ఇళోపాఖ్యానం-శ్రీ మహాభాగవతము

వైవస్వత మనువుకి పుత్రసంతానం కలుగకముందు వశిష్టుని దగ్గరకు వెళ్లి తన కష్టం చెప్పుకున్నాడు. ఆ మనువు కోరిక తీర్చడానికి వశిష్టుడు , తనే స్వయంగా బ్రహ్మగా మిత్రావరుణమనే యాగం చేయించ సిద్ధమయ్యాడు. ఐతే , యాగం చేసేముందు ఆ మనువు భార్య శ్రద్ధ , యాగం జరిపించే బ్రాహ్మణునితో తనకు కుమార్తె కావాలని వేడుకుంది. అందుకు అంగీకరించి , ఆ బ్రాహ్మణుడు చేసాడు. అందుచేత మనువుకి ఇళ అనే కుమార్తె పుట్టింది. అప్పుడు ఆ మనువు గురువుగారి దగ్గరకు వెళ్ళి , " ఇదేమీ విపరీతం? నే కొడుకుని కావాలని యాగం చేస్తే , ఆడపిల్ల పుట్టడమేమిటి? మీ నోట అసత్యం రాదు. మరైతే ఎందుకిలా అయింది?" అని అడిగాడు. వశిష్టుడు జరిగినది గ్రహించి, "నీ భార్య యాగక్రియ జరిపించిన బ్రాహ్మణుడికి కుమార్తె కావాలని కోరితే , అతడదే ధ్యానిస్తూ హోమం చేసాడు కనుక అలా అయింది. పోనీలే, నా తపోమహిమతో ఆ ఆడపిల్లను మగవానిగా మార్చేస్తాను" అని భగవంతుని ధ్యానిస్తూ , తన మంత్రం వేయగా ఆ ఇళ , సుద్యుమ్నుడనే పురుషునిగా మారిపోయింది.

ఆ సుద్యుమ్నుడు రాజ్యమేలుతుండగా ఒక నాడు తన మంత్రులు , పరిచారకులనూ, తీసుకుని వేటకని బయలుదేరాడు. అతను ఉత్తర దిక్కు అలా వెళ్తూ, మేరు పర్వత ప్రాంతంలో ఉన్న ఒక అడవిలోకి ప్రవేశించాడు. అందులో కాలుపెట్టగానే అతడు మళ్ళీ ఆడమనిషైపోయాడు. అంతేకాదు, అతని గుర్రం ఆడదిగానూ, అతని అనుచరులు అందరూ ఆడవారిగానూ , మారిపోయారు. ఎందుకని అంటే , అది శివుడు పార్వతికిచ్చిన మాట!

పూర్వమదే అడవిలో పార్వతి శివుడు తొడ మీద కూర్చుని ప్రేమకలాపం జరిపిస్తుండగా, కొందరు మునులు అటేపోతూ, కానవచ్చారు. ఆ మునులు వారిని చూడగానే కనులు తిప్పుకుని తిరిగి వెళ్ళిపోయారు. అప్పుడు శివుడు పార్వతికి ఇకమీదెప్పుడూ అలాంటి సిగ్గుపడే అవస్థ రాకూడదని , ఆ వనంలోకి యెవరు అడుగు పెట్టినా వారు ఆడవారిగా మారిపోదురు గాక అని శపించాడు.

ఆ సుద్యుమ్నుడు ఆడరూపంలో తన పరిచారికలతో అలా అలా వనాలలో తిరుగుతూన్నపుడు , చంద్రుని కొడుకు బుధుడు ఆమెను చూసి మోహించాడు. ఆమె కూడా అందుకు అంగీకరించి అతనితో సుఖంగా జీవిస్తుండగా వారికి పురూరవుడు అనే కొడుకు పుట్టాడు. కొన్నాళ్లకి తన పాత చరిత్ర గుర్తుకొచ్చి , చాలా విచారించి, సుద్యుమ్నుడు తన గురువైన వశిష్టుని ప్రార్థించగా , అతను వాడి అవస్థకి విచారించి, దాని పరిహారార్థమై , శంకరుని తపస్సు చేసాడు. శంకరుడు వశిష్టుని తపస్సుకి మెచ్చి , "ఓ వశిష్టా, నీ తపోమహిమ వలన అతడు తిరిగి ఒక నెల పురుషరూపం, మరో నెల స్త్రీరూపం పొందుతూ ఉంటాడు" అని వరమిచ్చాడు.

సుద్యుమ్నుడు ముసలివాడవగానే తన కుమారుడు పురూరవుని రాజు చేసి, వానప్రస్థాశ్రమం తీసుకున్నాడు.

No comments:

Post a Comment