ధనుర్మాసానికి చాలా విశేషమైన ప్రాశస్త్యం ఉన్నది

పన్నెండు రాశులలో సూర్యగమనం వలన ఏర్పడే మాసాలలో ధనుర్మాసానికి చాలా విశేషమైన ప్రాశస్త్యం ఉన్నది. ఈ మాసం ఎంతో పవిత్రమైనదిగా, భగవదారాధనకు అనువైనదిగా కొనియాడబడుతున్నది. ధనుర్మాసం నెలరోజులు ఉషఃకాలాన (బ్రాహ్మీ ముహూర్తంలో) ఎవరైతే విష్ణువును అర్చిస్తారో వారు వెయ్యి సంవత్సరములు పూజించిన ఫలితాన్ని పొందుతారని పురాణాలు చెబుతున్నాయి. నివేదనగా స్వామికి కట్టుపొంగలిని (పెసరపప్పు, బియ్యం ఉడికించి చేసినది) సమర్పించటం కూడా చాలా విశేషమని తెలియజేయడమైనది. అటువంటి విశిష్టమైన ధనుర్మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి అని అంటారు. చాంద్రమానాన్ని అనుసరించి వైకుంఠ ఏకాదశి మార్గశిర/పుష్య మాసాలలో వస్తుంది. ఆషాఢ శుక్ల (తొలి/శయన) ఏకాదశినాడు లోక రక్షణకై యోగనిద్రను ఆరంభించిన శ్రీ మహావిష్ణువు కార్తిక శుద్ధ (ఉత్థాన) ఏకాదశితో తన యోగనిద్రను ముగించి, గరుడ వాహనారూఢుడై తన దివ్య మంగళ విగ్రహంతో ముక్కోటి దేవతలకు దర్శనమిస్తాడు. ఇలా ముక్కోటి దేవతలు శ్రీమహావిష్ణువుని దర్శించే సమయం కావడం వలన వైకుంఠ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి గా కూడా పిలుస్తారు.
సృష్ట్యాదిలో శ్రీమహావిష్ణువు కర్ణముల నుండి మధుకైటభులానే ఇద్దరు రాక్షసులు జన్మించి బ్రహ్మని చంపవచ్చారు. దానికి ఆగ్రహించిన శ్రీమహావిష్ణువు వారితో యుద్ధం చేసి, వారి కోరిక మేరకు ధనుశ్శుద్ధ ఏకాదశినాడు ఉత్తరద్వారం గుండా మోక్షమును ప్రసాదించాడు. బ్రహ్మాది దేవతలు శ్రీహరి చూపిన అనుగ్రహాన్ని ఉత్సవంగా అనుష్ఠించాలని తలచి ఈ ధనుశ్శుద్ధ ఏకాదశినాడు ఉత్తర ద్వారాన వేంచేసి ఉన్న భగవంతుని దర్శించిన వారు మోక్షమును పొందాలని శ్రీహరిని ప్రార్థించగా అనుగ్రహించాడు. అందువల్ల ఈ వైకుంఠ ఏకాదశినాడు ఉత్తర ద్వారమున వేంచేసియున్న భగవంతుని దర్శించిన వారు తప్పక మోక్షాన్ని పొందుతారు. ఈ వైకుంఠ ఏకాదశి మోక్షమును ఇచ్చేది కనుక దీనికి "మోక్షద ఏకాదశి అనే నామాంతరం ఉన్నట్లు తెలుస్తోంది.

No comments:

Post a Comment