Showing posts with label సీత పరిణయం. Show all posts
Showing posts with label సీత పరిణయం. Show all posts

సీత పరిణయం

రామ లక్ష్మణులు విశ్వామిత్రుని యాగ రక్షణా కార్యాన్ని జయప్రదంగా ముగించారు. తన శిష్యులను వెంటబెట్టుకొని విశ్వామిత్రుడు మిధిలా నగరం వచ్చాడు. అప్పుడు జనకుడు యజ్ఞం చేస్తున్నాడు. అతిధులను ఆహ్వానించి జనకుడు వారికోరికపై తనవద్దనున్న శివధనుస్సును వారికి చూపాడు. వేరెవ్వరూ ఎక్కుపెట్టలేకపోయిన ఆ ధనుస్సును శ్రీరాముడు అవలీలగా ఎక్కుపెట్టి, విరిచేశాడు.
తన కుమార్తె 'వీర్యశుల్క' అని ప్రకటించిన జనకుని కోరిక నెరవేరింది. సీతారాముల వివాహం నిశ్చయమైనది. వారితోబాటే లక్ష్మణునకు ఊర్మిళతోను, భరతునకు మాండవితోను, శత్రుఘ్నునకు శృతకీర్తితోను వివాహం నిశ్చయమైనది. జనకుడు సర్వాభరణ భూషితురాలైన సీతను తీసుకొని వచ్చి "కౌసల్యానంద వర్ధనా! రామా! ఇదిగో నా కూతురు సీత. ఈమె నీకు సహధర్మచారిణి. ఈమెనంగీకరించి పాణి గ్రహణం చెయ్యి. పతివ్రత అయిన మా సీత నిన్నెప్పుడూ నీడలాగ అనుసరిస్తుంది" అని చెప్పాడు. సీతారాముల, వారి సహజన్ముల కళ్యాణం వైభవంగా, లోక కళ్యాణంగా జరిగింది.
సీత తన భర్తవెంట అయోధ్యకు వచ్చింది. వారి దాంపత్యం అన్యోన్యంగా సాగుతున్నది.
వనవాసం
దశరధుడు కైకేయికి ఇచ్చిన మాట ప్రకారం శ్రీరాముడు రాజ్యాన్ని త్యజించి పదునాలుగేండ్లు వనవాసానికి వెళ్ళవలసి వచ్చింది. రాముడు, అత్తలు వారించినా వినకుండా సీత పట్టు బట్టి "నిన్ను విడచి నేనుండలేను. అడవులలో నీతో గడ్డిపై పడుకున్నా నాకు హంసతూలికా తల్పంతో సమానం. నేను నీకు ఇబ్బంది కలిగించను." అని వాదించి రామునితో వనవాస దీక్ష అనుభవించడానికి బయలుదేరింది. అన్నను, వదినను అంటిపెట్టుకుని సేవించడానికి లక్ష్మణుడు బయలుదేరాడు. అప్పుడు రామునకు 25 సంవత్సరములు, సీతకు 18 ఏళ్ళు, లక్ష్మణుడు 16 ఏండ్లవాడు. సీతారాములు చిత్రకూట పర్వతం, మందాకినీ నది అందాలను చూసి మురిసిపోతూ వనవాసం గడుపసాగారు. భరతుడు వచ్చి అన్నపాదుకలు తీసికొని వెళ్ళిన తరువాత సీతారామలక్ష్మణులు అత్రి మహర్షి ఆశ్రమాన్ని సందర్శించారు. అక్కడ సీత అనసూయను పూజించింది. అనసూయ సీతకు అనేక పాతివ్రత్య ధర్మాలను ఉపదేశించి, మహిమగల పూలదండ, చందనం, వస్త్రం, ఆభరణాలు బహూకరించింది. సీతనోట సీతాస్వయంవరకధ విని అనసూయ మురిసిపోయింది.
ఇంకా అనేక ముని ఆశ్రమాలు సందర్శించిన తరువాత సీతారామ లక్ష్మణులు పంచవటిలో పర్ణశాలను నిర్మించుకొని వనవాసకాలం గడుపసాగారు.