విభూతి మహిమ

గంగాధరుని పాలభాగంపై విబూధి రేఖలు. జీవాత్మ-ఆత్మ-పరమాత్మలకు సంకేతాలు. జీవాత్మ తనలోని ఆత్మ స్వరూపాన్ని తెలుసుకొని పరమాత్మతో కూడి ఉండాలన్నదానికి నిదర్శనం. జీవాత్మే-పరమాత్మ అన్న సత్యాన్ని, జ్ఞానాన్ని తెలియజేసేదే త్రినేత్రం... అది మనపాలిట జ్ఞాననేత్రం. వేదములు, పురాణములు ఏకకంఠముతో విభూతి యొక్క మాహిమను చాటుచున్నవి. భస్మస్నానము చేసినవారు సర్వతీర్ధాలు చేసినవారితో సమానము. భస్మధారణ చేసిన వారికి దుష్ట గ్రహములు, పిశాచములు, సర్వరోగములు, పాపములు సమీపించవు. ధర్మబుద్ధి కలుగుతుంది. బాహ్య ప్రపంచజ్ణ్జానము కలుగుతుంది. విభూది నొసట ధరించి శివపంచాక్షరి మంత్రము ప్రతిదినము పఠిస్తూ వుంటే లలాటమున బ్రహ్మవ్రాసిన వ్రాత కూడా తారుమారు అవుతుంది. విభూతి (భస్మం) ధరించినప్పుడు “ఓం నమ: శివాయా'' అనే మంత్రాన్ని జపిస్తూ ధరించాలి.

విభూతి ధరించినపుడు నుదిటిపై కనుబొమ్మలు దాటి ప్రక్కలకు గాని కనుబొమ్మల క్రిందికిగాని ధరించకూడదు. విభూతిధారణ దేవతాపూజ, జపము, యజ్ణ్జము, హోమము, శుభకార్యముల్లో ధరించిన కార్యములు సిద్ధించును. తప్పక ధరించవలెను. విభూతి భస్మం, తిలకం కాని నొసట ధరించనిదే భగవంతుని తీర్ధప్రసాదములు స్వీకరించ కూడదు. భస్మము ఐదు విధముల పేర్లతో ఉన్నట్లు తెలియచున్నది.
1. భస్మం
2. విభూతి
3. భసితము
4. క్షారము
5. రక్షయని

పేర్లతో చెప్పబడుచున్నవి. 1. విభూతి కపిలవర్ణము, 2. భసితము కృష్ణ వర్ణము, 3. భస్మము శ్వేత వర్ణము, 4. క్షారము ఆకాశవర్ణము, 5. రక్ష రక్తవర్ణము కలుగి యుండును. బ్రహ్మాది దేవతలు నారదాది మహర్షులు సనక సనందనాది యోగులు బాణాసురాది దానవులు శివునిపై గల భక్తి భావములతో నిత్యం భస్మస్నానం చేసి పాప విముక్తి పొందారు. "ఓం నమ: శివాయ "అనే మంత్రముతో భస్మమును అభిమంత్రించి వంటిపై ధారణ చేయవలెను. త్రిపుండ్రములను ధరించవలెను. శిరమున, నుదుట, కర్ణమున, కంఠమునందు, భుజములందు ఈ విధముగా పదునైదు చోట్ల త్రిపుండ్రధారణ చేయవలెను. కుడిచేతి నడిమి మూడు వేళ్ళతో ఎడమ నుండి కుడివైపునకు, బొటన వేలుతో కుడినుండి ఎడమవైపునకు త్రిపుండ్రములను దాల్చ వలెను. శివపూజ సాధకులు అందరూ తప్పక ఈ విధముగా భస్మధారణ చేయవలెను.

నిత్యము ఈ విధముగా ధరించడంవలన సమస్త పాపములు నశించును. గంగా, యమున, సరస్వతి సంగమ స్నానము వలన కలుగు ఫలితములు ఈ భస్మస్నానము వలన కలుగును. బ్రహ్మ, విష్ణువు, ఇంద్రుడు మొదలగు దేవతలు ఈ భస్మ స్నానము వలననే గొప్పవారైరి. త్రిపుండరేఖలలో త్రిమూర్తులు ఉన్నారు. మొదటి రేఖ బ్రహ్మ, రెండవ రేఖ విష్ణువు, మూడవ రేఖ శివుడు. కావున మూడు రేఖలను లలాటమున ధరించుట శ్రేష్టము. ఎల్లప్పుడూ కుడి చెయ్యి మధ్య మూడు వేళ్ళతో భస్మధారణ చేయవలెను. భస్మ స్నానము కంటే పవిత్ర స్నానము లేదని చెప్పుచూ శివుడు మొదట భస్మ ధారణచేసి సమస్త దేవతలకు ప్రసాదించెను. అనాటి నుండి బ్రహ్మాది సర్వ దేవతలు భస్మధారణ మహా ప్రసాదముగా స్వీకరించారు. చంద్రశేఖరుడైన శివునకు భస్మము అర్పించిన చాలా సంతసించును. యాగములు, దానములు, తపస్సు మొదలైన వానికంటే శివునకు భస్మధారణ అధిక సంతృప్తిస్తుంది. ఒకసారి మహేశ్వరుని భస్మంతో తృప్తిపరిచిన సర్వాభీష్టములు నెరవేరును.

విభూధిని ఎందుకు ధరిస్తారు?

ప్రార్థనా సమయంలో ఆ కాలంలో ప్రతీ హిందువు విభూదిని నొసటి భాగాన పులుముకునేవారు. విభూతిలో ఉన్న ఔషదీయ గుణాలు ఈ అభ్యాసాన్ని అర్థవంతం చేస్తుంది. స్వచ్చమైన విభూతికి ఎన్నో శుభలక్షణాలు ఉన్నాయి. స్వచ్చమైన విభూదిని పొందడానికి మొదట గడ్డిమాత్రమే తినే అవు పేడను సేకరించాలి. ఆ పేడను దాన్యపు పొట్టులో శివరాత్రి రోజు కాల్చాలి. కాల్చిన పేడను నీటిలో కడిగిన అనంతరం ఆరబెట్టాలి. ఆ పిమ్మట దానిని పరమేశ్వరుడికి అర్పించాలి. ఈ విభూదిని శుభ్రమైన చోటపెట్టి వాడుకోవాలి.

విభూదిని తడిపిగాని, పొడిగా గానీ వాడుకోవచ్చు. విభూది శరీర ఉష్ణోగ్రతను అదుపులో ఉంచుతుంది. హిందువుల విశ్వాసం ప్రకారం విభూదిని ధరించడం వల్ల శివుడు ప్రసన్నుడవుతాడని విభూదిని నుదురు, మెడ, భుజాలు, చేతి మదిమలు మరియు మోచేతుల్లో ధరిస్తారు. జ్వరంతో బాధపడుతున్న వాడికి నుదిటిపై తడి విభూదిని పూస్తే శరీర ఉష్ణోగ్రత తగ్గుముఖం పడుతుంది. హోమంలో వేసిన ఔషదీయ కర్రలు మరియు ఆవు నెయ్యి పవిత్ర భస్మాన్ని మిగుల్చుతుంది. హోమభస్మం కూడా వాడవచ్చు. ఇందులోనూ అనేక ఔషదీయగునాలు ఉన్నాయి.

No comments:

Post a Comment