సీతమ్మ రాముణ్ణి తలచుకొని దుఃఖించుట-శ్రీ రామాయణం

సీతమ్మ హనుమంతుడున్న చెట్టుకిందకి వచ్చి కూచొనుట
అంతటితో వూరుకోక, ఆ రాక్షసాంగనలు "సీత! రావణుని అంతఃపురం సర్వలోకాల్లోనూ సాటిలేనిది. అందులో సుఖించాలని నీకెందుకు తోచడంలేదు? నువ్వు మనుష్యస్త్రీవి కనుక మనుష్యునికే భార్యవై వుండడం మంచి దనుకుంటున్నావు. ఇక ఆ ఆశ విడిచిపెట్టు. త్రిలోక సంపద అంతా అనుభవిస్తున్న రావణుణ్ణి పరిగ్రహించి సుఖపడు. రాముడు రాజ్యభ్రష్టుడు. అతన్ని మరిచిపో" అని చెప్పారు. ఇది విని సీతమ్మ కళ్ళల్లో నీళ్ళు పెట్టుకుని, " మీరు చెప్పేది లోకవిరుద్ధం. ఇలా చెప్పడం పాపం అని మీకు తోచడం లేదా? మనుష్య స్త్రీ మనుష్యుని భార్య అవడం ధర్మం. నేను మీరు చెప్పినట్లు చెయ్యను. మీరు నన్ను తినాలని వుంటే తినెయ్యండి, నా అభ్యంతరం లేదు. నా భర్త రాజ్యభ్రష్టుడైనా నాకు చింతలేదు. అతనే నాకు ప్రభువు. నేను ఇక్ష్వాకువంశోద్దారకుడైన రాముణ్ణే అనుసరించి బతుకుత్రాను," అని దృఢంగా చెప్పేసింది.

ఇది విని ఆ రాక్షసాంగనలు లందరూ క్రోధపరవశులయిపోయి పరుష వాక్కులతో సీతను తర్జన భర్జన చేశారు. అదంతా వుంటూనూ, చూస్తూనూ హనుమంతుడు ఆ శిశుపాలవృక్షం మీదే వుండిపోయాడు. వాళ్ళిలా అంటుండగా చేసేదిలేక సీతమ్మ ఏడుస్తూ కూర్చుంది.

సీతమ్మ తనకు మరణమే శ్రేయస్సని నిశ్చయించుకొనుట

రాముడు ప్రమత్తుడై వున్న సమయం చూసి, నేనెంత మొత్తుకుంటున్నా , కామరూపి అయిన రావణుడు నన్ను తీసుకువచ్చాడు. ఇలాగ రాక్షసాంగనలు తర్జనభర్జన చేస్తూ వుంటే నేను బతకలేను. మహా రథుడైన రాముణ్ణి బాసి యిలాగ క్రూరరాక్షసుల మధ్య పడివున్న నాకు నగలెందుకు, నాణేలెందుకు, అసలు బతుకు మాత్రం యెందుకు? నా హృదయం నల్లరాయి అయివుంటుంది. అదవా, దీనికి జరామరణాలు లేనట్టయినా భగవంతుడు నిర్మించి వుంటాడు. లేక, నేనింత దుఃఖిస్తున్నా యిది బద్దలయిపోకుండా యెలా వుందీ? నేను ఆర్యజాతిలో పుట్టలేదు. సతిని కూడా కాను; లేకపోతే రాముణ్ణి విడిచి నేనెలా బతికివుంటానూ? నా భర్త చతుస్సముద్రముద్రిత మైన భూమండలానికి ప్రభువు. అతణ్ణి బాసి వున్న నాకు బతుకుమీద ఆశ యెందుకూ? నన్ను కొయ్యండి, తినేయ్యండి, ఏమయినా నేను బతికి వుండలేను. ఈ దుఃఖం కూడా నేనిక సహించలేను. నేను రావణుణ్ణి యెడమకాలితో నయినా తాకను, ఈ రావణుడు నేను తనని తిరస్కరించడం గుర్తించకుండా వున్నాడు. తా నేమయిపోతాడో తన కులం యేమయిపొతుందో కూడా గుర్తించుకోకుండా వున్నాడు. అంచేతనే నన్ను కోరడం. నన్ను నరకండి. చీల్చండి. ఏమయినా నేను రావణుణ్ణి అంగీకరించను. రాముడు విశ్వవిఖ్యాతుడు. ప్రాజ్ఞుడూ. కృతజ్ఞుడు, దయాపరుడు. అయినా నా దౌర్భాగ్యం వల్ల యిప్పుడు కాఠిన్యం వహించినట్టు కనబడుతోంది. లేకపోతే, జనస్థానంలో వేలకొద్దీ రాక్షసుల నొక్కబాణంతో కూలగొట్టినవాడు నన్నెందు కుపేక్షిస్తున్నాడు? నన్ను ఇలా నిరోధిస్తున్న యీ రావణుడు నిస్తేజుడు. నా రాముడు రావణుణ్ణి నిముషంలో సంహరించగలడు. నా రాముడు విరాధుణ్ణి చంపాడే. నా కోసం యెందుకు రాడూ? సముద్రం మధ్యగా వుంది కనుక , యీ లంక సాధారణంగా అసాధ్యమే; కాని యిక్కడ రామబాణాలడ్డుకొదగ్గది యేమీ లేదు. తాను మహాపరాక్రమశాలి అయివుండిన్నీ తన భార్య అయిన నన్ను రావణు డపహరించి తేగా వూరుకున్నాడే, దీని కేమి కారణము? ఒకవేళ రాముడు నేనిక్కడ వుండినట్టు ఎరెగడేమో? ఎరిగివుంటే మాత్రం క్షణం అయినా వూరుకోడు. నన్ను రావణు డెత్తుకుపోతూ వుండడం జటాయువు చెబుతాడేమో అనుకుంటే అతను రావణుని చేతిలో కూలిపోయే. వృద్ధుడయ్యుండిన్నీ నన్ను రక్షించడం కోసం రావణుణ్ణి ఎదిరించి, అతను చేసిన పని మాత్రం చాలా గొప్పది. నే నిక్కడ వుండినట్టు తెలిస్తే రాముడు భూమండలం అంతా అరాక్షసం చేసి పారేస్తాడు. లంక కాల్చేస్తాడు. రాముడూ లక్ష్మణుడూ లంక అంతా వెతికి వెతికి రాక్షసులను చంపేస్తారు.

ఈ లంకఅంతా నిమిషంలో చితులతోనూ, గద్దలతోనూ, మహాశ్మశానం అయిపోతుంది. మీ దుష్టత్వం వల్ల రాక్షసకులం అంతా నాశనం అయిపోతుంది. ఇందుకు తగ్గట్టు అనేక దుర్నిమిత్తాలు కనబడుతున్నాయి. యీ లంక త్వరలో నాశనం అయిపోతుంది తప్పదు. నా విషయమై క్రూరుడైన రావణుడు పెట్టిన గడువు సమీపించింది. పాపాత్ములైన యీ రాక్షసులకు మంచి చెడ్డలు తెలియవు. ఈ రాక్షసులకు ధర్మాధర్మాలు తెలియవు. రావణుడు నన్ను ప్రాతఃకాల భోజనంలో తినేస్తాడు, తప్పదు. రాముణ్ణి విడిచి వుండి నేనేమి చెయ్యగలనూ? రామునకు నేనిక్కడ బతికివుండిన సంగతి తెలిసివుండదు. తెలిస్తే నన్ను వెతక్కుండా వుండడు. నా రాముణ్ణి విడిచి వుండడం కంటే నేను చనిపోవడమే మంచిది. లేకపోతే, రామలక్ష్మణులు, అస్త్రసన్యాసం చేసి కందమూలాలు తింటూ మునివృత్తి అవలంబించారేమో? ఏమయినా కాలం యిలా వుంది కనుక నేను బతికి వుండలేను. ఇలాంటి స్థితిలో నాకు మరణం తటస్థించకుండా వుంది. జితాత్ములై మనస్సు స్వాధినం చేసుకుని, యిష్టమో, అనిష్టమో అనేది లేకుండా వుండే మహామునులు ధన్యులు. ప్రియమైనదానివల్ల దుఃఖం రాదు. అప్రియమైన దానివల్ల భయం సంభవిస్తుంది. అలాంటి ప్రియాప్రియాలు పాటించని మహాత్ములకు నమస్కారం. రాముణ్ణి విడిచి వుండడమే కాక, రావణుని వశంలో కూడా పడి వున్నాను కనుక నేనిక ప్రాణాలు విడిచిపెట్టేస్తాను సీత యిలా చెప్పగా, యీ సంగతి రావణునకు చెప్పడానికి కొందరు రాక్షసాంగనలు బయలుదేరారు.

No comments:

Post a Comment