గార్గ్యుడు భరద్వాజ మహర్షి శిష్యుడు. తీక్షణబుద్ధితో, బ్రహ్మచర్య దీక్షతో, ప్రగాఢ పరిశ్రమతో గార్గ్యుడు వేద శాస్త్రములయందు సంపూర్ణాధికారియైనాడు. గుర్వాశ్రమమునకు వచ్చిన విద్యాంసులతో శాస్త్ర చర్చచేయుట వారిని పరాజితులు చేయుట అతని వినోదము. సమావర్తన సంస్కారము చేసి భరద్వాజులు అతనిని స్వగృహమునకు వెళ్ళుటకు అనుమతించారు. వాత్సల్యంతో భరద్వాజులు - "శిష్యా! ముందెన్నడూ పొరపాటున గూడా గర్వించి ఏ విద్వాంసుని అవమానించకుము. విద్వాంసుడు సాటి విద్వాంసుని అవమానించుట శాస్త్ర విరుద్ధము. అట్టి వాని విద్య నిరర్థకము. అట్టి తరి బుద్ధి క్రూరమైనదై పోవును. వారి వలన సమాజమున కెన్నడూ హితము చేకూరదు." అని సందేశమిచ్చి పంపెను. గార్గ్యుని స్వాభిమానము దెబ్బతినెను.
ఆశ్రమమును వీడు దుఃఖములో స్వగృహము చేరు సంతసముతో గార్గ్యుడు పయనమై వెళ్ళాడు. మాతృప్రేమతో తన్ను చూచిన గురుపత్నిని, సోదరభావంతో కాలం గడిపిన విద్యార్థి బృందాన్ని తల్చుకుంటూ ఆశ్రమం వైపు తిరిగి తిరిగి చూస్తూ వదలలేక ఆశ్రమాన్ని వదలి వెళ్ళాడు గార్గ్యుడు. స్వగృహం చేరి దారిద్ర్యము వలన కుటుంబ జనులు పొందుతూన్న దైన్యం అతనిని కలచివేసింది. రెండు మూడు దినములు ఎట్లో గడపి ధనార్థియై, తండ్రి యాజ్ఞ తీసుకుని బయల్దేరాడు గార్గ్యుడు. కాశీ రాజైన అజాత శత్రువు విద్యా దాన శక్తులు కారణంగా విశ్య విఖ్యాతుడైనాడు. అతని వద్దకు ధనార్థులేగాక విద్యా సముపార్జనకై రాకుమారులు, ముని కుమారులు వచ్చేవారు. అంతేగాదు అనేక మంది మహా పండితులు కూడా తమ సందేహములను నివృత్తి చేసుకోవడానికి అజాత శత్రువును చేరేవారు. బ్రహ్మజ్ఞానియైన ఆ రాజు వారి సందేహాలను చక్కగా నివృత్తిచేసి భూరిదక్షణలతో సత్కరించేవాడు. గార్గ్యుడు అజాత శత్రువుని గురించి విన్నాడు. అందుచేత కాశీ నగరమునకు ప్రయాణమయ్యాడు. దారిలో అతడు ఉపమన్యుని ఆశ్రమాన్ని దర్శించాడు. తేజోమూర్తియైన ఉపమన్యుడు గార్గ్యుడు వినయశీలానికి సంతసించి కాశీ నరేంద్రుని దర్శనం చేయిస్తానన్నాడు. గార్గ్యుడు చాలా ఆనందించాడు.
పండిత సభ యందున్న ఆజాతశత్రువు, ఆచార్య ఉపమన్యువు శిష్యత్రయంతో వస్తున్నాడన్న వార్త విని ఎదురేగి పూజించి మణిమయ సింహాసనంపై ఆశీనుని చేశాడు. ఉపమన్యువు నరేంద్రునికి గార్గ్యుని పరిచయం చేసి స్వప్రయోజన సిద్ధికి రాజదర్శనం చేస్తునట్లుగా చెప్పాడు. గార్గ్యుని అహం ఆ మాటలకు దెబ్బతిన్నది. అతనిలోని పాండిత్యాహంకారసర్పం పడగవిప్పి బుసలు కొట్టింది. ఉచితా నుచితాలు మరిచి గార్గ్యుడు - "భూపాలా! మీరు అనేక విద్యార్థులను చదివించుదురని విన్నాను. ఇట్టి బ్రాహ్మణ ప్రవృత్తికి మీరు సంపూర్ణాధికారులవునో కాదో తెలుసుకొనుటకు మీతో శాస్త్ర చర్చను కోరుతున్నాను" అన్నాడు. ఈ మాటలు సభికులందరిని వ్యధ పెట్టినాయి. అజాతశత్రువు వినయంగా "ఆర్యా! తమవంటి పండిత ప్రకాండులతో శాస్త్రచర్చ చేయుసాహసం నేనెన్నడు కోరలేదు. మీరు అభిలషించినచో రేపటి సాయంత్రము మీ సేవకు సంసిద్ధుడను. మీరు అలసినట్లున్నారు విశ్రాంతి తీసుకోండి" అని చెప్పాడు. ఆ రాజుమాటలలో గార్గ్యునికి వ్యంగ్య భావం గోచరించింది. ఆచార్యుని ఆజ్ఞవలన అణగియున్న అతని అభిమాన ప్రవృత్తి నగ్న రూపంలో పునఃప్రత్యక్షమైంది. క్రోధారుణ నేత్రాలతో "రాజా! నీ సేవలు నాకు అవసరం లేదు. బ్రహ్మజ్ఞాన విషయాలలో మీ శక్తి ఎంతటిదో పరీక్షింప గోరుచున్నాను. "గార్గ్యుని పండిత్యమదము సభవారికి గోచరమయ్యెను. రాజు సభ చాలించాడు.
మరునాడు సాయంత్రము అతిథిశాలలో అజాత శత్రువు గార్గ్యుని ధర్శించెను. గార్గ్యుని కోరిక మేరకు శాస్త్ర చర్చ ప్రారంభ మాయెను. గార్గ్యుని ప్రథమ ప్రశ్నలోనే అతని జ్ఞానపరిమితి అజాతశత్రువుకు గోచరమైంది. గార్గ్యుడు పరాజితుడై తన ఆజ్ఞానమునకు చింతించి అహంకారము చంపుకుని జ్ఞానానికై అజాతశత్రువునే ఆశ్రయించాడు.
విద్వాంసులను అవమానించుట నీచ సర్పము కన్న దుఃఖదాయకమైనది. అట్టి వాని విద్య నిరర్థకము, బుద్ధి క్రూరపూర్ణమైనదై పోవును. అందువలన సజ్జనులకు, పండితులకు అది తగదు.
No comments:
Post a Comment