నేడు మార్కండేయ మహర్షి జయంతి

దీర్ఘాయువు విషయంలో మార్కండేయుడిని తలచుకొంటుంటారు చాలా మంది. దీనికి కారణమేమిటో, మార్కండేయ మహర్షి మహత్వమేమిటో తెలియచెప్పే కథా సందర్భం ఇది. మృకండ మహర్షి కుమారుడు మార్కండేయుడు. మృకండుడు హరిహరులిద్దరి గురించి తీవ్రంగా తపస్సు చేశాడు. ఆ తపస్సుకు హరిహరులిద్దరూ ఆనందించి, ప్రత్యక్షమై వరం కోరుకోమన్నారు. అప్పుడు మృకండుడు తనకు పుత్ర సంతానం కావాలని వరం కోరుకున్నాడు. పుత్ర సంతానం కలుగుతుందని, అయితే ఆ పుట్టబోయే పిల్లవాడు అల్పాయుష్కుడిగా జన్మిస్తాడని చెప్పి హరిహరులు అంతర్థానమయ్యారు. మృకండుడు ఇంటికి తిరిగివచ్చి తన భార్యతో ఈ విషయాన్ని చెప్పాడు. దైవవరం ప్రకారం కొద్ది కాలానికి ఆ దంపతులిద్దరికీ ఓ బాలుడు జన్మించాడు. అతడే మార్కండేయుడు. ఆ పిల్లవాడు చిన్నతనం నుంచే తపోనిష్ఠలో ఉండేవాడు. ఓ రోజు మృకండుడు మార్కండేయుడిని పిలిచి విషయమంతా వివరించాడు. మార్కండేయుడు తనకు అల్పాయుష్షు ఉందని విన్నా ఏ మాత్రం కలత చెందలేదు. తల్లిదండ్రుల దగ్గర సెలవు తీసుకుని పరమశివుడిని మెప్పించి చిరంజీవి కావాలని తపస్సు చేసుకోవటానికి వెళ్ళాడు. మార్కండేయుడికి పదహారు సంవత్సరాలు వచ్చాయి. యముడు అతడిని తీసుకెళ్ళడానికి వచ్చాడు. అయితే ఆ బాలుడు తన ఆరాధ్య దైవమైన శివలింగాన్ని గట్టిగా పట్టుకుని కూర్చున్నాడు. మృత్యువు నుంచి తనను కాపాడమని శివుడిని స్తుతించాడు. ఆ స్తుతులకు మెచ్చాడు శివుడు. చేతిలో త్రిశూలంతో ప్రత్యక్షమయ్యాడు. కాలుడు ఇక చేసేది లేక శివుడిని శరణువేడాడు. మార్కండేయుడిని విడిచిపెట్టి వెళ్లమని శివుడు గద్దించటంతో యముడు అతడిని విడిచిపెట్టి తన పరివారంతో వెళ్లిపోయాడు. శివుడు ఆ తర్వాత మార్కండేయుడిని చిరంజీవిగా ఉండిపొమ్మని ఆశీర్వదించి అంతర్థానమయ్యాడు. ఆ తర్వాత మార్కండేయుడు శ్రీహరి గురించి మరికొంత కాలం తపస్సు చేశాడు. విష్ణువు ప్రత్యక్షమయ్యాడు. ఆయన దగ్గర కూడా తనకు మృత్యువనేది లేకుండా వరం పొంది మృత్యుంజయుడయ్యాడు. ఆ తర్వాత కొంత కాలంపాటు మార్కండేయుడు కేవలం శివపూజ చేస్తూ కాలం గడుపుతూ ఉండిపోయాడు. ఇంతలో ప్రళయం వచ్చి భూమంతా మునిగిపోయింది. చుట్టూ అంతా అంధకారం అలముకుంది. అప్పుడు అంత చీకట్లోనూ మార్కండేయుడికి ఓ అద్భుత దృశ్యం కనిపించింది. ఆ నీళ్లలో ఓ వటపత్రం మీద పసిబాలుడు పడుకొని ఉండటాన్ని మార్కండేయుడు చూశాడు. ఇంతలోనే ఏదో మాయ జరిగినట్టు మార్కండేయుడు ఆ బాలుడి కడుపులోకి వెళ్లిపోయాడు. అక్కడ అంతా ఎన్నెన్నో లోకాలు ఉన్నట్లు కనిపించింది. అవన్నీ చూసేంతలోనే మళ్లీ మాయ జరిగి ఆ బాలుడి పొట్టలో నుంచి బయటపడ్డాడు మార్కండేయుడు. ఈసారి బయట నీరేమీ కనిపించలేదు. మామూలుగానే భూమి ఉంది. ఏమిటీ విచిత్రమని అనుకొంటున్నంతలోనే శివపార్వతులు అక్కడ ప్రత్యక్షమయ్యారు. అతడికి విషయాన్నంతా వివరించి ఆ వటపత్రం మీద శయనించి ఉన్నది ఎవరో కాదని, సర్వలోకాలనూ తన ఉదరంలో దాచుకున్న శ్రీమహావిష్ణువేనని వివరించి చెప్పారు. ఆ మాటలు విన్న రుషికి ఎంతో ఆనందం కలిగింది. గతంలో తాను సరైన అవగాహన లేక కేశవుడిని విస్మరించానని, ఇకపై తనవైపు నుంచి అలా జరగకుండా ఉండేలా తన మనస్సు శ్రీమహావిష్ణువు సేవ మీద లగ్నమై ఉండేలా వరం ఇవ్వమని పార్వతీ పరమేశ్వరులను మార్కండేయుడు వేడుకొన్నాడు. వారు ఆ వరాన్ని అనుగ్రహించి అంతర్థానమయ్యారు. ఆనాటి నుంచి శివానుగ్రహంతో నిరంతరం నారాయణ పద సేవలో నిమగ్నమై శివకేశవ భేదం పాటించకుండా మార్కండేయుడు జీవితం సాగించాడు. తన జీవన యాత్రలో మానవాళికి మంచిని ప్రబోధిస్తూ ఆ చిరంజీవి ఎంతో మందిని ఉత్తములుగా తీర్చిదిద్దాడు. ఇలాంటి రోజుల్లోనే ఓ రోజు మార్కండేయుడి గొప్పతనాన్ని గమనించి ధర్మరాజు ఆ రుషిని పిలిపించి సత్కరించి మానవ కర్మ గతిని గురించి అడిగి తెలుసుకున్నాడు. ఆ సందర్భంలోనే ఆ రుషి ధర్మరాజుకు అనేకానేక ధర్మాలతో పాటు కలియుగ ధర్మాలను వివరించి చెప్పాడు. పితృదేవతలు, వారుండే స్థానాలు అన్నీ చక్కగా వివరించి ధర్మరాజు సందేహాలను తీర్చాడు ఆ రుషి. ఓసారి వ్యాసుడి శిష్యుడైన జైమిని మార్కండేయుడి దగ్గరకు వచ్చి మహాభారతాన్ని గురించి తనకు కొన్ని సందేహాలున్నాయని, వాటిని తీర్చమని కోరాడు. అప్పుడు మార్కండేయుడు దూర్వాసుడి శాపంతో వపువు అనే అప్సరస పక్షిగా పుట్టిందని, మందపాలుడనే మహర్షి అనుగ్రహంతో దానికి నాలుగు పిల్లలు పుట్టాయని చెప్పాడు. శమీక మహర్షి ఆశ్రయంలో ఆ పక్షులు సకల వేద శాస్త్రాలను నేర్చుకున్నాయని, కేవలం ఆ పక్షులు మాత్రమే జైమిని సందేహాలను తీర్చగలవని చెప్పాడు మార్కండేయుడు. జైమిని ఆ పక్షుల దగ్గరకు వెళ్లి అడిగి తన సందేహాలను తీర్చుకున్నాడు. ఇలా మార్కండేయ మహర్షి శివకేశవుల అనుగ్రహం పొందిన మహాత్ముడిగా, చిరంజీవిగా లోకంలోని సర్వ విషయాలు, రహస్యాలు తెలిసిన ఉత్తమోత్తమ జ్ఞానిగా కనిపిస్తున్నాడు.
సౌజన్యం: డాక్టర్‌ యల్లాప్రగడ మల్లికార్జునరావు, ఈనాడు సాహితీ సంపద

No comments:

Post a Comment