జటాయువు

రావణుడు సీతాదేవిని అపహరించాడు. రామలక్ష్మణులు దండకారణ్యంలో ఆమె కొరకు వెదకారు. పర్వతాకారంలో నెత్తురుతో తడిసి పడియున్న గృధ్రరాజైన జటాయువును చూచారు. "వీడు మాయారూపంలో ఉన్న రాక్షసుడు. నా సీతను వీడే తిని విశ్రాంతిగా పడుకున్నాడు. కాన వీడిని సంహరించి వేస్తాను, అని అంటూ రాముడు ధనస్సు ఎక్కుపెట్టి ధనుష్టంకారం చేశాడు. నెత్తురు కక్కుతూ దీనస్వరంతో జటాయువు "రామా! రావణుడు పుణ్యవతి అయిన సీతను, నా ప్రాణాలను అపహరించాడు. మీరిద్దరూ లేని సమయంలో సీతాదేవిని వాడు ఎత్తుకునిపోతూ ఉంటే ఆమెను విడిపించుటకు నేను వానిని ఎదిరించి పోరాడాను. నీకు అక్కడ పడియున్న రథం, ధనస్సు యుద్ధమంలో నేను విరుగగొట్టినవే. ఆ రథసారధిని, రధానికి కట్టిన కంచర గాడిదలను నేనే చంపాను. వృద్ధుడ నగుటవల్ల వాడితో పోరాటంలో నేను అలసిపోయినప్పుడు ఆ దుర్మార్గుడు నా రెక్కలను నరికి వేశాడు. అంతట వైదేహిని ఎత్తుకుని ఆకాశమార్గంలో ఎగిరిపోయాడు" అని చెప్పింది. ఆ మాటలకు రామునికి కన్నీళ్ళు వచ్చాయి. ధనస్సు చేతినుండి జారిపడింది. పరుగున వచ్చి ఆ గద్దను కౌగలించుకున్నాడు. దుఃఖంతో నేలపై చతికిలపడి ఏడ్చాడు. లక్ష్మణుని చూచి "తమ్ముడా! ఈ జటాయువు నాన్నగారి మిత్రుడు. నేను చాలా దౌర్భాగ్యుణ్ణి. రాజ్యం పోయింది. నా సీతను కోల్పోయాను. ఆత్మీయుడైన జటాయువు చనిపోవుటకు సిద్ధంగా ఉన్నాడు" అంటూ ప్రేమగౌరవాలతో దాని శరీరమంతా తడిమాడు. తనకు ఉపకారం చేయుటకు ప్రాణం కూడ లెక్కచేయక యుద్ధం చేసిన అ గద్దవంక ఆప్యాయంగా చూస్తూ ఆ రావణుని గురించి, సీతాదేవిని ఎటుతీసుకువెళ్ళాడో చెప్పమని మరీ మరీ అడిగాడు. మరణ వేదనను అనుభవిస్తున్న ఆ జటాయువు అతికష్టంగా ప్రయత్నం చేసి "రామప్రభూ! దుఃఖించకు. రావణాసురుడు విందము అనే ముహూర్తంలో జానకీ దేవిని ఎత్తుకుపోయినాడు. ఆ ముహూర్తంలో పోయినసొమ్ము యజమానికి తప్పకూండా దొరుకుతుంది. అది వాడు ఎరుగడు. నీవు యుద్ధంలో రావణుని జయించి సీతమ్మను తప్పకుండా తెచ్చుకుని హాయిగా ఉంటావు అని విన్నవించాడు. దానికి మాటలు రావడం లేదు. మరణకాలం దగ్గర పడటం వలన నోటివెంట మాంసంతో నెత్తురు కారడం మొదలెట్టింది. ఆఖరి స్వాసపీలుస్తూ "ప్రభూ వాడు విశ్వవసుడి పుత్రుడు. సాక్షాత్తు కుబేరుడి తమ్ముడు..." అంది. రాముడు చేతులు జోడించి "చెప్పు మిత్రమా చెప్పు" అని ఆతురతతో అంటున్నాడు. కాని ఆ పక్షి నేలకు ఒరిగిపోయింది.
శ్రీరాముడు దాని కొరకు తీవ్రంగా దుఃఖించినాడు. కన్నులు ఎర్రబడ్డాయి. "లక్ష్మణా! రావణుడు సీతను ఎత్తుకు పోయిన దుఃఖంకంటె జటాయువు మరణం నన్ను దహించి వేస్తోంది. ఈతడు దశరథ మహారాజువలె నాకు పూజ్యుడు. నా కోసం మరణించిన ఈ పక్షికి నేనే స్వయంగా దహన సంస్కారం చేస్తాను. అని అన్నాడు". లక్ష్మణుడు తెచ్చిన ఎండుకట్టెలపై పక్షిని ఉంచాడు. అహితాగ్నులు, యతులు, భూదాతలు పోయే పుణ్యలోకాలకు ఈ జటాయువు పోవాలని కోరుతూ యధావిధిన దహన సంస్కారాలు చేసాడు. స్వర్గానికి పోయేందుకు బ్రాహ్మణులు చదివే పితృదేవతా సంబంధం అయిన మంత్రాలను అన్నింటిని జటాయువు కోసం జపం చేశాడు. కేసరీ మృగాలను చంపి తెచ్చిన మాంసంతో యధావిధిగా పిండ ప్రదానాలు చేశాడు. శాస్త్రప్రకారం రామలక్ష్మణులు గోదావరిలో స్నానం చేసి జటాయువుకు జలతర్పణాలు వదిలారు.
ఒక పతివ్రతను రక్షించుటకు ఆయుధాలు లేనప్పటికి, ఒంటరివాడైననూ, వృద్ధాప్యదశలోను ప్రాణాలను లెక్కచేయక తన ధర్మాన్ని నిర్వర్తించిన జటాయువు దశరథ మహారాజు నోచుకోని అదృష్టాన్ని పొందింది. స్వయంగా శ్రీరాముడే అంత్యక్రియలు నిర్వహించి దానికి మోక్షం ప్రసాదించాడు. కర్తవ్య నిర్వహణంలో మరణం ప్రాప్తించినా అది యోగ హేతువే కదా!

No comments:

Post a Comment