పూర్వకాలమున వసువులలో ముఖ్యుడైన ద్రోణుడు, అతని భార్యయైన ధరాదేవి భగవంతుని ప్రసన్నుని జేసికొనుటకై తపమొనరించిరి. మరుజన్మలో వారికి భగవంతుడు పుత్రుడగునని బ్రహ్మదేవుడు వరమిచ్చెను. ఆ వరప్రభావమున మరుజన్మలో ద్రోణుడు, ధరాదేవి నందయశోదలుగా జన్మించిరి. శ్రీకృష్ణబలరాములు ఆ దంపతులకు పుత్రులై, వారికి వాత్సల్యసుఖములను గూర్చిరి. మథురానగరమునందు 'దేవమీఢుఢు' అను ఒక మహారాజు ఉండెను. అతడు గొప్పప్రతాపశాలి, కృష్ణుని వంశమువాడు, అతనికి ఇద్దరు భార్యలుండిరి. వారిలో ఒక పడతి క్షత్రియవంశమునకు చెందినది. మరియొక వనిత వైశ్యవంశమున జన్మించినట్టిది. క్షత్రియవనితకు శూరసేనుడు, వైశ్యస్త్రీకి పర్జన్యుడు జన్మించిరి. శూరసేనుని కుమారుడు వసుదేవుడు. పర్జన్యుడు తనమాతృ (వైశ్య) వంశ ప్రభావమును అనుసరించి, గోపాలకుడుగా పరిగణించబడెను. అతడు యమునానదికి ఆవలితీరమున ఒక వనమునందు స్థిరనివాసమును ఏర్పరుచుకొనెను. మథురామండలమునందలి గోసంపదకు ఇతడు సర్వాధికారిగా ఉండెను. గోపాలుడైన నందుడు ఈపర్జన్యుని కుమారుడే. ఇతడు వసుదేవునకు తమ్ముడు,ఆత్మీయుడు.
మథురలో కంసుని ఆగడములు మితిమీరగా వసుదేవుడు తనభార్యయగు రోహిణిని వ్రేపల్లెకు పంపెను. అక్కడ ఉన్నప్పుడు రోహిణికి బలరాముడు జన్మించెను. వసుదేవుడు శ్రీకృష్ణుని రహస్యముగా వ్రేపల్లెకు గొనిపోయి నందుని ఇంట ఉంచెను. ఈ విధముగా శ్రీకృష్ణబలరాముల లాలనపాలనలు నందుని ఇంట జరిగెను. ఆ ఇద్దరును ఆయనకు ప్రాణతుల్యులే. శ్రీకృష్ణనామస్మరణమే తన జీవితమున ముఖ్యవ్రతమని నందుడు మాటి మాటికి యశోదకు తెల్పుచుండెను. నందుడు ప్రతిపనిని శ్రీకృష్ణుని సంతోషపెట్టుటకే చేయుచుండెడివాడు.
గోకులమునందు పెక్కు ఉపద్రవములు సంభవించెను. అప్పుడు నందుడు గోపాలకులను అందరిని తీసికొని 'బర్సానా' సమీపమునగల 'నందగావ్ 'నకు చేరెను. ఒకసారి నందుడు ఏకాదశీవ్రతమును ఆచరించెను. రాత్రియంతయు జాగరణ చేసెను. ఇంక కొద్దిగారాత్రికాలము మిగిలియున్నప్పుడు ప్రాతః కాలమైనదని భావించి స్నానముచేయుటకై యమునానదికి వెళ్లెను. అప్పుడు వరుణుని దూతయొకడు అతనిని పట్టుకొని వరునలోకమునకు తీసికొనిపోయెను. నందుడు కనబడకపోవుటచే ఆగ్రామములోని వారు అందరును మిగుల పరితపించిరి. అంతట శ్రీకృష్ణుడు యమునలోదూకి వరుణలోకమునకు చేరెను. వరుణుడు శ్రీకృష్ణభగవానునకు విధ్యుక్తముగా ఆతిథి సత్కారములను ఒనర్చెను. పిమ్మట శ్రీకృష్ణుడు నందునితో తిరిగి వచ్చెను. నందుని రాకతో గోపాలురు, గోపికలు ఆనందమున ఓలలాడిరి.
శ్రీకృష్ణభగవానుడు కంసుని ఆహ్వానముపై అక్రూరుని వెంట మథురకు వెళ్లినప్పుడు నందుడు గూడ ఆయన వెంట ఉండెను. కంసవధ, ఉగ్రసేనుని రాజ్యాభిషేకము ఐన పిదప నందుడు గోకులమునకు తిరిగి వచ్చెను. శ్రీకృష్ణబలరాములు మాత్రము మథురలోనే ఉండిపోయిరి. శ్రీకృష్ణుని సందేశముతో ఉద్ధవుడు గోకులమునకురాగా నందుడు వ్యాకులపడుచు గద్గస్వరముతో ఇట్లనెను. "మహాత్మా! ఉద్ధవా! శ్రీకృష్ణుడు మమ్ములను చూచుటకు ఎప్పుడైనను ఇక్కడికి వచ్చునా? మరల అతని దర్శనభాగ్యము మాకు లభించునా? అతడు దావాగ్నిని పానముచేయుట, కాళియమర్దనము, గోవర్ధనగిరిని ఎత్తుట మున్నగు లీలలను స్మరించుచు నేటికిని మేము పరవసించిపోవుచున్నాము. అతడు మమ్ములను పెక్కుసంకటములనుండి రక్షించెను. అతడు ధర్మము గూర్చుటకు అవతరించిన భగవంతుడేయని మేము భావించెదము". నందుడు శ్యామసుందరుని (శ్రీకృష్ణుని)తో చివరిసారిగా కురుక్షేత్రమున కలిసెను. అప్పుడును నందుడు శ్రీకృష్ణుని తనముద్దులకుమారునిగనే తలంచెను. ఆయనను ఒడిలోకూర్చుండబెట్టుకొని ముద్దులాడెను. ఆ ముద్దులలో ఎంతటి విరహవేదన ఎన్ని స్మృతులు కలవో ఎవరు చెప్పగలరు? శ్రీకృష్ణభగవానుడు తన పరంధామమునకు చేరిన పిదప నందుడును గోపకులందరితోగూడి శ్రీకృష్ణుని దివ్యధామమునకు చేరెను.
No comments:
Post a Comment