంతమంతా రాతితో వుండడంవలన పాద ముద్రికలు రాతిపై చాలా స్పష్టంగా ముద్రితమై సందర్శకులను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. పాండవుల మెట్ట దర్శించే వారిలో ఎక్కువ భాగం భీముని పాదాలను చూడాలనుకునేవారే ఉండడం విశేషం!
ద్రౌపది రజస్వల చాప
చతురస్రాకారంలో చాప మాదిరి రాతి నిర్మాణం కనిపిస్తుంది. వనవాస సమయంలో ద్రౌపది రజస్వల అయినప్పుడు ఈ ప్రాంతంలోనే కూర్చున్నదని చెబుతారు. అయితే పాండవుల భార్య అయిన ద్రౌపది ఇక్కడ ఇప్పుడు రజస్వల కావడమేమిటనేది చాలామందికి అంతు చిక్కని ప్రశ్న. ఈ విషయంలో రెండు విభిన్న కథనాలను ఆలోచించాల్సి ఉంది.
రాజవంశీయులు కన్యను వివాహమాడేవారు. కన్య అంటే రజస్వల కానిది. ఆ విధంగా చూస్తే పాండవులు ద్రౌపదిని వివాహమాడిన తర్వాత ఆమె ఈ ప్రాంతంలో రజస్వల అయి ఉండవచ్చు. రజస్వల అయినవారు మంగళకర స్నానమాచరించే వరకు వేరుగా కూర్చుండడం గుర్తించదగిన సనాతన సంప్రదాయం. ఎన్నో విశిష్టతలు కలిగిన ఈ రాతి ప్రాంతంలో ఆమె కూర్చుండుటకువీలుగా చాప మాదిరి చతురస్రాకారంలో నిర్మాణం చర్యలు చేసి వుండవచ్చునని ఇప్పటికీ నమ్ముతారు.
రెండవ కథనంగా ఆలోచిస్తే ద్రౌపది కన్య కాకపోయి వుంటే రజస్వల తర్వాత స్ర్తిలలో సంభవించే బహిష్టుల సమయంలో ఆమె ఆయా దినాల్లో గృహ సంబంధిత కార్యక్రమాలకు దూరంగా ఉంటూ ఇక్కడ కూర్చుని ఉండవచ్చునని చెబుతారు. సనాతన కాలంనుండి ఆచార సంప్రదాయాలను అత్యంత నిష్టగా పాటించేవారు నేటికీ బహిష్టు రోజులను అపవిత్ర రోజులుగా భావించి వేరుగా ఏదో మూలన గృహ కార్యక్రమాలకు దూరంగా గడపడం జరుగుతుంది. ఆ దినములు గడిచిన తర్వాత మంగళకర స్నానం ఆచరించి గృహ కార్యక్రమాల్లో పాల్గొనడం ఆచారంగా వస్తోంది.
సాధారణ వయసులో సంభవించే రజస్వల సంభవించని ఆడపిల్లలను పాండవుల మెట్ట ఈ ద్రౌపది రజస్వల చాపవద్దకు తీసుకువచ్చి దానిపై కూర్చుండబెడితే వారు రజస్వల అవుతారన్న నమ్మకం ఇప్పటికీ కొనసాగుతోంది. మూఢనమ్మకం అని కొట్టిపారేయకపోతే ఈ రాతిచాపలో దాగివున్న సైన్సు అద్భుతం ఈ కార్యానికి కారణం కావచ్చునన్నది కొందరి అభిప్రాయం.
రహస్య మార్గము.. నివాసము
పాండవుల మెట్టపైనున్న ఈ గుహకు సంబంధించి అనేక కథనాలు ఇప్పటికీ ప్రాచుర్యంలో ఉన్నాయి. వనవాస సమయంలో పాండవులు ఈ గుహలో జీవించుటయే కాక గుహ మధ్య భాగానగల జలప్రాంతంలో స్నానాలు ఆచరించేవారని చెబుతారు. ఈ జలప్రాంతం దాటి పదుల కిలోమీటర్లు ప్రయాణిస్తే రాజమహేంద్రవరం (ప్రస్తుత రాజమండ్రి) చేరకునేవారని అంటారు.
పర్యాటకులు గుహ మొదటి భాగమునందు గెంతులేయుట వరకే సాహసిస్తారు. నిజానికి గుహ అంత పొడవు వుందా? అనేది అంతుచిక్కని ప్రశ్నగానే మిగిలిపోయింది. ఈ విషయంలో ఒక మేకల గుంపును ఈ గుహలోకి పంపితే రెండు మేకలు మాత్రమే ఆవలివైపుకు ఈదుకుంటూ చేరాయని ఓ కథనం ప్రాచుర్యంలో ఉంది. మరో కథనం ప్రకారం కొంతమంది పరిశోధకులు దీనిగుండా కొంతదూరం ప్రయాణించి వెనుదిరగడమే కాకుండా మార్గమధ్యంలో ఆక్సిజన్ సరిపోవడం లేదని భయంకరమైన విషపుజంతువులు,
తోడేళ్లు వంటివి ఉన్నాయని వివరించినట్టు వాడుకలో ఉంది.
అంతుచిక్కని ఈ గుహ రహస్యం ఇప్పటికీ తేలలేదు. భూగర్భ పరిశోధకులు మాత్రమే పరిశోధించగల ఈ పరిశోధనలపై వారు కూడా ఆసక్తి చూపకపోవడం చర్చనీయాంశం. ఈ కారణాలవలవ చరిత్ర చెప్పే విషయాలను సత్యాలుగా నమ్మేవారితో పాటు కొట్టిపారేసే వారు లేకపోలేదు. పర్యాటకులు బొర్రా గుహలవద్ద చేసే హడావుడిని ఇక్కడ కూడా గుహ మొదటి భాగంలో చేస్తూ ఆనందిస్తుంటారు.
నలభీమపాకాల వంటశాల
గుహకు అతి దగ్గరగా గుహ మాదిరిగా రాతిని వొలిచిన ప్రాంతం కనిపిస్తుంది. ఇక్కడ పాండవులు భోజనాల తయారీకి వాడుకున్నారని చెబుతారు. ఈ ప్రాంతంలో కనిపించే డొప్ప వంటి భాగాన్ని ‘గంజి వార్చే భాగము’గా వర్ణిస్తారు. నల భీములు అత్యంత రుచికరమైన వంటలు వండి వార్చేవారని చారిత్రక ఉవాచ.
ఇలాంటి ఇతిహాస చారిత్రక ఆధారాలు కలిగిన ఈ అమరగిరి ప్రాంతం పాండవుల మెట్టగా ప్రసిద్ధి గాంచింది. ఈ ప్రాంతాన్ని చేరుకోవడానికి మూడు దశాబ్దాల క్రితం సాహసించి పాకుతూ అధిరోహించాల్సి వచ్చేది. ప్రస్తుతం 108 మెట్ల నిర్మాణం జరగడంతో పర్యాటకులు ఇట్టే అగ్రభాగాన్ని చేరుకుంటున్నారు.
శ్రీసూర్యనారాయణమూర్తి ఆలయం
పాండవుల మెట్టకి వచ్చే పర్యాటకులకు విశ్రాంతి కలగచేయడంతోపాటు భక్తిని ముక్తిని ప్రసాదించడానికి స్వచ్ఛంద అగ్రహార బ్రాహ్మణుల చేత
శ్రీ సూర్యనారాయణమూర్తి ఆలయం నిర్మాణం జరిగింది. ఈ ఆలయ ప్రాంగణం పర్యాటకులను విశేషంగా ఆకర్షించడమే కాకుండా అమరగిరికి సరికొత్త శోభను సంతరించేలా చేసింది. అష్టోత్తర (108) మెట్ల నిర్మాణం కూడా మెట్ట మధ్య భాగంలో సుందరంగా దర్శనమిస్తుంది. వేసవి కాలంలో వచ్చే సూర్యభగవాన్ ఉత్సవాలు ఇక్కడ గుడికి భారీ స్థాయిలో భక్తులు తరలివచ్చేలా చేస్తాయి. శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి షష్టికి కూడా ఇక్కడ ప్రాధాన్యత ఉంది.
అమరగిరి ఆలయంనుండి బయల్దేరి ఊరంతా జరిగే ‘వరద పాశ ఉత్సవం’ (నీళ్లు చిమ్మే ఉత్సవం) వలన ఆ రోజునుండి వర్షాలు సంభవిస్తాయని ప్రజలు విశ్వసించి ఉత్సాహంతో పాల్గొంటారు. పెళ్లి ముహూర్తాలు జోరందుకున్న సమయాల్లో ఈ ఆలయంపై వందలాది పెళ్లిళ్లు చుట్టుపక్కల గ్రామాలనుండి వచ్చి మరీ జరుపుకోవడం చెప్పుకోదగ్గ విషయం. ఈ ఆలయంలో జరిగే పెళ్లిళ్లకు విచ్చేసే వారికి పర్యాటక ఆనందాన్ని ఇస్తాయి. ప్రస్తుతం ఈ ఆలయం కొంత శిథిలావస్థకు చేరడం విచారకరం.
రాజమండ్రికి వెళ్లే రోడ్డు మార్గం ఓవైపు వుండగా మరోవైపు ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్లే రోడ్డు మార్గం వుండడంతో మెట్ట త్రికోణాకారంలో కనిపిస్తుంది. మెట్ట దిగువ ప్రాంతంలో గల శ్రీ సత్తెమ్మ అమ్మవారి ఆలయం భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంది. ప్రతి ఏటా జనవరిలో జరిగే ఉత్సవాలు అమరగిరికి పెట్టని అందాలుగా నిలుస్తాయి.
జీవ వైవిధ్యం
ఒకప్పుడు దట్టమైన అటవీ ప్రాంతంగా భాసిల్లిన పాండవుల మెట్ట ప్రాంతంలో రకరకాల కీటకాలు, పక్షులు, జంతువులు కనిపించేవి. నేడు జరుగుతున్న విస్తరణలో భాగంగా సంపద తరుగుతున్నట్టు చూస్తేనే తెలుస్తుంది. అయినప్పటికీ పాము, ముంగిస వంటివి అడపా దడపా కనిపిస్తూనే వుంటాయి. పెరుగుతున్న కాలుష్య కోరలకు మెల్లమెల్లగా మెట్ట ప్రాంతం చిక్కుకుందని పలువురి అభిప్రాయం. ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని మరింత శ్రద్ధ చూపి పర్యాటక ప్రాంతంగా తీర్చి దిద్దితే భవిష్యత్ తరాలకు ఇతిహాస, చారిత్రక సంపదను అందచేసినట్టవుతుంది.
సుద్ద ప్రాంతం
పాండవుల మెట్ట అనగానే గుర్తుకొచ్చే మరో పేరు సుద్దకొండ. ఈ ప్రాంతం రాతితోనే కాదు సుద్దతో కూడా కప్పబడి ఉన్నట్టు సుద్ద తవ్వకాల ద్వారా వెలుగు చూసింది. గచ్చు నేలపై ముగ్గులు వేసుకోవడానికి పనికొచ్చే సుద్ద ఇక్కడ విరివిగా లభించేది. సుద్దను తవ్వి రోడ్లపై పరిచి దానిని ముగ్గుగా చేసి అమ్మే జీవనాధారులు క్రమేపీ పెరగడంతో అసంఘటిత పరిశ్రమగా కొంతకాలం కొనసాగింది. సుద్ద తవ్వకాల్లో జరిన ప్రమాదాల వలన నేడు సుద్ద తవ్వే కార్మికులు దూరమయ్యారు.
పిల్లలు, పెద్దలు ఒకప్పుడు సుద్దకోసం మెట్టను పాకుతూ ఎక్కడం, అనే్వషించడం ఓ అద్భుతంగా అనిపించేది. మారుతున్న కాలమాన పరిస్థితులు ప్రజలను ఈ సాహసాలకు దూరం చేసాయి. సుద్దకొండ తవ్వకాల వలన కూడా అమరగిరి కొంత మేరకు తరిగిందనే చెప్పాలి.

No comments:

Post a comment