వినాయకపూజలో పత్రాలకు ఉన్న ప్రాధాన్యత- 21 Prescribed Vinyaka chavithi Pooja Pathri source manthra scientific & telugu names

వినాయకపూజలో పిండివంటలకు, ఫలాలకు ప్రాముఖ్యత ఉన్నప్పటికీ పత్రాలకు ఉన్న ప్రాధాన్యత తక్కువేం కాదు. మన శరీర ఆరోగ్యపరిరక్షణకు కావలసిన పత్రాలు 21 అని గమనించిన మన పెద్దలు, ’ఏకవింశతిపత్రపూజ’ అని పత్రాలతోనే వినాయకుని పూజించే పద్ధతిని ప్రవేశపెట్టారు. శ్రీహరి ఎత్తినవి (10) దశావతారాలైతే, శంకరుని రూపాలు ఏకాదశ (11) కాబట్టి, శివకేశవ అబేధంతో, మొత్తం ఇరవై ఒక్క పత్రాల్తో పూజ జరపాలని చెప్పారు. ఈ పత్రపూజ స్వామికి ప్రీతికరం.

ఈ 21 పత్రాలలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి…

1. మాచీపత్రం (Artemisia vulgaris)

ఇది అన్ని ప్రాంతాలలో లభిస్తుంది. ఆయుర్వేదం ప్రకారం ఇది నులిపురుగులను, కుష్ఠును, బొల్లి, దప్పికను పోగొడుతుంది. త్రిదోషాలను ఉపశమింపజేస్తుంది. ఈ పత్రాలను కాసేపు కళ్ళపై పెట్టుకుని పడుకుంటే నేత్రదోషాలు తగ్గుతాయి. తలపై పెట్టుకుంటే తలనొప్పులు మటుమాయమవుతాయి.. నరాలకు బలాన్నిస్తుంది. ఇది ఘాటైన వాసన కలది కనుక, నాసికా పుటాలు శుభ్రపడతాయి. దీని చూర్ణాన్ని నూనెలో కలిపి ఒంటికి రాస్తే మంచి సువాసన వస్తుంది.

2. బృహతీ పత్రం: వాకుడాకు: నేలమూలిక (solanum surattense)

దీనిలో తెలుపు, నీలిరంగు పువ్వులు పూసే రెండు రకాలుంటాయి. ఇది కఫాన్ని, వాతాన్ని తగ్గిస్తుంది. జ్వరం, శ్వాసశూల, గుండె జబ్బులను అరికడుతుంది. మలబద్ధకం, మూలవ్యాధులు తగ్గుతాయి. దీని రసాన్ని చర్మరోగాలకు పైపూతగా ఉపయోగిస్తారు. ఇది అన్ని ప్రాంతాలలో దొరుకుతుంది.

3. బిల్వపత్రం: మారేడు పత్రం (Aegle marmelos)

ఇది హిందువులకు అతి పవిత్రమైనది . బిల్వపత్రాల రసాన్ని శరీరానికి రాసుకుని స్నానం చేస్తే, పొడ, దురద, గజ్జి వంటి రోగాలు నివారింపబడతాయి. దీని నుంచి వచ్చే గాలిని శ్వాసిస్తే, శ్వాసకోశవ్యాధులు దరిచేరవు. ఈ పత్రాలను నమిలి తింటే మధుమేహానికి మందులా పనిచేస్తుంది. దీనిని గాలిసోకని ప్రాంతాలలో పెడితే పురుగు పుట్రా రావు. స్వచ్చమయిన గాలి కోసం మన పూర్వులు మారేడును పెంచారు.

4. దూర్వాయుగ్మం: గరిక (cynodon dactylon)

గరికకు వైద్యగుణాలున్నాయన్న సంగతి చాలామందికి తెలియదు. చిన్న పిల్లలకు ముక్కునుండి రక్తం కారడాన్ని అరికడుతుంది. మూత్రబంధానికి, రక్త పైత్యానికి ఉపయోగపడుతుంది. దీనిని కషాయం చేసి తాగితే, క్రిములను నశింపజేసి, చర్మ రోగాలను తగ్గిస్తుంది.

5. దత్తూర పత్రం ; ఉమ్మెత్త ; (Datura stramonium)

దీనిలో తెల్ల ఉమ్మెత్త, నల్ల ఉమ్మెత్త అని రెండూ రకాలున్నాయి. ఉమ్మెత్త పత్రాల రసం తేలుకాటు, ఎలుక కాటుల విషాన్ని హరిస్తుంది. దీని పత్రాలు,కొమ్మలు, గింజలు, వేర్లు అన్నింటిలో ఔషధ గుణాలున్నాయి. ఉమ్మెత్తరసాన్ని తలపై మర్ధన చేస్తే ఊడిపోయిన వెంట్రుకలు మళ్ళీ వచ్చే అవకాశముంది. కీళ్ళనొప్పులకు, నువ్వుల నూనెను రాసి, ఈ పత్రాలను ఐదారుసార్లు కడితే నొప్పులు తగ్గుతాయి.

6. బదరి పత్రం : రేగు ఆకు : zizyphus jujuba)

దీని పత్రాలు కురుపులను త్వరగా నయం చేస్తాయి. రోజు మద్యాహ్నం తరువాత రేగుపళ్ళను తింటే జీర్ణశక్తి పెరుగుతుంది. ఈ పత్రం గాత్రశుద్ధికి మంచిది. ఎముకలకు బలాన్ని ఇస్తుంది. ఇంకా ఎన్నో రోగాలకు ఇది మంచి ఔషధంగా పనిచేస్తుంది.

7. తులసీ పత్రం : (ocimum sanctum)

ఇందులొ శ్వేత, కృష్ణ అని రెండు రకాలున్నాయి. ఈ పత్రాల రసం జ్వరం, జలుబు, దగ్గుఅల్ను తగ్గిస్తాయి. క్రిమిరోగాల్తోపాటు నోటి దుర్వాసనను అరికడుతుంది. తులసీతీర్థం గొంతును శుభ్రపరుస్తుంది….. మధుమేహం, గుండెపోటు, రక్తపోటువంటి వ్యాధులను అరికడుతుంది. దీని గాలి సర్వరోగనివారిణి., మూత్రసంబంధమైన వ్యాధులను, వాంతులను అరికడుతుంది.

8. అపామార్గ పత్రం : ఉత్తరేణి పత్రం (Achyranthus aspera)

ఉత్తరేణి పుల్లతో పండ్లు తోమడంవల్ల చిగుళ్ళవాపు, రక్తం కారడం తగ్గి, దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి.
భోజనం చేసిన తర్వాత వెంటనే విరోచనమై, కడుపునొప్పితో బాధపడేవారు ఈ పత్రాలను కడుపులోకి తీసుకుంటే మంచిది. కుష్టు, చర్మవ్యాధులను తగ్గిస్తుంది. కందిరీగలు, తేనేటీగలు, కుట్టినచోట ఈ పత్రాల రసాన్ని తీసి, పూస్తే నొప్పి తగ్గుతుంది. దీనిని దుబ్బెనచెట్టు అని కూడా అంటారు.

9. చూతపత్రం : మామిడి పతం (mangifera indica)

లేత మామిడి పత్రాలను నూరి, పెరుగులో కలిపి తింటే అతిసారవ్యాధి తగ్గుతుంది. మామిడి పత్రాలు, లేత కాడలను నమిలితే నోటిపూటలు, చిగుళ్ళ బాధలు త్వరగా తగ్గుతాయి. మామిడికాయ రక్తదోషాన్ని హరిస్తుంది. శరీరానికి ఉష్ణాన్నిచ్చి పుష్టినిస్తుంది. ఒరిసిన పాదాల కురుపులకు, మామిడి జీడి రసంతో పసుపును కలిపి రాస్తే పుండు మానుతుంది. ఈ చెట్టు జిగురుతో ఉప్పు కలిపి వెచ్చబెట్టి, కాళ్ళ పగుళ్ళకి రాస్తే, అమోఘంగా పని చేస్తుంది. దీని పత్రాలను శుభకార్యాలలో తోరణాలుగా కడతాం.

10. కరవీరపత్రం : గన్నేరు పత్రాలు (nerium indicum)

దీని పత్రాలు కుష్టురోగాన్ని, దురదను తగ్గిస్తాయి. ఈ ఆకుపసరు తలలోని చుండ్రును నివారిస్తుంది. దీని వేరుబెరడుని తీసి ఎంతకు మానని పుండ్లకు పైన కట్టుగా కడతారు. తెల్లగన్నేరు, బిళ్ళగన్నేరు, ఎర్రగన్నేరు అంటూ మూడు రకాలున్నాయి.

11. విష్ణుక్రాంతం : హరిపత్రం (Evolulus alsinoides)

ఆయుర్వేదంలో ఈ పత్రాలను జ్ఞాపకశక్తికి, నరాల అలహీనతకు వాడుతుంటారు. వాతం, కఫాలను నివారిస్తుంది. దంతాలను గట్టిపరుస్తుంది. క్రిములను, వ్రణాలను మటుమాయం చెస్తుంది రకరకాల దగ్గులను తగ్గిస్తుంది. ఇది జ్వరనివారిణి.

12. దాడిమీ పత్రం : దానిమ్మ పత్రం (punica granatum)

ఈ చెట్టులోని అన్ని భాగాలు ఉపయోకరమైనవే. పత్రాలు, పళ్ళు, అతిసార, అజీర్ణ వ్యాధులను అరికట్టడానికి వాడతారు. ఈ పండ్లను తింటే రక్తం శుద్ధి అవుతుంది. చర్మం కాంతివంతమవుతుంది. ఇది వాతాన్ని,కఫాన్ని, పిత్తాన్ని హరిస్తుంది. హృదయనికి బలం చేకూరుస్తుంది.

13. దేవదారుపత్రం ;(sedris diodaran)

దీని బెరడు కషాయం శరీరవేడిని తగ్గిస్తుంది. వెక్కిళ్ళను తగ్గించడానికి ఉపయోగపడుతుంది.

14. మరువక వృక్షం ; మరువము:( originam marajOranaa)

దీని పత్రాల నుండి తీసిన నూనెను కీళ్ళనొప్పులకు పైపూతగా వాడతారు. శ్వాసరోగాలు, హృద్రోగాలను తగ్గిస్తుంది. తేలు, జెర్రి మొదలైన విషపు పురుగులు కుట్టినపుడు మరువం ఆకులరసాన్ని తీసి కడితేనొప్పి తగ్గుతుంది. ఇది దేహానికి చల్లదనాన్ని చేకూరుస్తుంది. చెవిలోని చీమును, చెవిపోటును తగ్గిస్తుంది. దీనిని పసుపుతో కలిపి రాస్తే గజ్జి, చిడుము మొదలైన చర్మవ్యాధులు తగ్గిపోతాయి. ఇది విరివిగా దొరుకుతుంది.

15. సింధువార పత్రం : వావిలాకు ( vitex negundo) దీని ఆకులను నీళ్ళలో వేసి మరగకాచి బాలింతలకు స్నానం చేయిస్తే, వాతం రాకుండా ఉండటమే కాకుండా ఒళ్ళునొప్పులు తగ్గడానికి ఉపయోగపడుతుంది. దీని ఆకులను నూరి తలకు కట్టుకుంటే తలనొప్పి తగ్గుతుంది. చిగుళ్ళవాపు తగ్గేందుకు కూడ దీనిని ఉపయోగిస్తారు. దీని ఆకుల కషాయం శూలి మొదలైన వ్యాధులను తగ్గిస్తుంది.

16. జాజి పత్రం (nax maskaTaa)

ఇది అజీర్ణ నివారిణి. జాజి ఆకులను తింటే శరీరానికి తేజస్సు వస్తుంది. కంఠస్వరం గంభీరంగా ఉంటుంది. నోటి దుర్వాసన పోతుంది. దీనికి తులసికి ఉన్న గుణం ఉంది. దీనిని చాలామంది పెంచుతుంటారు.

17. గండకీ పత్రం : కామంచి (soalnum nigrum)

దీనిని అడవిమల్లె అని కూడ అంటారు. దీని ఆకులరసం మూర్చ రోగాన్ని తగ్గిస్తుంది ఈ ఆకులతో కఫం, వాతం, రక్తపైత్యం,విరేచనాలు అరికట్టబడతాయి. అధికమూత్రాన్ని తగ్గిస్తుంది.

18. శమీపత్రం : జమ్మి పత్రం (prosopis spicigera)

దీని గాలి క్రిమిసంహారిణి. వాయు సంబంధమైన రుగ్మతలను నాశనం చేస్తుంది. దీని ఆకులద్వారా మూలవ్యాధి, అతిసారం తగ్గుతాయి. ఈ ఆకులరసాన్ని తలకు రాసుకుంటే జుట్టు నల్లబడుతుంది. ఈ ఆకు రసాన్ని పిప్పి పన్నులో పెడితే నొప్పి తగ్గి దంతం రాలిపోతుంది.

19. అశ్వత్థ పత్రం : రావి ఆకు (ficus religiosa)

ఈ చెట్టును త్రిమూర్తుల రూపంగా పూజిస్తుంటారు దీని వేర్లు బ్రహ్మ, కాండం విష్ణువు, కొమ్మలు, ఆకులను శివరూపంగా భావించి పూజిస్తారు. ఈ చెట్టు నీడను ఇవ్వడంతో పాటు మంచి కాలుష్యనివారిణిగా ఉపయోగపడుతుంది. ఈ చెట్టునుంచి వచ్చేగాలి ఆరోగ్యానికి మంచిది.ఈ ఆకుల, చెక్కరసం విరేచనాలు, నోటి వ్యాధులను తగ్గిస్తుంది. రక్తస్రావాన్ని అరికడుతుంది. ఈ చెట్టునీడ క్రింద కూర్చుంటే, చదివింది చక్కగా ఒంటపడుతుందని మన పెద్దలు చెబుతుంటారు.

20. అర్జున పత్రం : మద్ది ఆకు (terminalia arjuna)

ఇది వాత రోగాలను పోగొడుతుంది. కఫాన్ని తగ్గిస్తుంది. ఆకుల రసం కురుపులను తగ్గిస్తుంది. దీని గింజలు తైలాన్ని బెణుకులను తగ్గించేందుకు ఉపయోగిస్తారు. దీని తెల్ల మద్ది అని కూడ అంటారు.

21. అర్కపత్రం : జిల్లేడు పత్రం (calotropis gigantia)

ఆయుర్వేదంలో దీనిని 64 రోగాలనివారిణిగా పేర్కొన్నారు. ఇది శరీరానికి వేడిని తగ్గిస్తుంది. అందుకే దీనిని అర్కపత్రమని అన్నారు.దీని ఆకులను నూనెలో కాచి, కీళ్ళకు రాస్తే కీళ్ళనొప్పులు తగ్గుతాయి. ఇది పాము విషాన్ని కూడా హరిస్తుందని అంటారు. వాత, పక్షవాతం, కుష్ఠు, కఫం తదితర వ్యాధులకు మందుగా వాడుతుంటారు. దీని ద్వారా జలుబు తగ్గుతుంది. జిల్లేడు పాలను పసుపుతో కలిపి ముఖానికి రాస్తే ముఖం కాంతివంతమవుతుంది.

ఇలా వినాయక పూజలో ఉపయోగించే పత్రాల ద్వారా మన అనారోగ్య సమస్యలెన్నో తగ్గుతాయి. పత్ర పూజా విధానంలో ఎన్నో వైజ్ఞానిక విశేషాలున్నాయి. ఉదాహరణకు వినాయకునికి వెలగపండును నైవేద్యంగా పెడతాము. వెలగపండు గుజ్జును తేనెలోకలిపి తీసుకుంటే పైత్యం, వాంతులు తగ్గుతాయి.

No comments:

Post a Comment