దానము ఇవ్వతగిన వస్తువులు
పార్వతీదేవి " నాధా ! దానము ఇవ్వతగిన వస్తువుల గురించి తెలపండి " అని అడిగింది.పరమశివుడు " పార్వతీ ! అన్నము నీరు అన్నీ జీవులకు ప్రాణాధారము. కనుక దానము చెయ్యతగిన వస్తువులలో నీరు ముఖ్యమైనవది.
అతిథులకు అన్నము నీరు ఇచ్చి తృప్తిపరిస్తే వారికి స్వర్గలోకసుఖములు ప్రాప్తిస్తాయి. బంగారము అగ్నితో సమానము. కనుక బంగారము దానం చెయ్యడం అగ్నిని దానము చెయ్యడంతో సమానము. తరువాత స్థానము గోదానము చెయ్యడము. గోవును బ్రాహ్మణులకు దానము చేసిన ఆ గోవు శరీరము మీద ఎన్ని రోమములు ఉంటాయో అన్ని సంవత్సరాలు స్వర్గలోక సుఖాలు అనుభవిస్తాడు. కపిలగోవు దానము ఇంకా పవిత్రమైనది.
కపిలగోవును దానము ఇచ్చిన 21 తరాల పితరులు స్వర్గానికి వెడతారు. తరువాతది భూదానము. భూదానము చేసిన వారు ఆ భూమి ఉన్నంత కాలము స్వర్గసుఖములు అనుభవిస్తారు. భూమిలో సకల సంపదలు ఉంటాయి కనుక భూమిని దానం చేసిన సకల సంపదలను దానము చేసినట్లే . తరువాత దానము కన్యాదానము.
కన్యాదానము చేస్తే యమధర్మరాజు ప్రీతి చెందుతాడు. దేవతలు హర్షిస్తారు. కన్యాదానము చేసిన వాడికి తేజస్సు, యశస్సు కలుగుతాయి. తరువాతి దానము విద్యాదానము. విద్యాదానము అర్హులకు మాత్రమే చేయాలి. అపాత్రా దానము చేయరాదు. విద్యాదానము చేసిన వారికి శాశ్వతంగా స్వర్గలోకము ప్రాప్తిస్తుంది. కొంత మందికి విద్య రాదు. అటువంటి వారు విద్యాదానము చెయ్య లేరు. అటువంటి వారు బాగా విద్యవచ్చిన గురువులకు దక్షిణ ఇచ్చి వారి చేత విద్య చెప్పించిన ఎడల వారే స్వయంగా విద్యచెప్పించిన ఫలితం దక్కుతుంది. పార్వతీ నువ్వులు దానము చేస్తే అగ్ని ష్ఠోమ ఫలము, వస్త్రములను దానంగా ఇచ్చిన అన్ని పీడల నుండి విముక్తి, దాసదాసీ జనములను దానంగా ఇస్తే ఆత్మ సంతృప్తి, నదులను, జలప్రవాహాలను దాటిస్తే దుఖములన్నీ తొలగి పోతాయి.
ప్రయాణము చేయు బాటసారులకు రహదారుల పక్కన సత్రములు కట్టి ఆశ్రయము కల్పించిన సకల శుభములు కలుగుతాయి. ఇవీ దానముకు కలుగు ఫలములు " అని మహేశ్వరుడు చెప్పాడు.

No comments:

Post a Comment