రామాయణం -- 37

అప్పుడు దశరథ మహారాజు మంత్రి అయిన జాబాలి లేచి " నేను ఇందాకటినుంచి నీ మాటలు వింటున్నాను రామ. చాలా చిత్రమైన మాటలు మాట్లాడుతున్నావు. నిన్ను కనేటప్పుడు దశరథుడికి తెలుసా నువ్వు ఇలా పుడతావని. దశరథుడు కాముకతతో తన వీర్యాన్ని అయన భార్య అయిన కౌసల్య యందు ప్రవేశపెట్టాడు. కౌసల్య కూడా కాముకతతో దశరథ మహారాజు దెగ్గర నుంచి వీర్యాన్ని పుచ్చుకొని, ఆ శుక్లాన్ని తన శోణితంతో కలిపింది. అప్పుడు ప్రకృతి సిద్ధంగా గర్భం ఏర్పడింది. అందులోనుంచి నువ్వు పుట్టావు. తల్లేమిటి తండ్రేమిటి, నువ్వు పెంచుకున్నావు ఈ పిచ్చి భక్తి. పుట్టిన ప్రతి ప్రాణి తనంతట తాను వెళ్ళిపోతుంది, అప్పుడు ఈ అమ్మతనాలు, నాన్నతనాలు ఏమి ఉండవు. చనిపోయిన వాళ్ళని పట్టుకొని ఏడిస్తే వాళ్ళు మాట్లాడుతున్నార. వెళ్ళిపోయిన వాడి మాటకి కూడా గౌరవమేమిటి. వాళ్ళతో పాటే ఆ మాట కూడా వెళ్ళిపోతుంది. ఇంకా సత్యము, ధర్మము అంటావేంటి. అసలు ఇవన్నీ ఎందుకోచ్చాయో నేను చెప్పనా రామ, ఏదో రకంగా ఇలాంటి పుస్తకాలు రాసేస్తే డబ్బున్న వారి దెగ్గర దానాలు, ధర్మాలు కొట్టేయచ్చని కొంతమంది ఇలాంటి ధర్మాల్ని రాశారు. అసలు నిజంగా పితృకార్యాలు, తద్దినాలు లేవు, అన్నీ ఒట్టిదే. పక్క ఊరిలో ఉన్నవాడికి ఇక్కడ అన్నం పెడితే, వాడి ఆకలి తీరదు కాని, చనిపోయి ఎక్కడో ఉన్న మీ నాన్నకి ఇక్కడ తద్దినం పెడితే ఆకలి తీరుతుందా, ఎవడు చెప్పాడు ఇవన్నీ. హాయిగా ఉన్న దానిని అనుభవించు " అన్నాడు.
ఈ మాటలు విన్న రాముడు ఎరుపెక్కిన కళ్ళతో " జాబాలి! నువ్వు చెప్పిందే సత్యమైతే, నిజమైతే, అసలు జీవకోటికి ప్రవర్తన అనేది ఉండడు. ఎవడి ఇష్టం వచ్చినట్టు వాడు ప్రవర్తించచ్చు. ఒకడి ప్రవర్తనని బట్టి వాడు ఎటువంటివాడో నిర్ణయిస్తారు పెద్దలు. ఆ ప్రవర్తన వేదమునకు అనుగుణంగా ఉండాలి. ఆ వేదము అపౌరుషేయము. వేదం ఏమి చెప్పిందో అది చెయ్యాలి. ఈ కంటితో చూసినవి సత్యాలు కావు, ఈ బుద్ధికి పుట్టినవన్ని సత్యాలు కావు, మన సంప్రదాయంలో వేదమే సత్యం. ఇహలోకంలో యజ్ఞయాగాది క్రతువులు చేసిన మహా పురుషులు, 100 క్రతువులు చేస్తే ఇంద్ర పదవిని పొందారు. ఇక్కడ పుణ్యాలు చేసినవారు ఊర్థలోకాలు పొందారు. ఇక్కడ పాపాలు చేసినవారు హీనయోనులలోకి వెళ్ళిపోయారు. ఇక్కడ తద్దినం పెడితే, సూక్ష్మ శరీరంతో మూడు తరాల వరకు పితృ లోకంలో ఉన్నవాడికి కడుపు నిండుతోందని వేదం చెబుతోంది. నీలాంటి నాస్తికుడిని( దేవుడు లేడన్నవాడు నాస్తికుడు కాదు, నాకు వేదం ప్రమాణం కాదన్నవాడు నాస్తికుడు), ప్రవర్తన తెలియనివాడిని,
సత్యం ఎవ ఈష్వరొ లొకె సత్యం పద్మా సమాష్రితా |
సత్య మూలాని సర్వాణి సత్యాన్ న అస్తి పరం పదం ||
ఏ సత్యాన్ని వేదం చెబుతుందో, ఏ సత్యాన్ని ఆశ్రయించి లక్ష్మి ఉన్నదో, ఏ సత్యాన్ని ఆశ్రయించి ఈ సమస్త బ్రహ్మాండములు నిలబడ్డాయో, అటువంటి సత్యానికి ఆధారమైన వేదాన్ని తృణీకరించి మాట్లాడుతున్న నీవంటి నాస్తికుడిని ఎలా చేర్చుకున్నాడయ్య దశరథ మహారాజు. నాకు ఇవ్వాళ దశరథ మహారాజుని చూస్తే జాలి వేస్తుంది " అన్నాడు.
ఈ మాటలు విన్న జాబాలి గజగజ ఒణికిపోతూ " నేను వేదాన్ని తిరస్కరించినవాడిని, నమ్మని వాడిని కాదు రామ, భరతుడు అంత బెంగ పెట్టుకున్నాడు కదా, కనుక ఏదో ఒక వాదం చేస్తే మీరు తిరిగి వస్తారు కదా అని అలా చెప్పాను " అన్నాడు.
అప్పుడు వశిష్ఠుడు వచ్చి, బ్రహ్మగారి నుంచి ఇక్ష్వాకు వంశం ఎలా ఏర్పడిందో చెప్పి " ఈ వంశంలో ఎప్పుడూ పెద్దవాడే రాజవుతున్నాడు. తండ్రి మాటని విని నేను అరణ్యాలకి వచ్చానంటున్నావు, తండ్రి సర్వకాలముల యందు పూజనీయుడు. తండ్రి ఎలా గొప్పవాడో, తల్లి కూడా అలా గొప్పది. ఇప్పుడు నీ ముగ్గురు తల్లులు వచ్చి నిన్ను వెనక్కి రమ్మంటున్నారు. తండ్రి వీర్యప్రదాత, తల్లి క్షేత్రాన్ని ఇస్తుంది. పిల్లవాడు బయటకి వచ్చాక తల్లిదండ్రులు ఇద్దరూ పెంచుతారు. కాని మళ్ళి ఈ శరీరంలోకి రాకుండా జ్ఞానం ఇచ్చేవాడు గురువు మాత్రమే. నేను నీకు, నీ తండ్రికి కూడా గురువుని. నేను చెప్తున్నాను, నువ్వు అరణ్యమునుంచి వెనక్కి వచ్చి రాజ్యాన్ని తీసుకుంటే ధర్మము తప్పిన వాడివి అవ్వవు, అందుకని వెనక్కి వచ్చి రాజ్యాన్ని తీసుకో " అన్నాడు.
అప్పుడు రాముడు " మా తండ్రిగారు నాతో ఒక మాట అన్నారు. రామ! నీ మీద నాకు నమ్మకం ఉంది, నేను కైకకి ఇచ్చిన వరం నిజం అవ్వడం నీ చేతిలో ఉందని చెప్పారు. అందుకని నేను అరణ్యవాసానికి వచ్చాను. మీరు అన్నట్టు, నేను వెనక్కి రావడం ధర్మంలో ఒక భాగం కావచ్చు. కాని, నేను ఇచ్చిన వరం ఎందుకూ పనికిరాకుండా పోయందని నా తండ్రిగారు బాధ పడడం నాకు ఇష్టం లేదు. అమ్మ శరీరంలోకి తండ్రి ప్రవేశపెట్టిన తేజస్సు వలన కదా శిశువు అనే వాడు బయటకి వచ్చేది, ఆ శిశువు పెరిగాక గురువు జ్ఞానం బోధిస్తాడు. ఆ శిశువు అనే వాడు రావడానికి మూలం తండ్రి. కావున ఆ తండ్రి మాట చెడిపోకూడదు, అందుకని నేను నా తండ్రి మాటని అతిక్రమించాలేను " అన్నాడు.
అప్పుడు భరతుడు సుమంత్రుడిని పిలిచి " దర్భలు తీసుకొచ్చి ఇక్కడ పరవండి, నేను ముఖం మీద బట్ట వేసుకొని, ఏది చూడకుండా, రాముడికి ఎదురుగా కూర్చుంటాను " అన్నాడు (పూర్వకాలంలో రాజు తప్పుచేస్తే, ధర్మం తప్పితే, బ్రాహ్మణులు ఇలా ముఖం మీద గుడ్డ వేసుకొని రాజుకి ఎదురుగా కూర్చునేవారు, రాజుకి తన తప్పుని తెలియచెయ్యడం కోసమని). అప్పుడు వెంటనే సుమంత్రుడు దర్భలని పరిచేశాడు, వాటి మీద భరతుడు ముఖం మీద బట్ట వేసుకొని కూర్చున్నాడు.
" నువ్వు నన్ను ఇలా నిర్బందించచ్చా భరతా, నేను ఏ తప్పు చేసానని నువ్వు ఇలా దర్భల మీద కూర్చున్నావు. ఇలా బ్రాహ్మణుడు కూర్చుంటాడు, నువ్వు బ్రాహ్మణుడివి కాదు, క్షత్రియుడవి. క్షత్రియుడవైన నువ్వు ఇలా కూర్చోవడం నీ మొదటి తప్పు. నా యందు ఏ తప్పు లేకపోయినా నువ్వు ఇలా కూర్చోవడం నీ రెండవ తప్పు. కాబట్టి నువ్వు చేసిన ఈ దోషముల యొక్క పరిష్కారానికి లేచి ఆచమనం చెయ్యి, అలాగే ఒక ధార్మికుడిని ముట్టుకో " అన్నాడు రాముడు.

అప్పుడు భరతుడు లేచి, ఆచమనం చేసి రాముడిని ముట్టుకున్నాడు. తరువాత ఆయన అక్కడున్న పౌరులందరినీ పిలిచి " రాముడు ఎంత చెప్పినా రానంటున్నాడు. అందుకని నేను కూడా ఇక్కడే రాముడితో ఉండిపోతాను, లేకపోతే నా బదులు రాముడు రాజ్య పాలనం చేస్తాడు, నేను అరణ్యాలలో ఉంటాను " అన్నాడు.
ఈ మాటలు విన్న రాముడు నవ్వి " భరతా! అలా మార్చుకోవడం కుదరదు. నాన్నగారు నిన్ను అరణ్యాలకి వెళ్ళమని చెప్పలేదు. 14 సంవత్సరాలు పూర్తి అయ్యాక నేను తిరిగి వచ్చి రాజ్య పాలన చేస్తాను. అప్పటివరకు నువ్వే రాజ్యాన్ని పరిపాలించు " అన్నాడు. అక్కడే ఉన్న ఋషులు భరతుడి దెగ్గరికి వచ్చి, రాముడు చెప్పిన్నట్టు నువ్వు రాజ్యాన్ని పరిపాలించు అన్నారు.
అప్పుడు భరతుడు, నాకు ఈ రాజ్యం వద్దు, ఈ రాజ్యాన్ని నువ్వే పరిపాలించు అని రాముడి పాదాల మీద పడ్డాడు.
" చంద్రుడికి వెన్నెల లేకుండా పోవచ్చు, హిమాలయ పర్వతాల నుంచి జలం రాకుండా ఆగిపోవచ్చు, సముద్రం చెలియలి కట్ట దాటిపోవచ్చు కాని, నేను నా ప్రతిజ్ఞని మాత్రం మానను " అని రాముడన్నాడు.
ఈ సమయంలో వశిష్ఠుడు లేచి " అయితే రామ, నీదైన రాజ్యాన్ని భరతుడు ఈ 14 సంవత్సరాలు పరిపాలిస్తాడు, నువ్వు తిరిగొచ్చాక నీకు ఇస్తాడు " అని చెప్పి, తాను తీసోకొచ్చిన బంగారు పాదుకలని భరతుడికి ఇచ్చి " భరతా! ఈ పాదుకల మీద రాముడిని ఒకసారి ఎక్కి దిగమను. ఇక నుంచి అయోధ్యని ఈ పాదుకలు పరిపాలిస్తాయి " అన్నాడు.(వశిష్ఠుడు త్రికాలవేది, ఆయనకి ముందే తెలుసు రాముడు తిరిగి రాడని. అందుకనే తనతో పాటుగా బంగారు పాదుకలని తీసుకొచ్చాడు).
భరతుడు ఆ బంగారు పాదుకలకి నమస్కరించి, వాటిని రాముడి పాదాల దెగ్గర పెట్టాడు. అప్పుడు రాముడు ఒకసారి వాటి మీద ఎక్కి దిగాడు.
తతహ్ షిరసి కృ్ఇత్వా తు పాదుకె భరతహ్ తదా |
ఆరురొహ రథం హృ్ఇష్టహ్ షత్రుఘ్నెన సమన్వితహ్ ||
అప్పుడు భరతుడు సంతోషంగా ఆ పాదుకలని తన శిరస్సు మీద పెట్టుకొని శత్రుఘ్నుడితో కలిసి తిరిగి అయోధ్యకి పయనమయ్యాడు. అయోధ్యకి వెళ్ళాక ఆ పాదుకలని సింహాసనం మీద పెట్టి, తాను ఏ పని చేసినా, ఆ పాదుకలకి చెప్పి చేసేవాడు. ఆ పాదుకలలో రాముడిని చూసుకుంటూ గడిపాడు.
తరువాత రాముడి దెగ్గరికి అక్కడ ఉండేటటువంటి తాపసులంతా వచ్చి " ఇక్కడ దెగ్గరలో ఖరుడు అనే రాక్షసుడు ఉన్నాడు. నువ్వు ఇక్కడికి వచ్చి తిరుగుతున్నావని తెలిసి, నీ మీద ఏ క్షణానైనా దండయాత్ర చెయ్యడానికి సిద్ధపడుతున్నాడు. ఇప్పటికే వాడు మమ్మల్ని రోజూ కష్టపెడుతున్నాడు, అందుకని మేము ఇక్కడ ఉండకుండా, దూరంగా వేరొక వనానికి వెళ్ళిపోతున్నాము. కావున నువ్వు కూడా మాతో వస్తావా " అని అడిగారు.
ఇక్కడికి భరతుడు, శత్రుఘ్నుడు, కౌసల్య, సుమిత్ర, కైకేయ వచ్చారు, ఇక్కడే ఉంటె నాకు వాళ్ళు బాగా జ్ఞాపకం వస్తుంటారు. ఇక్కడికి వచ్చిన సైన్యములోని జంతువులన్నీ మలమూత్రాలని విసర్జించడం వలన ఈ ప్రదేశం సౌచాన్ని కోల్పోయింది, అని రాముడు తన మనస్సులో అనుకొని, సీతా లక్ష్మణులతో కలిసి ఆ తాపసులతో బయలుదేరాడు.
అలా కొంత దూరం ప్రయాణించాక వారు అత్రి మహర్షి ఆశ్రమానికి చేరుకున్నారు. అప్పుడు అత్రి మహర్షి వారికి స్వాగతం చెప్పి " నా భార్య పేరు అనసూయ( కర్దమ ప్రజాపతి - దేవహుతిల కుమార్తె). ఆమె చాలా వృద్ధురాలు, ఆవిడ ఒకసారి దేవతల కోసం 10 రాత్రులని కలిపి ఒక రాత్రి చేసింది, దేశంలో 10 సంవత్సరాల పాటు క్షామం వస్తే, ఎండిపోయిన గంగా నదిని తన తపఃశక్తితో ప్రవహించేటట్టు చేసింది, ప్రజలందరికి అన్నం పెట్టింది, ఆమె పదివేల సంవత్సరముల పాటు ఘోరమైన తపస్సు చేసింది, సర్వభూతముల చేత నమస్కరింపబడడానికి యోగ్యురాలు. రామ! సీతమ్మని ఒకసారి అనసూయ చూస్తుంది, కనుక ఆమె దెగ్గరికి ఒకసారి పంపించు " అని అన్నాడు.
తన దెగ్గరికి వచ్చిన సీతమ్మని తన వొళ్ళో కూర్చోపెట్టుకుని అనసూయ ఇలా అనింది " సీతా! నువ్వు మహా పతివ్రతవని, భర్తని అనుగమించి అరణ్యానికి వచ్చావని విన్నాను. ఆయన దుర్మార్గుడే కావచ్చు, ధనం లేనివాడు కావచ్చు, హీనుడే కావచ్చు, పతితుడే కావచ్చు, గుణములు లేనివాడు కావచ్చు, కాని స్త్రీకి పతియే దైవము అని నేను విశ్వసిస్తున్నాను, నీ అభిప్రాయం కూడా చెప్పు " అని అడిగింది.
అప్పుడు సీతమ్మ " నేను పుట్టింట్లో ఉన్నప్పుడు నాకు ఈ మాటే చెప్పారు, పాణిగ్రహణం చేయించేటప్పుడు కూడా ఈ మాటే చెప్పారు, అత్తవారింటికి వచ్చాక కౌసల్య ఈ మాట చెప్పింది, అరణ్యాలకి బయలుదేరేముందు కూడా కౌసల్య ఈ మాట చెప్పింది. కాని నా అదృష్టం ఏంటంటే, అమ్మ, నాన్న, సోదరులు, గురువు ఎలా ప్రేమిస్తారో, నా భర్త నన్ను అలా ప్రేమిస్తాడు. గొప్ప ధర్మం తెలిసున్నవాడు, జితేంద్రియుడు. ఇటువంటి భర్త లభిస్తే, అతనిని ప్రేమించడంలో గొప్ప ఏముందమ్మ " అనింది.
సీతమ్మ మాటలకి ఎంతో సంతోషించిన అనసూయ కొన్ని కానుకలు ఇస్తూ " సీతా! నీకు కొన్ని బట్టలు ఇస్తున్నాను, ఇవి ఎప్పుడూ నలగవు, కొన్ని పువ్వులు ఇస్తున్నాను, ఇవి ఎప్పుడూ వాడవు, అంగరాగములు ఇస్తున్నాను, ఇవి ఎప్పుడూ వాసన తగ్గవు, ఇవి నువ్వు పెట్టుకుంటే, నీ భర్త నిన్ను చూడగానే ఆనందాన్ని పొందుతాడు. లక్ష్మీదేవి శ్రీ మహా విష్ణువుని సంతోషపెట్టినట్టు, నువ్వు ఇవి పెట్టుకొని నీ భర్తని సంతోషపెట్టు. కాబట్టి ఇవి కట్టుకొని ఒకసారి రాముడికి కనబడు " అనింది.
అప్పుడు సీతమ్మ ఇవన్నీ కట్టుకొని, అత్రికి, అనసూయకి నమస్కారం చేసి రాముడి దెగ్గరికి వెళ్ళింది. రాముడు సీతని చూసి " సీతా! ఎవ్వరూ పొందని గొప్ప గొప్ప బహుమతులు పొందావు " అని సీతమ్మ వంక చూసి పొంగిపోయాడు.
తరువాత అనసూయ సీతమ్మని తన దెగ్గర కూర్చోపెట్టుకొని " నీ పెళ్లి గురించి వినాలని నాకు చాలా కోరికగా ఉంది, నాకు నీ కళ్యాణం గురించి చెప్పు" అనింది.
అప్పుడు సీతమ్మ " జనక మహారాజు భూమిని దున్నుతుంటే, నాగటి చాలుకి తగిలి పైకి వచ్చాను కాబట్టి నన్ను సీతా అని పిలిచారు. మా నాన్నగారు నన్ను చాలా కష్టపడి పెంచారు. నాకు యుక్త వయస్సు వచ్చాక, శివ ధనుస్సుని ఎత్తినవాడికి నన్ను ఇస్తానన్నారు. అప్పుడు రాముడు శివ ధనుర్భంగం చేశాడు. వెంటనే మా తండ్రి నాకు ఒక వరమాల ఇచ్చి, నా చెయ్యిని రాముడి చేతిలో పెట్టి, నీళ్ళు పోద్దామని జలకలశం తీసుకొచ్చి చెయ్యి పెట్టబోయాడు. కాని రాముడు, నేను క్షత్రియుడని కనుక శివ ధనుస్సుని విరిచాను, నీ కుమార్తెని భార్యగా స్వీకరించాలంటే, మీరు
కన్యని ఇచ్చినంత మాత్రాన స్వీకరించను. ఈ కన్య నాకు భార్యగా ఉండడానికి తగినదో కాదో, నా తండ్రిగారు నిర్ణయించాలి. ఆయన అంగీకరిస్తే స్వీకరిస్తాను అన్నాడు. అందుకని మా నాన్నగారు దూతల చేత దశరథ మహారాజుకి కబురు చేశారు. దశరథ మహారాజు మా వంశ వృత్తాంతాన్ని విన్నాక వివాహానికి ఒప్పుకున్నారు. అప్పుడు నేను రాముడికి అర్థాంగిని అయ్యాను " అని సీతమ్మ చెప్పింది. ఈ మాటలు విన్న అనసూయ పొంగిపోయింది.
తరువాత వారు, మేము ఆశ్రమం నిర్మించుకుంటాము, ఎటువెళ్ళమంటారు అని అత్రి మహర్షిని అడుగగా, ఆయన " ఇక్కడ రాక్షసులు, క్రూరమృగాలు తిరుగుతూ ఉంటాయి. ఋషులు పళ్ళు తెచ్చుకునే దారి ఒకటి ఉంది, అందుకని మీరు చాలా జాగ్రత్తగా ఆ దారిలోవెళ్ళండి " అని, ఆ దారిని చూపించారు. అప్పుడు అత్రి మహర్షి దెగ్గర, అనసూయ దెగ్గర ఆశీర్వాదం తీసుకొని, సీతారామలక్ష్మణులు ఆ దారిలొ తమ ప్రయాణాన్ని సాగించారు.
మేఘాలలోకి సూర్యుడు వెళితే ఎలా ఉంటుందో, అలా సీతాలక్ష్మణులతో రాముడు వెళ్ళాడు.


No comments:

Post a Comment