చైత్ర శుద్ధ పాడ్యమి నుంచి...అంటే ‘ఉగాది’ నుంచి మనకు నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. అలాగే ఋతువులలో తొలి ఋతువైన వసంతఋతువు మొదలవుతుంది. ఈ వసంతఋతువుకు ఎంతో ప్రముఖ్యత ఉంది. శిశిరంలో .... ఆకులు రాల్చి సర్వస్వం కోల్పోయిన ప్రకృతికాంత...నవ పల్లవాలతో చిగిర్చి., పూల సోయగాలతో కనువిందులు చేస్తూ., సుగంథాల సేవలతో ప్రకృతి పురుషునకు మకరందాల విందులు అందించే.. ఈ వసంతఋతువు అంటే గుణరహితుడైన ఆ పరమాత్మనకు కూడా ఇష్టమే. అందుకే....‘ఋతూనాం కుసుమాతరః’ అని ‘గీత’లో చెప్పాడు పరమాత్ముడైన శ్రీకృష్ణుడు. అనంతమైన కాలంలో., కేవలం ఏడాదికో రెండు నెలలు ఆయుష్షు ఉండే ఈ వసంతఋతువుకు ఎందుకంత ప్రాధాన్యత?
ఈ వసంతఋతువులోనే దేవదేవుడైన శ్రీమహావిష్ణువు పరిపూర్ణ మానవునిగా అవనిపై అవతరించాడు. అదే శ్రీరామావతారం. అంతవరకూ రాక్షసుల యుద్ధాలతో విసిగి వేసారిన సర్వలోకాలు శ్రీరామ జననంతో మంచి రోజులు వచ్చాయని సంతోషించాయి. పుడుతోనే సకల జీవకోటికీ ఆనందాన్ని కలిగించినవాడు శ్రీరాముడు. అందుకే..సంవత్సరంలో తొలి పండుగ అయిన ఉగాది నుంచి శ్రీరామనవమి వరకూ ‘వసంతనవరాత్రులు’ సంబరంగా జరుపుకోవడం ఆచారమైంది. అయితే... తొమ్మిది రాత్రులే ఎందుకు జరుపుకోవాలి ? పదిరాత్రులు జరుపుకోకూడదా ? ఏమిటీ లెక్క ? అనే సందేహం చాలామందికి కలుగుతుంది. ‘నవ’ అంటే ‘తొమ్మిది’ అని ‘కొత్త’ అని రెండు అర్థాలు ఉన్నాయి. ‘కొత్త’అంటే...
అంతవరకూ రాక్షస బాధలతో శోకమయంగా గడిపిన రాత్రులు పోయి ఆనందమయ నవరాత్రులు వచ్చాయి అని అర్థం.ఇక తొమ్మి రాత్రులు ఎందుకుచేయాలంటే....
భగవంతుని ఆరాధనలో ‘భక్తి’ తొమ్మిది రకాలు.
శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనం
అర్చనం వందనం దాస్యం సఖ్య మాత్మనివేదనం
అర్చనం వందనం దాస్యం సఖ్య మాత్మనివేదనం
శ్రవణం - కీర్తనం - స్మరణం - పాదసేవనం - అర్చనం - వందనం - దాస్యం - సఖ్యం - ఆత్మనివేదనం. ఇవి నవవిధ భక్తిమార్గాలు. భాగవతోత్తములుగా ప్రసిద్ధిగాంచిన ఎందరో భక్తులు ఈ నవవిధ భక్తి మార్గలలో ఏదో ఒక మార్గాన్ని ఎంచకుని పరమాత్మని సన్నిధి చేరుకున్నవారే.
నవరాత్రులు తొమ్మిది రోజులు ఒక్కొక్క రోజు., ఒక్కొక్క భక్తి మర్గాన్ని ఎంచుకుని., అలా తొమ్మిది రోజులు తొమ్మిది భక్తి మార్గాలతో భగవంతుని సేవించి తరించడానికే... ఈ నవరాత్రులను ఏర్పాటు చేసారు మన ఋషులు.
No comments:
Post a Comment