ప్రదక్షిణ

ఆలయాలను సందర్శించునపుడు ప్రదక్షిణ చేయడం అనేది అనాదిగా వస్తున్నా హైందవ సాంప్రదాయం. గర్భగుడిలోనున్న మూలవిరాట్టును దర్శించు కొనడానికి ముందుగా గర్భగుడిచుట్టూ భక్తులు కొన్ని సార్లు ప్రదక్షణ చేస్తుంటారు. మనసును ప్రాపంచిక విషయ చింతనల నుండి భక్తిభావాలవైపుకు మళ్ళించడానికి ప్రదక్షిణ తోడ్పడుతోంది. ఈవిధంగా మనస్సును ముందుగా శుభ్రపరచుకొని, పవిత్రమొనరించుట ద్వారా తరువాత మూలవిరాట్టును దర్శించుకొనినపుడు, ఇతర ఆలోచనలు లేకుండా పరిపూర్ణమైన మనస్సుతో దైవాన్ని ప్రార్ధించడానికి, దైవంపై మనస్సును సంపూర్ణంగా లగ్నం చేయడానికి ప్రదక్షిణ ఉపకరిస్తుంది. దేవాలయాలోనే కాకుండా, మహాత్ములకూ, పవిత్రస్థలాలకు, వృక్షాలకు, పర్వతాలకు, సరస్సులకు కూడా ప్రదక్షిణ చేయడం పరిపాటి. షిర్డీ, మంత్రాలయాలలోగల సమాధులకు, ఇళ్లలో పెంచే తులసి మొక్కకు, మారేడు, రావి వేప, మర్రి మొదలగు వృక్షాలకు, అరుణాచలం, కైలాసశిఖరం, బృందావనం మొదలగు పర్వతాలకు, మానస సరోవరంలాంటి సరస్సులకు కూడా ప్రదక్షిణలు చేస్తుంటారు. వివాహాది కార్యక్రమాల్లో వధూవరులను అగ్ని చుట్టూ ప్రదక్షిణ చేయిస్తారు. షోడశోపచార పూజావిధానంలో ఆత్మప్రదక్షిణ రూపంగాను యజ్ఞయాగాది క్రతువులలోను ప్రకక్షిణ ఒక అంతర్భాగమనేది చెప్పనవసరం లేదు.
ప్రదక్షిణ అనే పదంలోని ప్రతి అక్షరానికి భావార్థం ఉంది. ‘ప్ర’ అనగా పాప నాశనమని, ‘ద’ అనగా కోరికలను నెరవేర్చుట అని, ‘క్ష’ అనగా భవిష్యత్తు జన్మల నుండి విమోచనం అని ‘ణ’ అనగా జ్ఞానం ద్వారా ముక్తిని ప్రసాదించునదని అర్థం.
ప్రదక్షణలో సవ్యప్రదక్షణ, అససవ్యప్రదక్షణ అని రెండు పద్ధతులున్నాయి. గడియారంలో ముల్లులు తిరిగే దిశలో చేసే ప్రదక్షణ సవ్యప్రదక్షణ అంటారు. ఈ ప్రదక్షణలో విగ్రహం భక్తునికి కుడిప్రక్కన ఉంటుంది. అపసవ్య ప్రదక్షణలో ఎడమ ప్రక్కన ఉంటుంది. శుభకార్యాలలో సవ్య ప్రదక్షణ, అశుభకార్యాలలో అపసవ్యప్రదక్షణ ఉంటుంది.
ప్రదక్షణ ఎన్నిసార్లు చేయాలనేది భక్తుని ఇష్టాయిష్టాలపై ఆధారపడి ఉంటుంది. తక్కువసంఖ్యలో ప్రదక్షణలు చేసేటపుడు సాధారణంగా బేసి సంఖ్యలయిన ఒకసారో, మూడు సార్లో, ఐదుసార్లో, తొమ్మిదిసార్లో, పదకొండుసార్లో చేస్తారు. 108 సార్లో, 116 సార్లో, 1108 సార్లో చేస్తారు. కొన్ని సందర్భాలలో ప్రతిరోజూ ఒక నిర్ణీత సమయంలో 11 రోజులో, 40 రోజులో కూడ చేస్తుంటారు. ఏదేని కోరిక నెరవేరడానికి ప్రతిరోజూ ఇన్ని ప్రదక్షిణలు చొప్పున ఇన్నిరోజులు చేస్తామని మొక్కుకోవడం కూడ జరుగుతుంది. ప్రదక్షణలు బేసి సంఖ్యలో చేయడానికి ఒక కారణం కూడ ఉంది. ప్రదక్షణలు ఇంకా ‘సరి’ కాలేదని (అంటే పూర్తి కాలేదని) కాబట్టి బకాయి పడ్డ ఆ ప్రదక్షణలు పూర్తి చేయించు కొనడానికైనా రప్పించుకుంటే దైవదర్శన భాగ్యం మళ్ళీ మాకు కలుగుతుందని భావించి భక్తులు ప్రదక్షణలను ‘చేసి’ సంఖ్యతో చేసి వదలి పెడతారు.
పెద్ద పెద్ద పర్వతాలకు, సరస్సులకు ప్రదక్షణలు చేసేటపుడు కొన్ని కిలోమీటర్ల దూరం నడవవలసి వస్తుంది. ఉదాహరణకు అరుణాచలంలో గిరిప్రదక్షణ చేసేటపుడు ఏడు కిలోమీటర్లు దూరం నడవలాని అంటారు. అట్టి ప్రరిస్థితులలో ఆపకుండా ప్రదక్షణ చేయాలనే నియమం లేదు.
భక్తుని ఓపికనుబట్టి, అవసరాన్ని బట్టి మధ్యమధ్యలో ఎన్ని సార్లైనా విశ్రాంతి తీసుకొన వచ్చును. ఆహారం కూడ తీసుకొన వచ్చును. ప్రదక్షణను మౌనంగాకాని, మనస్సులో సంబందిత భాగావన్నామాన్ని స్మరిస్తూగాని, బిగ్గరగా సంకీర్తన చేస్తూగాని, ధ్యానావస్థలో మనసు మనసునుంచి గాని చేయవచ్చు. ప్రదక్షనాను ప్రారంభించాక పూర్తయ్యేవరకు మనస్సును భగవంతునిపై లగ్నం చేయడం వలన అది ఒక విధమైన ధ్యానావస్థకు దారితీస్తుంది. తద్వారా ప్రదక్షణ అనంతరం మనస్సు ఎంతో ప్రశాంతంగాను, శరీరం ఎంతో విశ్రాంతిగాను ఉంటుంది. కాబట్టి ప్రదక్షణ చేసేటపుడు లౌకిక విషయాలు ఆలోచించడం మాట్లాడటం, చేయరాదు. ప్రదక్షణలు తొందరగా పూర్తి చేయాలనే ఉద్దేశ్యంతో పరుగులు తీయటం అభిలషణీయంకాదు. నిదానంగా నిండుగర్భిణి నడిచేటంత నెమ్మదిగా ప్రదక్షణ చేయాలనేది శ్రాస్త్రనిర్ణయం. ప్రదక్షణ ప్రక్రియ ఒకసారి ప్రారంభించాక తిరిగి వెనక్కి తిరగడం, వెనక్కి నడవడం మంచిది కాదు. గర్భగుడిచుట్టూ బయట ఉపాలయాలు, చిన్న చిన్న దేవాలయాలు ఉన్నట్లయితే ముందుగా వాటన్నిటికి నమస్కరించి ఆ తరువాత గర్భగుడి చుట్టూ ఆపకుండా, ప్రక్కకు తిరిగి వేరే విగ్రహాలకు నమస్కరించా కుండా ప్రదక్షణలు చెయ్యాలి.
ప్రదక్షణ ప్రధానంగా ద్వైతమతానికి చెందిన సాంప్రదాయం. జీవాత్మను పరమాత్మ చుట్టూ ప్రదక్షణ చేయిస్తే అది కొన్నాళ్ళకు పరమాత్మలో లీనమవుతుందనే విశ్వాసమే ప్రదక్షణ చేయుటలో ముఖ్యద్దేశ్యం. ఈ సందర్భంగా భ్రమరకీటక న్యాయం గూర్చి వివరించడం ఉచితంగా ఉంటుంది. భ్రమరము అనగా తుమ్మెద గుడ్లను పెట్టి పొదగదు. పిల్లలను కనాడు. వేరొక జాతి కీటకం యొక్క పిల్లను ఎత్తుకొనివచ్చి, తన గూటిలో పెట్టి, దాని చుట్టూ ఘూమ్మని శబ్దం చేస్తూ తిరుగుతుంది. అలా ఆ కీటక్పు పిల్ల భ్రమరశబ్దాన్నే వింటూ ఉండటం వలన, భ్రమరాన్నే చూస్తూ ఉండటం వలన కొంతకాలానికి అది కూడ భ్రమరంగానే తయారైపోతుంది. అదే విధంగా ఒక నామాన్ని స్మరిస్తూ, ఒక రూపం చుట్టూ మనస్సును పరిభ్రమింప చేయుటవలన ఆ మనస్సు కొన్నాళ్ళకు ఆ రూపంలో లయమవుతుందనే విశ్వాసమే ప్రదక్షణలో ముఖ్యోద్ధేశ్యం.
రమణమహర్షి ప్రదక్షణ ప్రక్రియను అద్వైత పారంగాకూడ వివరించారు. నిరాకారుడైన భగవంతుని చుట్టూ ప్రదక్షణ చేయడం అసంభవం. అదేవిధంగా ఈ ప్రపంచమంతా భాగవత్స్వరూపమే కాబట్టి ఈ ప్రప్రంచం చుట్టూ ప్రదక్షణ చేయడంకూడా అసాధ్యం. తాను ఆత్మస్వరూపుడునని ప్రపంచంకూడా ఆత్మ స్వరూపమేనని భావించి తన కుతూ తాను తిరగడమే అసలయిన ఆత్మ ప్రదక్షణ అంటారు. మనస్సు వలెనే పరమాత్మకు, జీవాత్మకు భేదంకల్గుతుందని. కాబట్టి ఆ మనస్సును ఆత్మస్వరూపుడైన తన ఆత్మచుట్టూ ప్రదక్షణ చేయించడం వలన కొన్నాళ్ళకు మనస్సు ఆత్మలో లయమైపోయి. మనోనాశనం జరుగుతుందని, అదే అసలయిన ఆత్మప్రదక్షిణ అంటారు.

No comments:

Post a Comment