సౌజన్యరాశి సుమిత్ర

సుమిత్ర పాత్ర రామాయణంలోని స్త్రీపాత్రలలో ఉదాత్తమైనది. పుత్ర వియోగదుఃఖంతో కౌసల్య కుమిలిపోతుంది. ఆమె దుఃఖాన్ని తన వచనామృత ప్రవాహంలో కొట్టుకుని పోవునట్లు చేసిన మహాసాధ్వి ఉత్తమ ఇల్లాలు సుమిత్ర. క్షాత్ర ధర్మ మెరుగని ధర్మవిలసితమైన వ్యక్తిత్వమున్న సౌజన్యమూర్తి సుమిత్ర. అంటే స్వచ్ఛమైన మిత్ర జీవితాన్ని తలపింపజేసేదని కదా అర్థం. ఆమె పవిత్రమైన భావ సంయమనానికి ప్రతిరూపం.
కౌసల్యను ఓదారుస్తూ, నీ వేల దుఃఖిస్తున్నావు? దైన్యం చెందాలసిన అవసరం లేదు. రాముడు సుగుణాభిరాముడు. పురుషశ్రేష్ఠుడు. ఇహపరములయందు కీర్తిని ప్రసాదించే ధర్మాత్ముడు. ఆయన ధర్మాన్నుద్ధరించేందుకే అడవికి వెళ్ళాడు. తండ్రిని అసత్యపరుని చేయలేక తాను బాధల్ని భరిస్తున్నాడు. అట్టివానిని గూర్చి దుఃఖించడం సరిగాదు.
రామునికి అరణ్యవాసంలో ఏ లోటు ఉంటుందని నీవు బాధపడుతున్నావు? రాముని తండ్రిగా భావిస్తూ కంటికి రెప్పలా చూచుకునే నా బిడ్డ లక్ష్మణుడు తోడుగా వెళ్ళాడు. అరణ్యాలలో కష్టాలన్నీ బాగా తెలిసిన సీత సేవాధర్మంతో భర్తను అనుసరించి వెళ్ళింది.
ధర్మం సత్యం ఇవి రెండే ధనమని భావించిన సమర్థుడైన నీ కుమారుడు శ్రీరాముడు, తన కీర్తి పతాకాన్ని లోకంలో ఎగురవేస్తున్నాడు. అతనికి కొరత ఏమిలేదు. అతనికి దక్కని ఫలమేమున్నదన్నది సుమిత్ర.
రాజ్యం లేనంత మాత్రాన రామునికి ఏమి కొదువలేదు. రాముడు ధనహీనుడయ్యాడని కౌసల్య తలుస్తుంటే అది కూడా వ్యర్థమేనని రామునికి సత్యధర్మాలే యదార్థములై్న ధనమని చెబుతుంది. రాజులకు రాజ్యం వల్ల లభించే ధనం శాశ్వతం కాదు. ధర్మ ధనమే ముఖ్యం.
రాముని శీలం మిక్కిలి పవిత్రమైనది. ఆయన వైభవాన్ని సూర్యుడెరిగినవాడే. కావున శ్రీరాముని శరీరాన్ని తన వేడి కిరణాలతో తరింపజేయుడు. శ్రీరాముని ధర్మనిరతిని తెలిసిన వాయుదేవుడు కూడ సమశీతోష్ణంగా సంచరిస్తూ ఆయనకు అహ్లాదాన్ని కలిగిస్తాడు. చంద్రుడు కూడ రాత్రిపూట బయట పడుకుని నిద్రిస్తున్న రాముని తన కిరణాలతో ఆనందింపజేస్తాడు. రామునియందు లక్ష్మీ శౌర్యం బలం ఉన్నాయి. ఏ సంకోచం లేకుండా అరణ్యవాసాన్ని పూర్తిచేసుకుని వచ్చి రాజ్యాన్ని పొందుతాడన్నది. రామునితో కూడ లక్ష్మి వెళ్లింది గావున, వారి కొరకు దుఃఖించాల్సిన అవసరం లేదు. సీతారాములు లక్ష్మీనారాయణులే కావున, వారికొరకు దుఃఖించడం సముచితం కాదని అంతరార్థం.
కౌసల్యారాముడే సర్వస్వం. ఆయన సూరుసమ సూర్యుడు. అగ్నికి అగ్ని. ప్రభువుకు ప్రభువు. సంపదకు సంపద. కీర్తికి కీర్తి. దేవతలకు దేవత. అట్టి రామునకు అయోధ్యయైనా, అరణ్యమైనా ఒక్కటే.
పురుషోత్తముడైన రామునికి భూమి, సీత, లక్ష్మి అను ఈ మువ్వురితో రాజ్యాభిషేకం జగురబోతుందన్నదామె! ఇక్కడ రాముడు సాక్షాత్తు నారాయణుడనే భావాన్ని స్పష్టంగ వ్యక్తీకరిస్తుంది. కౌసల్యను ఓదారుస్తూ, రాముడు వనవాసాన్ని పూర్తి చేసికొని క్షేయంగా వస్తాడని, నీవు శోక మోహాలకు లోను కావద్దని అంటుంది. ఆయన సర్వ మంగళాలను కల్గించువాడు. ఆయనకెట్టి అమంగళం జరుగదు. ధర్మప్రవర్తన కల్గిన రామునికి జన్మనిచ్చిన నీవు ధన్యురాలవు. పామరులవలె ఆయన ఎడబాటుకు విలపించ వద్దు.
లక్ష్మణుడు సీతారాముల వెంట అడవికి వెళ్ళేటప్పుడు తల్లికి నమస్కరిస్తాడు. ఆమె లక్ష్మణుని శిరస్సును స్పృశిస్తూ వెళ్లు వెళ్ళు అన్నదే గాని వెళ్ళిరా అనలేదు. అలా అనడంలో ధర్మమార్గాన్ని అనుసరించు అన్న అర్థం ఉంది. రాముడు వనవాసం నుండి తిరిగి వస్తే లక్ష్మణుడు కూడ ఆయన వెంట తిరిగి వస్తాడు. ప్రయాణం చేస్తున్న యజమాని యొక్క వస్తుసామాగ్రి, అతడు తిరిగిరాగానే అది కూడ యజమానితో ఇంటికి వస్తుంది గదా! అదేవిధంగా లక్ష్మణుడూ రాముని సొత్తుకావున, రామునితో తిరిగివస్తాడు. కాబట్టి ఆయనను వెళ్ళరా అని చెప్పనవసరం లేదు.
ఆ సంబరంలో సుమిత్ర లక్ష్మణునికిలా బోధిస్తుంది. లక్ష్మణా! నీకు శుభమగుగాక. రామునియెడల మిక్కిలి అనురాగంతో ఉండుము. అతనిని వెంట అడవికి వెళ్ళుటకే భగవంతుడు నిన్ను జన్మింపజేసాడు. ఏమరుపాటు లేక సీతారాములను కనిపెట్టుకుని ఉండు. రాముని తండ్రిగాను, సీతను తల్లిగాను, అడవిని అయోధ్యగాను భావింపుము. ఇలాంటి ఉత్తమ మాతయైన సుమిత్ర స్వభావం ఎంతమంది తల్లులకు అబ్బుతుంది? అలాంటి స్వభావాన్నే నేటి తల్లులు ఆదర్శంగా తీసుకోవాలి.
సుమిత్ర మాటలందూ నేర్పరియైనా, ఆమె తన నేర్పరితనాన్ని అబద్ధాలతో గాని, అభినయంతో గాని ప్రదర్శించలేదు. ఋజుమార్గాన్ని పలుకుటే గాని 'అన్యమైన అనవసరమైన విషయాలనెప్పుడు ప్రస్తావించలేదు. ఆమె తెల్పిన విషయాలకు కౌసల్య మిక్కిలి ఓదార్పునందింది. ఆమె దుఃఖం నుండి తేరుకున్నది. మైత్రికి ప్రతిరూపమైన సుమిత్ర తాను బాధలోవున్నా, కౌసల్యను బాధల నుండి విముక్తురాలిని చేయడంలో కృతకృత్యురాలయింది. సుమిత్ర రామాయణంలో మనకు రెండుసార్లు సాక్షాత్కరిస్తుంది. లక్ష్మణుడు రామునితో వనవాసానికి వెళ్ళేముందు తల్లికి నమస్కరిస్తాడు. అది మొదటిది. ఆ తర్వాత సీతారామలక్ష్మణులు అరణ్యానికి వెళ్లగా, దశరథుడు కౌసల్యమందిరంలో పరితపిస్తుండగా వారిని శాంతింపజేసేందుకు ఆమె చాకచక్యంగా మాట్లాడిన సందర్భం రెండవది.
రాముని వనవాసానికి అర్థముంది. కాని, లక్ష్మణుడో ఆయనను అనుసరించుటలో తగిన కారణం కనిపించదు. సుమిత్ర లక్ష్మణునితో, ఈ సందర్భంలో, నాయనా! ప్రస్తుత సమస్య నీకు సంబంధించినది కాదు. నీవు ఎందుకు అరణ్యవాసం వెళ్ళాలి అనలేదు. లక్ష్మణుడు తనకు నమస్కరించినపుడు దీవించి హితవుజెప్పి పంపింది.
కౌసల్య లక్ష్మణుని అరణ్యవాసం వెళ్ళవద్దని బ్రతిమలాడింది. దశరథుని ప్రతిఘటించమన్నది. సుమిత్ర నోరు తెరిచి ఒక్క మాట కూడ అనలేదు. లక్ష్మణునికి తన తల్లి తన ధర్మమార్గానికి అడ్డురాదని తెలుసు. తల్లికి కూడ లక్ష్మణుని అచంచల ధర్మ విశ్వాసంపై నమ్మకం ఉంది. తన కుమారుడు ధర్మమార్గాన్నే అనుసరిస్తాడని తల్లి విశ్వాసం. తన తల్లి ధర్మమార్గానికి అడ్డురాదన్నది కొడుకు విశ్వాసం. వారిరువురికి ధర్మవిశ్వాసం పైగల అవగాహన మనందరికి ఆదర్శం కావాలి. వ్యక్తిగత సుఖాలకన్నా ఉన్నతాశయాలకే ప్రాధాన్యతనిచ్చే సుమిత్ర పాత్ర మిక్కిలి విశిష్టమైనది.
కౌసల్య పూజామందిరంలో ఉండగా రాముడు తన పట్టాభిషేక వార్త ఆమెకు చెబుతాడు. సీతా, సుమిత్రలు అక్కడే ఉన్నారు. కాని, సుమిత్ర ఒక్కమాట కూడ పలుకలేదు. పొంగిపోలేదు. లక్ష్మణా! నీ కొరకే రాజ్యాన్ని అంగీకరించాను. సర్వసుభాలు అనుభవించు అని రాముడన్నప్పుడు కూడ సుమిత్ర తన సంతోషాన్ని వ్యక్తం చేయలేదు. అంతేకాదు, వనవాస వార్తవిన్నప్పుడు స్థిమితంగా వుండిందేగాని, మతిచెడి ఏడ్వలేదు. సుఖదుఃఖాలలో చలించకుండా ఉండే పాత్రలలో ప్రస్తుతం ప్రధానమైంది, మొదటిది రాముని పాత్ర. రెండవది సుమిత్ర పాత్ర.
ధర్మప్రవర్తనకు, ధర్మజీవనానికి అలవాటుపడిన సుమిత్రను కేవలం ఒక గృహిణిగా, రాణిగా మనం గుర్తించలేము. ఆమె లక్షణుని వంటి త్యాగధనుని ప్రపంచానికి ప్రసాదించిన త్యాగమయి.

No comments:

Post a Comment