శ్రీ పంచమి / వసంత పంచమి (శనివారం, 13.02.2016)

జ్ఞానశక్తికి అధిష్టాన దేవత సరస్వతీదేవి. మాఘ శుద్ధ పంచమిని శ్రీ పంచమి, మదన పంచమి, వసంత పంచమి, సరస్వతీ జయంతి అని జరుపుకుంటారు. సరస్వతీదేవిని వేదమాతగా, వాగేశ్వరిగా, శారదగా అభివర్ణించారు. చదువుల తల్లి, అక్షరాల ఆధిదేవత, విద్యాధిదేవత, పుస్తకపాణి, జ్ఞానప్రదాయిని, సరస్వతీదేవి జన్మదినం మాఘ మాసం శుక్ల పంచమి. శ్రీ సరస్వతీ దేవి బ్రహ్మ దేవేరి. తెల్లటి పద్మంపైన నిలుచుని, ఒక కాలు నిలువుగాను, మరొక కాలు దానిపైన అడ్డంగా ఉంచుకుని తెల్లని దుస్తులు, పువ్వులు, తెల్లని పూసల కంఠహారం ధరించి వీణను, పుస్తకాలను చేతులలో ధరించి ఉంటుంది అని పద్మపురాణంలో చెప్పబడింది.
మాఘశ్య శుక్ల పంచమ్యాం
మానవో మనవోదేవా మునీంద్రాశ్చ ముముక్షవః
వసవో యోగినస్సిద్ధ నాగా గంధర్వ రాక్షసాః
మధ్వరేణ కరిష్యంతి కల్పే కల్పే లయావధి
భక్తియుక్తశ్చ దత్త్వా చోపచారాణి షోడశ
మాఘ శుద్ధ పంచమినాడు ఈ విశ్వమంతా మానవులు, మనువులు, దేవతలు, మునులు, ముముక్షువులు, వసువులు, యోగులు, సిద్ధులు, నాగులు, గంధర్వులు, రాక్షసులు అందరూ సరర్వతీదేవిని ఆరాధిస్తారని దేవీ భాగవతం వల్ల తెలుస్తుంది. సత్వ రజస్తమో గుణాలను బట్టి అమ్మలగన్నయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ అయిన జగన్మాతను మహాకాళి, మహాలక్ష్మీ, మహాసరస్వటిగా కీర్తిస్తారు. ఈ ముగ్గురిలో సరస్వతీదేవి పరమ సాత్వికమూర్తి, అహింసాదేవి. ఆమెకు యుద్ధం చేసే ఆయుధాలు ఏమీ ఉండవు. పంచమినాడు సరస్వతీదేవితో పాటు, శ్రీమహావిష్ణువు, పరమశివుడు, సూర్య భగవానుణ్ణి కూడా ప్రత్యేక పూజలు అందుకుంటారు. శ్రీ పంచమినాడు పిల్లలకు అక్షరాభ్యాసం చేస్తే అపారమైన జ్ఞానం లభిస్తుందని, నిరాటంకంగా విద్యాభివృద్ధి జరుగుతుంది. ఈ రోజు ఉదయాన్నే లేచి, స్నానాధికాలు పూర్తిచేసుకుని అమ్మవారి అమ్మవారిని తెల్లని వస్త్రాలు, పువ్వులు, పూసలతో అలంకరించాలి.
క్షోణితలంబున్ నుదురు సోకక మ్రొక్కినుతింతు సైకత
శ్రోణికి జంచరీకచయ సుందరవేణికి, రక్షితామర
శ్రేణికి దోయజూతభావచిత్త వశీకరణైక వాణికిన్
వణికి నక్షదామశుక వారిజపుస్తక రమ్యపాణికిన్
నల్లని అందమైన శిరోజాలు గల తల్లికి దేవతలను రక్షించే ఆమెకు, బ్రహ్మదేవుని మనస్సును వశపరచుకున్న దేవికి, రుద్రాక్షమాల, చిలుక, పద్మం, పుస్తకాన్ని చేతులలో ధరించు వాణికి, సరస్వతీదేవికి నా నుదురు నేలను తాకేటట్లు వంగి భక్తితో నమస్కరిస్తాను అంటూ సరస్వతీదేవికి నమస్కరించాలి.
సరస్వతీదేవికి ప్రీతికరమైన తెల్లని నైవేద్యాలు అంటే పెరుగు, వెన్న, వరిపేలాలు తెల్లనువ్వుల ఉండలు, పాలకోవా, చెక్కెర, చెరుకురసం, బెల్లం, తేనె, కొబ్బరికాయ వంటికి నివేదించాలి.
శ్రీపంచమి నాడు రతి కామ దమనోత్సవం అని కూడా వ్యవహరిస్తారు. ఈ రోజున రతీదేవి కామదేవ పూజ చేసినట్లుగా పౌరాణికులు చెబుతున్నారు. ఋతురాజు అయిన వసంతానికి కామదేవుడికి మధ్య అవినాభావ సంబంధం ఉంది. వసంతుడు సస్యదేవత, కాముడు ప్రేమదేవత, రతీదేవి అనురాగ దేవత. ఈ ముగ్గురినీ వసంత పంచమినాడు పూజించడం వలన మనుషుల మధ్య పరస్పర ప్రేమానురాగాలు వెల్లివిరుస్తాయని పూరాణ వచనం. మాఘ శుద్ధ పంచమి నాడు వసంత ఋతువు ప్రారంభం అవుతుంది.
పంచమి మాఘ శుద్ధ పంచమి నాడు జరుపబడును. దీనిని శ్రీ పంచమి అని కూడా అంటారు. ఈ రోజు లక్ష్మీదేవికి పూజ చేయవలెను. రతీ మన్మథులను పూజించి ఉత్సవం చేయవలెనని, దానము చేయవలెనని, దీని వలన మాధవుడు (వసంతుడు) సంతోషించునని నమ్మకం. అందువలన దీనిని వసంతోత్సవము అని కూడా అంటారు. మాఘ శుద్ధ పంచమి నాడు వసంత ఋతువు ప్రారంభమవుతుంది. ఈ రోజున శ్రీమహావిష్ణువును పూజించి, బ్రాహ్మణులకు సంతర్పణ చేయాలి అని వ్రత చూడామణిలో పేర్కొనబడింది.
మాఘ శుక్ల పంచమ్యాం విద్యారంభే దినేపి చ !
పూర్వేహ్ని సమయం కృత్యా తత్రాహ్న సంయుతః రుచిః !!
మాఘ శుద్ధ పంచమినాడు ప్రాతఃకాలంలో సరస్వతీదేవిని అర్చించి వివ్యారంభం చేయాలని శాస్త్ర వచనం. ఈ రోజునే క్షీరసాగర మథనంలో నుండి మహాలక్ష్మీ ఆవిర్భవించిన కారణంగా శ్రీపంచమి అని పిలుస్తారు. ఈ రోజున మహాగణపతిని, శ్రీలక్ష్మిని, సరస్వతీదేవిని షోడశోపచారాలతో పూజించాలి. శ్రీ సరస్వతీదేవి ప్రేతిమ కానీ, జ్ఞానానికి ప్రతీకలైన పుస్తకాలను పూజాపీఠంపై పెట్టుకుని పూజ చేయాలి. శ్రీ సరస్వతీదేవిని తెల్లని పువ్వులతో, సుగంధద్రవ్యాలతో, చందనంతో అర్చించి శుక్లవస్త్రాన్ని నివేదించాలి. తరువాత పిల్లలకు అక్షరాభ్యాసం జరిపిస్తే సరవ్వతీదేవి కరుణాకటాక్షాలవల్ల అపారమైన జ్ఞానం లభించి నిరాటంకంగా విద్యాభివృద్ధి జరుగుతుందని ప్రజలందరి ప్రగాఢ విశ్వాసం.
వాక్, బుద్ధి, వివేకం, విద్య, కళలు, విజ్ఞానం వీటన్నింటికీ ఆధిదేవత సరస్వతీదేవి. సరస్వతీదేవి హంసవాహినిగా, వీణాపాణిగా, పుస్తకం మాలాధారిణిగా పూజింపబడుతుంది. సరస్వతీదేవి ధరించే వీణ పేరు 'కచ్చపి'.

No comments:

Post a Comment