రామాయణం -- 51

న చ ఆత్మానం అహం శోచే న తారాం న అపి బాంధవాన్ |
యథా పుత్రం గుణశ్రేష్ఠం అంగదం కనకాంగదం ||
కిందపడిపోయిన వాలి అన్నాడు " రామ! నేను నా ప్రాణములు పోతున్నాయి అని బాధపడడం లేదు, తార గురించి విలపించడం లేదు, కాని నా ప్రియాతిప్రియమైన కుమారుడు అంగదుడు సుఖాలకి అలవాటుపడి బతికినవాడు, ఈ ఒక్క కొడుకు భవిష్యత్తు ఏమవుతుందా అని బెంగపడుతున్నాను. నా కొడుకు యొక్క శ్రేయస్సుని, అభివృద్ధిని నువ్వే సర్వకాలముల యందు చూడాలి రామ " అన్నాడు.
అప్పుడు రాముడు " దండించవలసిన నేరము ఏదన్నా ఒకటి చేయబడినప్పుడు, ఆ దండనని అవతలి వ్యక్తి ప్రభుత్వం నుంచి కాని, రాజు నుండి కాని పొందితే, వాడి పాపం అక్కడితో పోతుంది. ఒకవేళ దండన పొందకపోతే ఆ పాపం ఫలితాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది. అందుచేత, వాలి నువ్వు అదృష్టవంతుడివి. నువ్వు చేసిన మహా పాపానికి ఎప్పుడైతే శిక్ష అనుభవించావో, అప్పుడే నీయందు ఉన్న దోషం పోయింది. అందుకని ఇప్పుడు నువ్వు శరీరాన్ని విడిచిపెట్టాక స్వర్గలోకాన్ని పొందడానికి నీకెటువంటి ప్రతిబంధకం ఉండదు. ఇప్పుడు అంగదుడు నిన్ను ఎలా చుసేవాడో, నీ తరవాత సుగ్రీవుడియందు, నాయందు అలాగే ఉంటాడు. పిన తండ్రివల్ల నీ కుమారుడికి సమస్య వస్తుందని అనుకోమాకు, అప్పుడు కూడా నీ బిడ్డని తండ్రిగా కాపాడడానికి నేను ఉన్నాను " అన్నాడు.
అలా వాలి కిందపడిపోయి ఉండడం వల్ల చుట్టూ ఉన్న వానరాలు పరుగులు తీశాయి. జెరుగుతున్న ఈ గందరగోళం విన్న తార బయటకి వచ్చి " మీరందరూ ఇలా ఎందుకు పరిగెడుతున్నారు " అని అడిగింది.
అప్పుడు ఆ వానరాలు " రాముడికి, వాలికి యుద్ధం జెరిగింది. వాలి పెద్ద పెద్ద చెట్లని, పర్వతాలని తీసుకొచ్చి రాముడి మీదకి విసిరాడు. ఇంద్రుడి చేతిలో ఉన్న వజ్రాయుద్ధం లాంటి బాణాలతో రాముడు ఆ చెట్లని, పర్వతాలని కొట్టేసాడు. ఆ యుద్ధంలో ఆఖరున రాముడు వాలిమీద బాణమేసి కొట్టేసాడు, అందుకని నీ కొడుకుని రక్షించుకో, పారిపో " అన్నారు.
( ఇదే లోకం యొక్క పోకడ అంటె. గొంతు మారుతున్న కొద్దీ నిజం అంతర్ధానమవుతుంది. )
అప్పుడు తార " భర్తపోయిన తరువాత నాకెందుకు ఈ రాజ్యము, ఈ కొడుకు " అని వాలి దెగ్గరికి పరిగెత్తింది.
అప్పుడా తార వాలితో " నేను నీకు చెప్పిన మాటలు నువ్వు వినలేదు, ఇప్పుడు ఈ పరిస్థితిని తెచ్చుకున్నావు. సుగ్రీవుడి భార్యని అపహరించి తెచ్చావు, కామమునకు లోంగావు " అని చెప్పి, కొన ఊపిరితో ఉన్న వాలిని చూసి విలపించింది. తండ్రి మరణిస్తున్నాడని అంగదుడు నేల మీద పడి భోరున ఏడుస్తున్నాడు.
అప్పుడు వాలి సుగ్రీవుడితో " సుగ్రీవా! నా దోషాలని లెక్కపెట్టకయ్యా. కాలం బలవత్తరమైన స్వరూపంతో తన ఫలితాన్ని ఇవ్వడానికి నా బుద్ధిని మొహపెట్టి, నీతో నాకు వైరం వచ్చేటట్టు చేసింది. ఈ ఫలితాన్ని అనుభవించడం కోసమని నీ నుండి నన్ను దూరం చేసింది. అన్నదమ్ములమైన మనిద్దరమూ కలిసి ఏకాకాలమునందు సుఖం అనుభవించేటట్టు భగవంతుడు రాయలేదురా సుగ్రీవా. నేను వెళ్ళిపోయే సమయం ఆసన్నమయ్యింది, నీకు ఒక్క మాట చెప్పుకుంటాను సుగ్రీవ, ఇది మాత్రం జాగ్రత్తగా విను. నాకు ఒక్కడే కొడుకు అంగదుడు, వాడు ఇవ్వాళ నాకోసం భూమి మీద పడి కొట్టుకుంటున్నాడు. వాడు సుఖంతో పెరిగాడు, వాడికి కష్టాలు తెలియవు. నేను వెళ్ళిపోయాక వాడికి సుఖాలు ఉండవు కదా. నీ దెగ్గర, పిన్ని దెగ్గర ఎలా ఉండాలో వాడికి తెలియదు కదా. తార బతుకుతుందో లేదో నాకు తెలియదు. అందుకని నా కొడుకుని జాగ్రత్తగా చూడు, వాడికి నువ్వే రక్షకుడివి. తారకి ఒక గొప్ప శక్తి ఉంది సుగ్రీవా. ఎప్పుడైనా ఒక గొప్ప ఉత్పాతం వస్తే, అప్పుడు మనం ఏమిచెయ్యాలో నిర్ణయించుకోలేని స్థితి వస్తే, సూక్ష్మ బుద్ధితో ఆలోచించి చెప్పగలిగిన ప్రజ్ఞ తార సొత్తు. ఒకవేళ అలాంటి పరిస్థితి ఏర్పడితే తార సహాయం తీసుకో. నువ్వు ఎప్పుడైనా కాని రాముడిని అవమానించావ, రాముడి పని చెయ్యడంలో ఆలస్యం చేశావ, నేను వెళ్ళిన మార్గంలో నువ్వు కూడా వచ్చేస్తావు సుగ్రీవా. అందుకని జాగ్రత్తగా ఉండు.
నాయనా సుగ్రీవ, నా తండ్రి అయిన మహేంద్రుడు ఇచ్చిన మాల నా మెడలో ఉంది, నా ప్రాణం కాని వెళ్ళిపోతే, ఈ శరీరం శవం అయిపోతుంది, అప్పుడీ మాల అపవిత్రం అవుతుంది. ఈ మాల జయాన్ని తీసుకొస్తుంది అందుకని నీకు ఇస్తున్నాను, తీసుకో " అని ఆ మాలని సుగ్రీవుడికి ఇచ్చి ప్రాణములను వదిలేశాడు.
అప్పుడు తార అనింది " ఎప్పుడూ నీ నోటివెంట ఒక మాట వచ్చేది. ' సుగ్రీవుడా, వాడిని చితక్కొట్టేస్తాను ' అనేవాడివి. చూశావ దైవ విధి అంటె ఎలా ఉంటుందో, ఇవ్వాళ ఆ సుగ్రీవుడు నిన్ను కొట్టేశాడు. ఒంట్లో బలం ఉందని లేచింది మొదలు సంధ్యావందనానికి నాలుగు సముద్రాలు దూకావు. ఇంటికొచ్చి మళ్ళి ఎవరినో కొట్టడానికి వెళ్ళేవాడివి. నీతో యుద్ధం చేసిన ఎందరో వీరులని ఇలా భూమి మీద పడుకోపెట్టావు, ఇవ్వాళ నువ్వు కూడా అలా పడుకున్నావు. శూరుడన్న వాడికి పిల్లని ఇస్తే, ఆమెకి హఠాత్తుగా వైధవ్యం వస్తుంది. అందుకని శూరుడికి ఎవరూ పిల్లని ఇవ్వద్దు.
పతి హీనా తు యా నారీ కామం భవతు పుత్రిణీ |
ధన ధాన్య సమృద్ధా అపి విధవా ఇతి ఉచ్యతే జనైః ||
మాటవినే కొడుకులు ఎంతమంది ఉన్నా, అపారమైన ఐశ్వర్యం ఉన్నా, నేను గొప్ప పండితురాలినైనా, నువ్వు వెళ్ళిపోవడం వల్ల లోకం నన్ను చూడగానే మాత్రం విధవ అనే అంటుంది " అనింది.
అప్పుడు సుగ్రీవుడు రాముడితో " నువ్వు చేసిన ప్రతిజ్ఞకి అనుగుణంగా వాలిని సంహరించావు. అన్నని చంపమని నేను నిన్ను అడిగాను, నేను దుర్మార్గుడిని. ఇప్పుడు నాకు తెలుస్తుంది నేను ఎంత అకృత్యం చేశానో అని. అన్నయ్య బతికి ఉన్నంతకాలం, అన్నయ్య పెట్టిన కష్టాలు తట్టుకోలేక, అన్నయ్య పొతే బాగుండు, పొతే బాగుండు అని నిన్ను తీసుకొచ్చి బాణం వెయ్యమన్నాను. అన్నయ్య భూమి మీద పడిపోయాక, అన్నయ్య అంటె ఏమిటో నాకు అర్ధం అవుతుంది రామ.
నేను వాలి మీదకి యుద్ధానికి వెళితే, నన్ను కొట్టి, ఇంకొక్క గుద్దు గుద్దితే నేను చచ్చిపోతాను అన్నంతగా అలిసిపోయాక, ' ఇంకెప్పుడూ ఇలాంటి పని చెయ్యకే, పో ' అని వెళ్ళిపోయేవాడు, కాని నన్ను చంపేవాడు కాదు. ఒకతల్లి బిడ్డలమని నన్ను ఎన్నడూ వాలి చంపలేదు. నేను చచ్చిపోతానని వాలి నన్ను అన్నిసార్లు వదిలేశాడు, కాని నేను వాలిని చంపించేసాను. నీతో వాలిని చంపమని చెప్పినప్పుడు నాకు ఈ బాధ తెలియలేదు, కాని జెరిగినప్పుడు తెలుస్తుంది. అందుకని నాకు ఈ రాజ్యం వద్దు రామ.
పెద్ద చెట్టు కొమ్మని విరిచి తీసుకొచ్చి, దానితో నన్ను కొట్టి, ఇంక నేను ఆ దెబ్బలు తట్టుకోలేక పడిపోతే, ' ఇంకెప్పుడూ ఇలాంటి తప్పు పనులు చెయ్యకు, పో ' అనేవాడు. ఇవ్వాళ నన్ను అలా అనే అన్నయ్య ఎక్కడినుంచి వస్తాడు. ఇక నేను ఉండను, నేను అగ్నిలోకి వెళ్ళిపోతాను. రామ! మిగిలిన ఈ వానరులు నీకు సీతాన్వేషణలో సహాయం చేస్తారు " అన్నాడు.
సుగ్రీవుడు అలా ఏడుస్తుంటే చూడలేక రాముడు ఏడిచాడు. తార వాలిని కౌగలించుకొని ఎడుద్దాము అంటె, రాముడి బాణం వాలి గుండెలకి గుచ్చుకొని ఉంది. అప్పుడు నలుడు వచ్చి ఆ బాణాన్ని తీసేసాడు. అప్పుడా తార భర్త యొక్క శరీరం దెగ్గర ఏడిచాక, రాముడి దెగ్గరికి వచ్చి " రామ! నీగురించి ఊహించడం ఎవరి శక్యం కాదు. నువ్వు అపారమైన కీర్తికి నిలయమైన వాడివి. భూమికి ఎంత ఓర్పు ఉందో, రామ! నీకు అంత ఓర్పు ఉంది. నువ్వు విశాలమైన నేత్రములు కలిగినటువంటివాడివి. నీ చేతిలో పట్టుకున్న కోదండం, నీ అవయవముల అందమైన పొందిక, దానిలో ఉన్న కాంతి చూసిన తరువాత నువ్వు అందరివంటి మనుష్యుడవి కావని నేను గుర్తించాను. ప్రపంచంలో అన్నిటికన్నా గొప్ప దానం, భార్యా దానం. నేను లేకపోతె వాలి అక్కడ కూడా సంతోషాన్ని పొందలేడు. అందుకని వాలిని ఏ బాణంతో కొట్టావో, నన్ను కూడా ఆ బాణంతో కొట్టు, నేనూ వాలి దెగ్గరికి వెళ్ళిపోతాను " అనింది.
అప్పుడు రాముడు " నువ్వు అలా శోకించకూడదమ్మా. కాలం అనేది ఒక బలమైన స్వరూపం, అది పుణ్యపాపాలకి ఫలితాన్ని ఇస్తుంది. ఇక్కడ వాలి శరీరం ఇలా పడి ఉండగా మీరందరు ఇలా మాట్లాడకూడదు. జెరగవలసిన క్రతువుని చూడండి " అన్నాడు.
తరువాత వాలి శరీరాన్ని అగ్నికి ఆహుతి చేశారు.
తదనంతరం సుగ్రీవుడు, హనుమంతుడు మొదలైన వానరములు రాముడి దెగ్గర కూర్చున్నారు. అప్పుడు హనుమంతుడు " ఇంతగొప్ప రాజ్యాన్ని సుగ్రీవుడు పొందేతట్టుగా నువ్వు అనుగ్రహించావు. అందుకని నువ్వు ఒక్కసారి కిష్కిందా నగరానికి వస్తే నీకు అనేకమైన రత్నములను బహూకరించి, నీ పాదాలకి నమస్కరించి సుగ్రీవుడు కృతకృత్యుడు అవుతాడు " అని అన్నాడు.
అప్పుడు రాముడు " 14 సంవత్సరాలు తండ్రికి ఇచ్చిన మాట ప్రకారం అరణ్యంలో ఉంటాను. నేను గ్రామంలో కాని, నగరంలో కాని ప్రవేశించి నిద్రపోను. పెద్దవాడైన వాలి యొక్క కొడుకైన అంగదుడు యోగ్యుడు, మీరు అతనికి యువరాజ పట్టాభిషేకం చెయ్యండి. సుగ్రీవుడికి రాజ్య పట్టాభిషేకం చెయ్యండి. మీరందరు సంతోషంగా కిష్కిందలో ఉండండి. ఈ వర్షాకాలంలో రావణుడిని వెతుకుతూ వెళ్ళడం కష్టం. సుగ్రీవా! పట్టాభిషేకం చేసుకొని 4 నెలలు యదేచ్ఛగా సుఖాలు అనుభవించు. కొండల మీద తిరిగి ఎన్నాళ్ళ నుంచి కష్టపడ్డావో. 4 నెలల తరువాత కార్తీక మాసం వచినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. అంతవరకు నేను ఊరి బయట ప్రస్రవణ పర్వత గుహలో ఉంటాను " అని చెప్పి సుగ్రీవుడిని పంపించాడు.
కిష్కిందకి వెళ్ళాక సుగ్రీవుడికి పట్టాభిషేకం చేశారు. సుగ్రీవుడు మళ్ళి తారని పొందాడు. అలా తార, రుమలతో బయట వర్షాలు పడుతుండగా సుగ్రీవుడు ఆనందంగా కాలం గడపసాగాడు.

రామాయణం -- 50


అప్పుడు సుగ్రీవుడు " రామ! నేను ఇలా అంటున్నానని ఏమి అనుకోవద్దు. మా వాలి పౌరుష పరాక్రమాలు అంటె ఏమిటో విన్నావు కదా. ఇది విన్న తరువాత కూడా నువ్వు వాలిని చంపగలను అని అనుకుంటున్నావా? చంపగలిగే ధైర్యం ఉందా? వాలి ఎన్నడూ ఎవరి చేత ఒడింపబడినవాడు కాదు, జీవితంలో ఓటమి అన్నది తెలీదు వాలికి. వాలి పేరు చెబితేనే పారిపోతారు. 15 సంవత్సరాలు రాత్రి-పగలు గోలభుడు అనే గంధర్వుడితో యుద్ధం చేసి ఆయనకి సంహరించాడు. నీను ఇంకొక విషయం చూపిస్తాను, ఇక్కడ 7 సాల వృక్షములు వరుసగా ఉన్నాయి కదా. మా వాలి రోజూ సంధ్యావందనం అయ్యాక ఇక్కడికి వచ్చి ఈ పెద్ద సాల వృక్షాన్ని చేతులతో కదుపుతాడు. ఆ కుదుపుకి లేత చిగురుటాకులు కూడా రాలిపోయి ఆ చెట్టు మోడుగా నిలబడుతుంది. వాలి బలం గురించి విన్నాక కూడా నీకు వాలిని చంపగలను అన్న ధైర్యం ఉందా రామ? " అన్నాడు.
సుగ్రీవుడు చెప్పిన మాటలు విన్న లక్ష్మణుడు ఒక చిన్న నవ్వు నవ్వి " మీ వాలి చాలా గొప్పవాడు అని చెబుతున్నావు కదా. వాలిని మా అన్నయ్య చంపగలడు, అని ఏమి చేస్తే నువ్వు నమ్ముతావు " అని అడిగాడు.
అప్పుడా సుగ్రీవుడు " మా వాలి ఈ ఏడు చెట్లని కుదిపెయ్యగలడు. రాముడు పోని అంత చెయ్యక్కరలేదు, బాణం పెట్టి ఒక సాల వృక్షాన్ని కొడితే నేను నమ్ముతాను. ఆనాడు దుందుభి యొక్క శరీరాన్ని మా అన్నయ్య విసిరేస్తే అది యోజనం దూరం వెళ్ళి పడింది. రాముడిని ఈ అస్థిపంజరాన్ని తన కాలితో తన్నమనండి, 200 ధనుస్సుల దూరం కాని రాముడు తంతే నేను నమ్ముతాను " అని లక్ష్మణుడితో అన్నాడు.
అప్పడు రాముడు " సరేనయ్యా అలాగే చేస్తాను. నీకు నమ్మకం కలిగించడం కోసం నువ్వు చెప్పిన పని తప్పకుండా చేస్తాను " అన్నాడు.
రాఘవో దుందుభేః కాయం పాద అంగుష్ఠేన లీలయా |
తోలయిత్వా మహాబాహుః చిక్షేప దశ యోజనం ||
సుగ్రీవుడు చెప్పినట్టుగా రాముడు ఆ దుందుభి కళేబరాన్ని తన బొటను వేలితో తంతే అది 10 యోజనాల దూరం వెళ్ళి పడింది. అప్పుడు రాముడు సుగ్రీవుడి వంక నమ్మకం కుదిరిందా అన్నట్టు చూశాడు. కాని సుగ్రీవుడు " ఆనాడు వాలి ఈ కళేబరాన్ని విసిరినప్పుడు ఇది రక్తమాంసాలతో పచ్చిగా, చాలా బరువుగా ఉంది. అప్పటికే మా అన్నయ్య ఈ దుందుభితో చాలాసేపు యుద్ధం చేసి ఉన్నాడు, దానికితోడు తాగి ఉన్నాడు, తన భార్యలతో రమిస్తూ బయటకి వచ్చాడు, కావున అనేకరకములుగా బడలిపోయిన శరీరంతో ఉన్నాడు. కాని రాముడు చాలా ఉత్సాహంగా ఉన్నాడు, మద్యాన్ని సేవించి లేడు, పరీక్షకి నిలబడుతున్నాను అనే పూనికతో ఉన్నాడు. ఆనాడు మా అన్నయ్య విసిరింది ఒక పచ్చి శరీరం, అది ఒక యోజనం వెళ్ళి పడింది. ఈనాడు రాముడు తన్నింది ఎండిపోయిన కళేబరం, దానిని 10 యోజనాలు తన్నడంలో పెద్ద గొప్పేముంది. ఆ సాల వృక్షాన్ని కూడా కొట్టమను, అప్పుడు నాకు కొంత నమ్మకం కలుగుతుంది. అప్పుడు మనం వాలిని సంహరించడానికి వెళదాము " అన్నాడు.
అప్పుడు రాముడు ఒక బంగారు బాణాన్ని చేతితో పట్టుకొని, వింటినారికి సంధించి, గురి చూసి ఆ 7 సాల వృక్షముల వైపు విడిచిపెట్టాడు. కనురెప్ప మూసి తెరిచే లోపల ఆ బాణం 7 సాల వృక్షాలనీ పడగొట్టేసి, ఎదురుగా ఉన్నటువంటి పర్వత శిఖరాన్ని తొలిచేసి, భూమిలో పాతాళ లోకం వరకూ వెళ్ళి, మళ్ళి తిరిగొచ్చి రాముడి యొక్క అమ్ములపొదిలో కూర్చుండిపోయింది.
రాముడి శక్తి ఏమిటో చూశిన సుగ్రీవుడు వెంటనే రాముడి పాదాలకి తన శిరస్సు తగిలేటట్టు పడిపోయాడు. అప్పుడాయన కిరీటం రాముడి పాదాల మీద పడిపోయింది. అప్పుడా సుగ్రీవుడు " రామ! నీ బాణానికి ఉన్న వేగం ఇంద్రుడి బాణానికి కూడా లేదు. నేను ఏమో అనుకున్నాను, ఇంక వాలి ఏమిటి. నువ్వు బాణ ప్రయోగం చేస్తే వజ్రాయుధం పట్టుకున్న ఇంద్రుడి శిరస్సు కూడా కింద పడిపోతుంది. నీ బాణానికి ఉన్న వేగం సామాన్యమైనది కాదు, వాలి దెగ్గరికి వెళదాము పద " అన్నాడు.
"తప్పకుండా సుగ్రీవ, బయలుదేరదాము", అని అందరూ బయలుదేరారు. ముందు సుగ్రీవుడు వేగంగా వెళుతున్నాడు, ఆయన వెనకాల రామలక్ష్మణులు, సుగ్రీవుడి మంత్రులైన హనుమంతుడు, నీలుడు, నలుడు మొదలైన వారు వెళుతున్నారు.
సర్వే తే త్వరితం గత్వా కిష్కింధాం వాలినః పురీం |
వృక్షైః ఆత్మానం ఆవృత్య హి అతిష్ఠన్ గహనే వనే ||
ముందు వెళుతున్న సుగ్రీవుడు కిష్కింద పట్టణంలోకి వెళ్ళిపోయాడు. మిగిలిన వారందరూ దట్టమైన చెట్ల చాటున, పైకి కనపడకుండా దాగి ఉన్నారు. లోపలికి వెళ్ళిన సుగ్రీవుడు గట్టిగా కేకలు వేసి వాలిని బయటకి రమ్మన్నాడు. సుగ్రీవుడు ఇంత ధైర్యంగా పిలిచేసరికి వాలి ఆశ్చర్యంతో బయటకి వచ్చి " ఏరా బుద్ధిహీనుడా మళ్ళి వచ్చావు, నా ప్రతాపం ఏమిటో చూద్దువు కాని, రా " అన్నాడు. అప్పుడా వాలి తన పిడికిలిని బిగించి సుగ్రీవుడి శిరస్సు మీద ఒక్క దెబ్బ కొట్టాడు. ఆ దెబ్బకి సుగ్రీవుడి నవరంధ్రముల నుండి రక్తం ఏరులై పారింది. సుగ్రీవుడు తేరుకొని వాలిని కొట్టడం ప్రారంభించాడు, వాలి కూడా సుగ్రీవుడిని కొడుతున్నాడు. ఇద్దరూ అలా మోచేతులతో పొడుచుకుంటున్నారు, పాదాలతో కొట్టుకుంటున్నారు, శిరస్సులతో కుమ్ముకుంటున్నారు. అలా కొంత సేపు కొట్టుకున్నాక, ఇంకా బాణం వెయ్యడం లేదు, రాముడు ఎక్కడున్నాడని సుగ్రీవుడు అటూ ఇటూ చూశాడు. కాని రాముడు కనపడలేదు. ఇంక వాలితో యుద్ధం చెయ్యలేక సుగ్రీవుడు ఋష్యమూక పర్వతం మీదకి పారిపోయాడు. అప్పుడు వాలి కూడా తిరిగి అంతఃపురానికి వెళ్ళిపోయాడు.
సుగ్రీవుడు ఆ ఋష్యమూక పర్వతం మీద ఒక శిల మీద కూర్చొని, ఒంట్లోనుండి కారిపోతున్న రక్తాన్ని తుడుచుకుంటూ, ఆయాసపడుతూ, ఏడుస్తూ ఉన్నాడు. ఇంతలో లక్ష్మణుడితో కలిసి రాముడు అక్కడికి వచ్చాడు. వాళ్ళని చూడగానే సుగ్రీవుడు " ఏమయ్యా! నేను నిన్ను వాలిని చంపు, అని అడిగాన. నువ్వు వాలిని చంపుతాను అని ప్రతిజ్ఞ చేస్తేనే కదా నేను యుద్ధానికి వెళ్ళాను. నేను వాలిని చంపను అని నువ్వు ఒకమాట చెబితే నేను వెళతాన. ఎందుకు కొట్టించావయ్య నన్ను ఇలాగ " అని రాముడిని ప్రశ్నించాడు.
అప్పుడు రాముడు " సుగ్రీవ! నేను ఇంతకముందెన్నడూ వాలిని చూడలేదు. నువ్వు వాలితో యుద్ధం చేస్తున్నప్పుడు వాలి మీద బాణం వేద్దామని అనుకొని వచ్చాను. తీరా వాలి బయటకి వచ్చాక నేను విస్మయం చెందాను. ఎందుకంటే నువ్వు, వాలి ప్రతి విషయంలో ఒకేలా ఉన్నారు. మీరిద్దరూ దెబ్బలాడుకుంటుంటే అశ్విని దేవతలు దెబ్బలాడుకున్నట్టు ఉంది. మీలో ఎవరు వాలి, ఎవరు సుగ్రీవుడో నాకు తెలీలేదు. పోని కంఠ స్వరంలో మార్పు ఉంటుందేమో అని చూశాను, కాని ఇద్దరూ ఒకేలా అరిచారు. ఇద్దరూ ఒకేలా పరిగెడుతున్నారు, ఒకేలా అలంకారం చేసుకున్నారు. ఇద్దరూ ఒకే వేగంతో కొట్టుకున్నారు. నేను ఎలాగోలా నిర్ణయించుకొని, ఇతడే వాలి అయ్యుంటాడు అని బాణ ప్రయోగం చేశానే అనుకో, సుగ్రీవా! అది తగిలినవాడు ఈ లోకమునందు ఉండడు. ఒకవేళ ఆ బాణము పొరపాటున నీకు తగిలిందనుకో, నువ్వు నేను కూడా ఉండము.
గజ పుష్పీం ఇమాం ఫుల్లాం ఉత్పాట్య శుభ లక్షణాం |
కురు లక్ష్మణ కణ్ఠే అస్య సుగ్రీవస్య మహాత్మనః ||
నిన్ను వాలికన్నా వేరుగా గుర్తుపట్టాలంటే ఒకటే లక్షణం ఉంది. లక్ష్మణా! అక్కడ గజపుష్ప తీగ ఒకటి పాకుతోంది. నువ్వు దానిని పీకి సుగ్రీవుడి మెడలో కట్టు. అప్పుడు పెద్ద పెద్ద పువ్వులచే విరాజితుడై సుగ్రీవుడు ఉంటాడు, అటువంటి మాల లేనివాడై వాలి ఉంటాడు. అప్పుడు నేను వాలిని నిగ్రహించగలను. సుగ్రీవ! ఆ మాల వేసుకొని మళ్ళి ఇప్పుడు యుద్ధానికి వెళ్ళు " అన్నాడు.
సుగ్రీవుడు సరే అని బయలుదేరాడు. ఆయన వెనకాల రాముడు, లక్ష్మణుడు, హనుమంతుడు మొదలైన వారు బయలుదేరారు. అలా వారు వెళుతూ లోయలని, నదులని, పర్వతాలని, చెట్లని చూసుకుంటూ వెళుతున్నారు. అప్పుడు వాళ్ళకి పక్కన నుంచి అక్షర సముదాయము చేత అవ్యక్తమైనటువంటి గంధర్వ గానం ఒకటి వినపడింది. అది వింటున్నప్పుడు వాళ్ళ మనస్సులకి ఆనందం కలుగుతోంది. అక్కడ ఉన్న చెట్లపైకి పావురాల రంగులో పొగలు చుట్టుకొని ఉన్నాయి. అప్పుడు రాముడు, ఈ వనం ఏమిటి? అని సుగ్రీవుడిని అడిగాడు. కాని సుగ్రీవుడు ఆగకుండా ముందుకి వెళ్ళిపోతూ " రామ! ఇక్కడ సప్తజనులు అనేటటువంటి 7 ఋషులు ఉండేవారు. వారు తలలు కిందకి పెట్టి, కాళ్ళు పైకి పెట్టి 700 సంవత్సరాలు తపస్సు చేశారు. అలా 700 సంవత్సరాలు తపస్సు చేస్తూ ప్రతి 7 రాత్రులకి ఒకసారి గాలిని తినేవారు. వాళ్ళ తపస్సుకి ఇందుడు ఆశ్చర్యపోయి, సశరీరంగా స్వర్గలోకానికి తీసుకువెళ్ళాడు. వాళ్ళ తపోశక్తి ఇప్పటికీ ఈ వనంలో ఉంది, అందువలన క్రూరమృగం ఈ వనంలోకి వెళ్ళదు, వెళితే ఇక తిరిగిరాదు. నువ్వు లక్ష్మణుడితో కలిసి నమస్కారం చెయ్యి " అన్నాడు.
అప్పుడు లక్ష్మణుడితో కలిసి రాముడు ఆ సప్తజనుల ఆశ్రమం వైపుకి తిరిగి నమస్కారం చేశాడు. అలా వారు నమస్కారం చెయ్యగానే వాళ్ళ మనస్సులో గొప్ప ఉత్సాహం పుట్టింది.
వాళ్ళందరూ కిష్కింద చేరుకున్నాక సుగ్రీవుడు వెళ్ళి గట్టిగా తొడలు కొట్టి, కేకలు వేసి వాలిని పిలిచాడు. అప్పుడు వాలి గబగబా బయటకి వస్తుండగా ఆయన భార్య అయిన తార (తార సుషేణుడి కుమార్తె) ఆపి " ఎందుకయ్యా అలా తొందరపడి వెళ్ళిపోతున్నావు. ఇప్పుడే ఒక గంట క్రితం వచ్చాడు కదా సుగ్రీవుడు. నవరంధ్రములనుండి నెత్తురు కారేటట్టు నువ్వు కొడితే దిక్కులు పట్టి పారిపోయాడు కదా. నువ్వు ఇంట్లోకి వచ్చి ఎంతో సేపు కాలేదు, సుగ్రీవుడు వచ్చి నిన్ను మళ్ళి యుద్ధానికి రమ్మంటున్నాడు, నీకు అనుమానం రావడం లేదా.
సుగ్రీవుడు మళ్ళి వచ్చి ' వాలి యుద్ధానికి రా ' అంటున్నాడంటే నాకు శంకగా ఉందయ్యా. సుగ్రీవుడు నిన్ను ఇప్పుడు పిలవడంలో తేడా నీకు కనపడడం లేదా, చాలా ధైర్యంగా పిలుస్తున్నాడు నిన్ను. ఇప్పుడే దెబ్బలు తిని వెళ్ళినవాడిలో ఉండే బలహీనతలు కనపడడం లేదు. ఆ స్వరంలో ఒక పూనిక, ఒక గర్వం కనపడుతోంది. సుగ్రీవుడికి వెనకాల ఎవరిదో సహాయం ఉంది, నువ్వు సుగ్రీవుడితో యుద్ధం చేసేటప్పుడు నీకు వేరొకరితో ప్రమాదం పొంచి ఉంది. సుగ్రీవుడికి స్నేహం చెయ్యడంలో మంచి తెలివితేటలు ఉన్నాయి. నేను గూఢచారుల ద్వారా, అంగదుడి( అంగదుడు వాలి-తారలు కుమారుడు ) ద్వారా తెలుసుకున్న విషయం ఏమిటంటే, ఇక్ష్వాకు వంశంలో జన్మించిన అపారమైన శౌర్యమూర్తులైన దశరథ మహారాజు కుమారులైన రామలక్ష్మణులతో ఇవ్వాళ సుగ్రీవుడు స్నేహం చేశాడు. నువ్వు నీ బలాన్ని నమ్ముకున్నావు, కాని సుగ్రీవుడి బుద్ధి బలాన్ని గూర్చి ఆలోచించడంలేదు.
సుగ్రీవుడు నీ తమ్ముడన్న విషయాన్ని మరిచిపోయి, నీ తమ్ముడి భార్యని నీ భార్యగా అనుభవిస్తున్నావు. నీ తమ్ముడిని పక్కన పెట్టుకోవడం మానేసి శత్రుత్వాన్ని పెంచుకుంటున్నావు. మీ ఇద్దరి మధ్యలోకి మూడవ వ్యక్తి రావలసిన అవసరమేమిటి, ఇది నీ ఇంటి సమస్య. నా మాట వినీ సుగ్రీవుడిని ఆహ్వానించి యువరాజ పట్టాభిషేకం చెయ్యి, అప్పుడు నీ బలం పెరుగుతుంది. ఇవాళ నీ తమ్ముడు రాముడి నీడలో ఉన్నాడు, రాముడిలా నీడ ఇవ్వగలిగే చెట్టు ఈ ప్రపంచంలో లేదు " అనింది.
వాలి శరీరం పడిపోవలసిన కాలం ఆసన్నమయ్యింది, ఈశ్వరుడు ఫలితాన్ని ఇవ్వడం ప్రారంభించాడు కనుక ఇంతకాలం తార మాటలు వినడానికి అలవాటుపడ్డ వాలి ఆమె మాట వినడం మానేసి సుగ్రీవుడితో యుద్ధానికి వెళ్ళాడు.
ఇద్దరూ హొరాహొరిగా యుద్ధం చేసుకుంటున్నారు. ఈసారి సుగ్రీవుడు చెట్లని పెరికించి వాలిని తుక్కుగా కొట్టాడు. కాని వాలి మెడలో ఇంద్రుడి మాల ఉండడం వలన, మెల్లగా సుగ్రీవుడి శక్తి నశించింది, వాలి బలం పెరిగింది. సుగ్రీవుడు ఇంతకముందులా పారిపోకుండా ఈసారి రాముడి కోసం మళ్ళిమళ్ళి అన్ని వైపులా చూశాడు.
సుగ్రీవుడి శక్తి తగ్గిపోవడం గమనించిన రాముడు వెంటనే బాణాన్ని తీసి వింటినారికి తొడిగించి వెనక్కి లాగాడు. అలా లాగడం వలన ఆ వింటినారి నుండి వచ్చిన ధ్వని యుగాంతమునందు ప్రళయం చేసేటప్పుడు హరుడు చేసే శబ్దంలా ఉంది. ఆ శబ్దము చేత మృగములన్నీ దిక్కులు పట్టి పారిపోయాయి, పక్షులు ఆకాశంలోకి ఎగిరిపోయాయి.
రాఘవేణ మహా బాణో వాలి వక్షసి పాతితః |
రాముడి బాణం యొక్క శబ్దం వినపడి, ఆ శబ్దం ఎక్కడినుంచి వచ్చిందో అని వాలి అటువైపుకి తిరిగెలోగా ఆ బాణం అమితమైన వేగంతో వచ్చి వాలి గుండెల మీద పడింది. ఆ దెబ్బకి వాలి కిందపడిపోయాడు. అప్పుడు రాముడు, లక్ష్మణుడు, సుగ్రీవుడి మంత్రులు అక్కడికి వచ్చారు. పక్కనే చేతులు కట్టుకొని సుగ్రీవుడు నిలబడ్డాడు. అప్పుడు వాలి రాముడితో " రామ! నువ్వు చాల గొప్పవాడివి, ధర్మం తెలిసినవాడివి, పరాక్రమము ఉన్నవాడివి అంటారు. నీతో కాకుండా ఇంకొకరితో నేను అటువైపుకి తిరిగి యుద్ధం చేస్తుంటే, ఇంత ధర్మాత్ముడివి అయిన నువ్వు చెట్టు చాటు నుంచి నా మీద బాణం వెయ్యడానికి సిగ్గుగా లేదా. నా చర్మము ఒలిచి వేసుకోడానికి, మాంసము తినడానికి పనికిరావు. యుద్ధం అంటూ వస్తే బంగారం వల్ల, వెండి వల్ల, భూమి వల్ల రావాలి, కాని నీకు నాకు ఈ విషయాలలో తగాదా లేదు. నేను చెట్ల మీద ఉండే ఆకులని, పండ్లని తినే శాఖా మృగాన్ని. నువ్వు మనిషివి, ధర్మం అనే తొడుగు కప్పుకున్న మహా పాపాత్ముడివి. చేతిలో కోదండం పట్టుకొని కనపడ్డ ప్రతి ప్రాణిని హింసించే స్వభావం ఉన్నవాడివి. నీయందు కామము విపరీతంగా ఉంది, అందుచేతనే ఏ కారణం లేకుండా నన్ను కొట్టి చంపావు. నువ్వు నాకు ఎదురుగా వచ్చి నిలబడి యుద్ధం చేసినట్టయితే, ఆ యుద్ధంలో నేను నిన్ను యమసదనానికి పంపించి ఉండేవాడిని.
అయిదింటి మాంసాన్ని మాత్రమే బ్రాహ్మణులు, క్షత్రియులు తినాలని ధర్మశాస్త్రం చెబుతుంది. ( త్రేతా యుగంలో బ్రాహ్మణులు కూడా మాంసాన్ని తినేవారు, కలికాలంలో అది నిషిద్దము. అరణ్యకాండలో అగస్త్య మహర్షి వాతాపి, ఇల్వలుడు అనే రాక్షసులని చంపేముందు మాంసాహారాన్ని తిన్నారు). అయిదు గోళ్ళున్న వాటిల్లో ముళ్ళపంది మాంసాన్ని తినచ్చు, చెవుల పిల్లి మాంసాన్ని తినచ్చు, ఉడుము మాంసాన్ని తినచ్చు, తాబేలు మాంసాన్ని తినచ్చు, కుక్కలని తరిమి చంపే ఏదుపంది మాంసాన్ని తినవచ్చు. ఇంక ఆరవదాని మాంసం తినకూడదు. ఒకవేళ అలా తిన్నా, రాజ్యం చేస్తున్న రాజుని చంపినా, గోవుని చంపినా, బ్రాహ్మణుడిని చంపినా, అలా చేసిన వారికి పాతకం చేసిన పాపం వస్తుంది. నువ్వు నన్ను చంపడానికి కారణం ఏమిటి. నువ్వు చేసినవి దోషాలు కావా? నాకు జవాబు చెప్పు.
ఏమయ్యా, నీ భార్య కోసం అడవిలో వెతుక్కుంటున్నావంట కదా, నీ భార్యని ఎత్తుకుపోయిన రావణాసురుడు నా కింకరుడు. నువ్వు నాతో చెప్పి ఉంటె, పశువుని ఈడ్చుకు వచ్చినట్టు రావణుడిని మెడలో పాశం వేసి నీ కాళ్ళ ముందు పడేసేవాడిని. అటువంటిది నాకు చెప్పకుండా, నన్నే గెలవలేని సుగ్రీవుడిని ఆశ్రయించి నువ్వు సీతని ఎలా తెచ్చుకోగలవు. సుగ్రీవుడి కోసం నన్ను చంపావు, ఇది కిరాయి హత్య కాదా? నువ్వు ఈ పని చెయ్యొచ్చా " అని రాముడిని ప్రశ్నించి, ఇక మాట్లాడడానికి ఓపిక లేక, అలా ఉండిపోయాడు.
ధర్మం అర్థం చ కామం చ సమయం చ అపి లౌకికం |
అవిజ్ఞాయ కథం బాల్యాత్ మాం ఇహ అద్య విగర్హసే ||
అప్పుడు రాముడు " నీకు అసలు ధర్మం గురించి కాని, అర్ధం గురించి కాని, కామం గురించి కాని తెలుసా? నువ్వు అజ్ఞానివి. బాలుడు ఎలా ప్రవర్తిస్తాడో నువ్వు అలా ప్రవర్తించేవాడివి, నీకు ఏమి తెలుసని నామీద ఇన్ని ఆరోపణలు చేశావు. నువ్వు అజ్ఞానివి కావడం వలన నీకు తెలియకపోతే, ఆచారం తెలిసినవారిని, పెద్దలైనవారిని ఆశ్రయించి నువ్వు కనుక్కోవాలి. నువ్వు అవేమి తెలుసుకోకుండా నా గురించి అడుగుతున్నావు. ఇక్ష్వాకుల యొక్క రాజ్యంలోకి ఈ భాగం కూడా వస్తుంది. ఆ ఇక్ష్వాకు వంశంలో పుట్టిన భరతుడు ఇప్పుడు రాజ్యం చేస్తున్నాడు. ఇక్ష్వాకు వంశంవారు రాజ్యం చేస్తుండగా ధర్మాధర్మములు జెరిగిన చోట నిగ్రహించే అధికారం మాకు ఉంటుంది. నీకు కామం తప్ప వేరొకటి తెలియదు, అందుచేత నీకు ధర్మాధర్మ విచక్షణ చేసే అధికారం లేదు. జన్మనిచ్చిన తండ్రి, పెద్ద అన్నగారు, చదువు నేర్పిన గురువు, ఈ ముగ్గురూ తండ్రులతో సమానం. అలాగే తనకి జన్మించిన కుమారుడు, తోడబుట్టిన తమ్ముడు, తన దెగ్గర విద్య నేర్చుకున్న శిష్యుడు, ఈ ముగ్గురూ కుమారులతో సమానము.
నీ తండ్రి మరణించడం చేత, నువ్వు పెద్దవాడివి అవడం చేత నువ్వు తండ్రితో సమానము. నీ తమ్ముడు సుగ్రీవుడు, ఆయన భార్య అయిన రుమ నీకు కోడలితో సమానము. కాని సుగ్రీవుడు బతికి ఉన్నాడని తెలిసి, కోడలితో సమానమైన రుమని నువ్వు అనుభవించి, నీ భార్యగా కామ సుఖాలని పొందుతున్నావు ( వాలి బిలంలో ఉండిపోయినప్పుడు, వాలి మరణించాడు అనుకొని సుగ్రీవుడికి పట్టాభిషేకం చేశారు. అప్పుడు సుగ్రీవుడు వాలి భార్య అయిన తారని తన భార్యగా అనుభవించాడు. మరి సుగ్రీవుడు చేసింది దోషం కాదా? ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏమిటంటే, సంధ్యావందనం చేసే వానర జాతికి, రాజ్యపాలన చేసే వానర జాతికి, మంత్రులచేత సేవింపబడే వానర జాతికి కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ జాతిలోని స్త్రీలు తమ భర్త మరణిస్తే మరిదిని పునర్వివాహం చేసుకొని, వారితో ఉండచ్చు. ఆనాడు వాలి చనిపోయాడనుకొని తార సుగ్రీవుడిని వివాహమాడింది. కనుక సుగ్రీవుడితో ఆనాడు తార ఉండడం ధర్మం తప్పడం కాదు. కాని సుగ్రీవుడు బతికే ఉన్నాడని తెలిసి కూడా ఆయన భార్యతో కామ సుఖాలని అనుభవించడం వాలి యొక్క దోషం. ఈ నియమం కేవలం పైన చెప్పిన వానర జాతికి మాత్రమే, మనుష్యులకి కాదు. అలాగే వాలికి రెండు శక్తులు ఉన్నాయి. ఒకటి, ఇంద్రుడు ఇచ్చిన మాలని మెడలో వేసుకుంటే, వాలి అపారమైన ఉత్సాహంతో ఉంటాడు. రెండు, ఎవరన్నా వాలికి ఎదురుగా వెళితే, వాళ్ళ శక్తిలో సగం శక్తిని ఈయన లాగేసుకుంటాడు, ఇది బ్రహ్మగారు వాలికి ఇచ్చిన వరం. అలాగే వాలికి రావణాసురుడికి స్నేహం ఉంది, వాళ్ళిద్దరూ ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. దాని ప్రకారం వాలి అనుభవించే స్త్రీని రావణుడు అనుభవించచ్చు, వాలికి శత్రువు రావణుడికి శత్రువే........అలా కొన్ని విషయాలలో ఒప్పందం కుదుర్చుకున్నారు ).
అందుచేత ఒక మామగారు కోడలితో కామభోగాన్ని అనుభవిస్తే ఎంత దోషమో, అంత దోషాన్ని నువ్వు చేశావు. ధర్మ శాస్త్రంలో దీనికి మరణశిక్ష తప్ప వేరొక శిక్ష లేదు. అందుకని నేను నిన్ను చంపవలసి వచ్చింది. నువ్వు ప్రభువువి, మంత్రుల చేత సేవింప బడుతున్నవాడివి, సంధ్యావందనం చేస్తున్నవాడివి. నువ్వు ధర్మం తప్పితే నీ వెనుక ఉన్నవారు కూడా ధర్మం తప్పుతారు. నేను క్షత్రియుడని కనుక నిన్ను శిక్షించవలసిన అవసరం నాకు ఉంది. ఇది తప్పు అని తెలిసికూడా నేను నిన్ను శిక్షించకపోతే, నువ్వు చేసిన పాపం నాకు వస్తుంది. ఈ పాపం అవతలవాడు చేశాడని ప్రభువైనవాడికి తెలిసి వాడిని శిక్షిస్తే, వాడి పాపం పోతుంది. కాని ప్రభువు అలా శిక్షించకపోతే ఆ పాపం రాజుకి వెళుతుంది. అందుకే మా వంశంలో ఇంతకుపూర్వం మాంధాత అనే రాజు ఒక శ్రమణికుడు ఇటువంటి దోషం చేస్తే శిక్ష వేశాడు. ఇంక నాతో ఎందుకు స్నేహం చెయ్యలేదు, నాతో స్నేహం చేసి ఉంటె సీతమ్మని తీసుకు వచ్చేవాడిని అన్నావు కదా, నీలాంటి అధర్మాత్ముడితో నేను స్నేహం చెయ్యను. నన్ను చెట్టు చాటునుండి చంపావు, వేరొకడితో యుద్ధం చేస్తుంటే కొట్టావు, అది దోషం కాదా? అని నన్ను అడిగావు, దానికి నేను సమాధానం చెబుతాను విను.
తప్పు చేసినవాడిని రాజు శిక్షిస్తే వాడి పాపం ఇక్కడితో పోతుంది. నేను నిన్ను చంపడం వల్ల నువ్వు ఏ పాపము లేని స్థితికి వచ్చావు, నీ పాపం ఇక్కడితో పోయింది, అందుకని నువ్వు ఉత్తమలోకాలకి వెళ్ళిపోతావు.
న మే తత్ర మనస్తాపో న మన్యుః హరిపుంగవ |
వాగురాభిః చ పాశైః చ కూటైః చ వివిధైః నరాః ||
నేను మానవుడిని, నువ్వు వానరానివి. నేను మనిషిని, నువ్వు జంతువువి. క్షత్రియుడు, మాంసం తినేవాడు, ధర్మాన్ని నిలబెట్టవలసినవాడు ఒక మృగాన్ని కొట్టవలసి వస్తే, తాను చాటున ఉండి కొట్టచ్చు, వల వేసి పట్టుకొని కొట్టచ్చు, పాశం వేసి పట్టుకొని కొట్టచ్చు, అది అప్రమత్తంగా ఉన్నప్పుడు కొట్టచ్చు, అది పడుకొని ఉన్నప్పుడు కొట్టచ్చు, నిలబడి ఉన్నప్పుడు కొట్టచ్చు, పారిపోతున్నప్పుడు కొట్టచ్చు, ఎప్పుడైనా కొట్టచ్చు, కాని ఆ మృగం వేరొక స్త్రీ మృగంతో సంగమిస్తున్నప్పుడు మాత్రం బాణ ప్రయోగం చెయ్యకూడదు. నువ్వు మైధున లక్షణంతో లేవు, అందుకని నిన్ను కొట్టాను. నేను నరుడిని కనుక మృగానివైన నిన్ను ఎలా కొట్టినా నాకు పాపం రాదని తెలిసి కొట్టాను. కాని నువ్వు చనిపోయేముందు రోషం కలిగి నన్ను ప్రశ్నించావు. నాయందు ఎటువంటి దోషము లేదు " అని రామచంద్రమూర్తి సమాధానమిచ్చారు.
రాముడు మాటలు విన్న వాలి తన రెండు చేతులతో రాముడికి నమస్కారం పెట్టి " మహానుభావ! ధర్మాత్మ! రామచంద్ర! నువ్వు చెప్పినది పరమయదార్ధము. దోషం నాయందే ఉంది. నువ్వు నన్ను చంపడంలోకాని, నాయందు దోషం ఉన్నదీ అని చెప్పడంలోకాని కించిత్ సందేహం లేదు. నువ్వు ధర్మాధర్మ విచక్షణ చేత, నీకు ఉన్న జ్ఞానం చేత, పూర్వాపరములను బాగా పరిశీలించిన మీదట, ఏమిచెయ్యాలో నిర్ణయించుకుని, నిర్ణయించుకున్నదానిని అమలుచేసి, అమలుచేసిన దానిమీద స్థిరంగా నిలబడగల వ్యక్తిత్వం ఉన్నవాడివి, అటువంటి నిన్ను చూసి పొంగిపోతున్నాను. ఇటువంటి నీ చేతిలో మరణమైనా నాకు స్వర్గమే రామ " అన్నాడు.

21న చందనయాత్ర (సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం )


ఈ నెల 20 తెల్లవారుజాము నుంచి సింహాచలమున వెలసిన శ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామి వారి నిజరూప దర్శనం లభిస్తుంది. దీనినే మనం అక్షయ తృతీయ(చందనయాత్ర) అంటాము. వైశాఖ బహుళ తదియ రోజున ఈ ఉత్సవం జరుగుతుంది.
సింహాచలంలో భగవానుడు మనకు సంవత్సరము అంతా గుమ్మడిపండు రూపంలో దర్సనమిస్తాడు. విదియనాటి రాత్రి స్వామి కి అభిషేకాదులు చేసి అర్చకులు.... స్వామి మేను నుండి చందనము తొలగిస్తారు. తిరిగి తదియనాటి రాత్రి శ్రీవైష్ణవ స్వాములు గంగధార నుండి మట్టి కలశలతో నీరు తెచ్చి అప్పన్నకి సహస్ర కలశాభిషేకం చేస్తారు. సహస్ర కలశాభిషేకం జరుగుటకు మన పెద్దలు చెప్పిన కొన్ని విశేషాలు మనం చెప్పుకుందాము.
హిరాణ్యాక్షుని సంహరించిన పిదప, నరసింహస్వామి ప్రహ్లాదునుని, నీకేమివరము కావాలో కోరుకో అని అడుగగా..... అంతట ప్రహ్లాదుడు స్వామితో ఇట్లనెను "స్వామీ మా తండ్రి, పెడతండ్రులను సంహరించిన వాడివైనందున నీ రెండు అవతారాలను కలిపి ఒకే రూపంలో దర్శించే భాగ్యము నాకు కల్పించు తండ్రీ" అని అడగగా స్వామి అట్లే అనుగ్రహించి, ప్రహ్లాదుని కోరికని మన్నించెను. అందువలననే ఇచట వెలసిన స్వామిని "శ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామి" అని అంటారు. ఇక్కడ ఉన్నటువంటి స్వామి రూపం మనకు మరెక్కడా కనిపించదు.
ప్రహ్లాద వంశీయుడైన పురూరవ చక్రవర్తి, ఊర్వశితో గగనమార్గాన విహరిస్తున్న సమయంలో సింహగిరి సమీపమునకు రాగానే వారి పుష్పకవిమానము ముందుకు కదలక అచ్చటే నిలిచిపోయేనట. ఆ చక్రవర్తి భగవదాజ్ఞగా భావించి, కొంత సమయము విశ్రాంతి తీసుకోదలచి వాహనమును సింహగిరి పైకి దించి, ఒక చెట్టు క్రింద విస్రమించెను. అంతట అతనికి స్వప్నమందు అప్పన్న సాక్షాత్కరించి, "నేను ఇచటనే వెలసియున్నను, నాకు ఆరాధన చేయు" అని పలికెను. వెంటనే పురూరవుడు.....స్వామి చెప్పిన గురుతుల ప్రకారము, ఆ కొండ ప్రాంతమంతా భటులచే వెతికించి, ఒక చోట స్వామి ఉన్నట్లు తెలుసుకొని, స్వామి పై ఉన్న పుట్టమన్నుని తొలగించి దర్శించెనట. అంత స్వామి ఇంతకాలము తనపై ఉన్నమట్టివలన తాపములేదని, ఎంత మన్నుని తనపైనుండి తీసారో అంతే పరిమాణంలో తనపై శ్రీ చందనం పూతగా వేయవలెనని చెప్పెనట, సంవత్సరములో ఈ ఒక్కరోజునే స్వామి యొక్క నిజరూప దర్శనభాగ్యం మనకు లభిస్తోంది. పుట్టను తవ్వి తీసిన మట్టి 12 మణుగులు ఉన్న కారణంగా, ఇప్పుడు అంతే పరిమాణంగల చందనమును 4 విడతలుగా వేస్తున్నారు. ఆ నాలుగు విడతలు----1) అక్షయ తృతీయ నాడు, 2) వైశాఖ పూర్ణమి నాడు, 3) జ్యేష్ట పూర్ణిమ & ఆషాడపూర్ణిమ. ప్రతీ విడతకు 3 మణుగుల చొప్పున చందనమును స్వామిపై వేస్తారు. అందుకే ఈ స్వామిని చందన స్వామి అనికూడా అంటారు.
ముందుగా నిజరూప దర్శనాన్ని ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి ఆనంద గజపతి రాజు దంపతులు కుటుంబసమేతంగా దర్సనం చేసుకోవడం ఆనవాయితీ
చందనయాత్ర రోజున నాటి రాత్రి శ్రీవైష్ణవ స్వాములు గంగధారవద్ద స్నానమాచరించి1008 మట్టికలశలతో గంగధార నీటిని తీసుకొని వచ్చి స్వామికి అభిషేకిస్తారు.


దేశం నలుమూలల నుంచి భక్తులు లక్షలాదిగా తరలి వచ్చి చందన స్వామి ని దర్సనం చేసుకుంటారు దీని కోసం సింహాచలం ని అందంగా తీర్చిదిద్దుతున్నారు

సంకల్పం చేసుకోండి.

సుమారు రెండువేల సంవత్సరాల క్రిందట పురాతన గ్రంధములలో ఉల్లేఖించబడిన ఒక కధ వున్నది. ఆ కధ ఏమంటే - అది కధ అయినా దాని వలన ఒక ప్రేరణ మనకు ప్రాప్తిస్తుంది- శ్రీ గౌడపాదాచార్యులవారు తన గ్రంధంలో దీనిని ఉదహరించారు.
ఒక గబ్బిలం వుండేది. పై కప్పుకు కాళ్ళు పెట్టుకుని రాత్రిపూట తలక్రిందులుగా వేలాడబడి వుంటుంది. ఎక్కువగా చీకట్లో, గుహల్లో వున్నట్లుగా వర్ణన వుంటుంది.
అది సముద్రపు ఒడ్డున తన గుడ్లు పెట్టుకుంది. ఒకరోజు సముద్రంలో అలలు పొంగి ఆ గుడ్లు కొట్టుకుని పొయాయి. అప్పుడు ఆ గబ్బిలం ఏడుస్తూ కూర్చోలేదు. ఓదార్చడానికి వచ్చి పోయే వాళ్ళతో మాట్లాడుతూ కూర్చోలేదు. ఎప్పుడైతే గుడ్లు కొట్టుకు పొయాయో, వెంటనే పని మొదలు పెట్టింది. ఏమి పని మొదలు పెట్టింది. ! తన ముక్కుతో సముద్రపు నీరు నింపుకుని దూరంగా వెళ్ళి నేలపైన వేసేది. తన గుడ్లు కొట్టుకు పోయాయని తెలిసి ఎవరైతే సానుభూతి చూపించడానికి వచ్చారో వారు కూడ అదేపని చెయ్యడం మొదలు పెట్టారు. ఎలాగైనా సముద్రుడిని శుష్కింపచేయాలన్న దృఢ నిశ్చయంతో ఇఖ వారు ఎవరి మాట వినలేదు.
ఇంత చిన్న పక్షి సముద్రుడిని శుష్కింప చేయగలదా చెప్పండి! కానీ దాని మనసులో ఎంతటి ఉత్సాహం! దృఢత! పౌరుషం! ఎంతటి ప్రయత్నం. దాని రోమరోమంలో నిండిపోయింది. దేశ దేశాలనుండి పక్షులు రావడం మొదలు పెట్టాయి. మా బంధు మిత్రుడు (పక్షి జాతి) ఒకడు సముద్రుడినే శుష్కింపజేసే దృఢసంకల్పం చేసుకున్నాడట. ఇంత పెద్ద సంకల్పం అంత చిన్నప్రాణి మనసులో ఎంత ఉత్సాహం!
ఈ సమాచారం గరుత్మంతుడికి తెలిసింది. గరుడుడు పక్షులకు రాజు. సముద్రుడిని శుష్కింపజేయటానికి కోట్లాది పక్షులు ఆ పనిలో నిమగ్నమైవున్నాయట. "పద నేను చూస్తాను" అని గరుడుడు కూడా వచ్చాడు. దీని అర్ధం ఏమిటంటే ఎప్పుడైతే మానవుడు తన పనిని దృఢతా పూర్వకంగా చేస్తాడో అప్పుడు సహాయం కూడ తప్పక లభిస్తుంది. యుక్తికూడా దొరుకుతుంది. బుద్ధికూడ స్ఫురిస్తుంది. తన పనిని దృఢంగా చెయ్యగలగటమే కావలసినది. సహాయం చేసేవారు వస్తారు. వివేచన నిచ్చేవాళ్ళు వస్తారు. గరుడుడు వచ్చాడు. అంతా విన్నాక గరుడుడిలా అన్నాడు.
"ఓ సముద్రమా! మా వారంతా ఇన్నిపక్షులు సంలగ్నమై నిన్ను శుష్కింపజేయాలనుకుంటున్నారు. నీవేమో ఇవి నన్నేం చేస్తాయి? క్షుద్రమైన పక్షులు అనుకుంటున్నావా ఇప్పుడు చూడు నా తడాఖా!" అని గరుడుడు సముద్రముపైన తన రెక్కలతో రెండు మూడు సార్లు బలంగా ప్రహారం చేశాడు. అప్పుడు సముద్రుడు ఉద్విగ్నుడైనాడు. గబ్బిలపు గుడ్లను తెచ్చి ఇచాడు. దానికి తన గుడ్లు లభించాయి.దీని అభిప్రాయం ఏమిటంటే ఎంత పెద్ద పనైయిన సరే సంకల్పించి, మన శక్తికొద్దీ ప్రయత్నిస్తే అప్పుడు నీకు సహాయం చెసేవాళ్ళు, నీకు సలహా ఇచ్చేవాళ్ళు నీకు లభిస్తారు. అప్పుడు ఆపని చెయ్యడం వలన నీకు సఫలత చేకూరుతుంది. కేవలం నిరుత్సాహంతో ఉండకూడదు. అందుకనే -
భగవంతుడంటాడు - "ఓ బుద్దిశీలులారా! లేవండి! జాగృతులు కండి. మీ జీవితములో అగ్నిని (తేజస్సు) ప్రజ్వలింపజేయండి. తేజోవంతులు కండి. ప్రకాశవంతులు కండి. ఎట్టిపరిస్థితులలోను, నిరుత్సాహితులు కాకండి. పదండి ముందుకు! పదండి ముందుకు!!

రామాయణం -- 49

అలా రామలక్ష్మణులని సుగ్రీవుడు ఉన్న ప్రాంతానికి తీసుకొచ్చేటప్పుడు హనుమంతుడు తన కపి రూపాన్ని వదిలి భిక్షు రూపాన్ని పొందాడు. అప్పుడు హనుమంతుడు సుగ్రీవుడితో
అయం రామో మహాప్రాజ్ఞ సంప్రాప్తో దృఢ విక్రమః |
లక్ష్మణేన సహ భ్రాత్రా రామోయం సత్య విక్రమః ||
" సుగ్రీవా! వచ్చినటువంటివాడు మహా ప్రాజ్ఞుడైన, ధృడమైన విక్రమము ఉన్న రామచంద్రమూర్తి మరియు ఆయన తమ్ముడు లక్ష్మణుడు. రాముడిని దశరథ మహారాజు అరణ్యవాసానికి పంపిస్తే అరణ్యాలకి వచ్చాడు తప్ప, ధర్మబధమైన నడువడిలేక రాజ్యాన్ని పోగొట్టుకున్నవాడు కాదు. ఈయన తన భార్య అయిన సీతమ్మతో, లక్ష్మణుడితో అరణ్యవాసానికి వస్తే, ఆయన భార్యని ఎవడో ఒక రాక్షసుడు అపహరించాడు. అందుకని ఆ సీతమ్మని అన్వేషిస్తూ ఈ ప్రాంతానికి చేరుకున్నారు. నిన్ను శరణాగతి చేస్తున్నాడు, నీతో స్నేహం చెయ్యాలనుకుంటున్నాడు. అందుకని సుగ్రీవా, ఈయనతో స్నేహం చెయ్యవలసింది " అన్నాడు.
అప్పుడు సుగ్రీవుడు " రామ! మీ దెగ్గర గొప్ప తపస్సు ఉంది, అనేకమైన గుణములు, విశేషమైన ప్రేమ ఉంది. ఇన్ని గుణములు కలిగిన వ్యక్తి నాకు స్నేహితుడిగా లభించడం నా అదృష్టం. ఇటువంటి వ్యక్తి స్నేహితుడిగా లభిస్తే ఈ ప్రపంచంలో దేనినైన పొందవచ్చు. అందుచేత ఇది నాకు దేవతలు ఇచ్చిన వరము అని అనుకుంటున్నాను. రామ! నీకు తెలియని విషయం కాదు, స్నేహం చేసేటటువంటివాడికి ఒక ధర్మం ఉంది. భర్త ఎలాగైతే తన కుడి చేతిని భార్య కుడి చేతితో బాగా రాశి పట్టుకుంటాడో, అలా స్నేహం చేసేవాళ్ళు కూడా పట్టుకోవాలి. అందుకని నువ్వు నాతో స్నేహమును ఇచ్చగించిన వాడివైతే, నా బాహువుని చాపుతున్నాను, నీ బాహువుని నా బాహువుతో కలుపు " అన్నాడు.
వెంటనే హనుమంతుడు తన సన్యాసి రూపాన్ని విడిచిపెట్టి కపి రూపానికి వచ్చేసి గబగబా వెళ్ళి నాలుగు ఎండిపోయిన కట్టెలని తెచ్చి, కర్రతో కర్రని రాపాడించి అగ్నిహోత్రాన్ని పుట్టించాడు. అప్పుడు రాముడు, సుగ్రీవుడు ఆ అగ్నిహోత్రానికి ప్రదక్షిణ చేసి, ఇద్దరూ తమ చేతులు కలుపుకున్నారు.
అప్పుడు రాముడు " మనిద్దరమూ స్నేహం చేసుకున్నాము కదా, ఇకనుంచి ఇద్దరి కష్టసుఖాలు ఇద్దరివీ " అన్నాడు.
సుగ్రీవుడు వెంటనే వెళ్ళి పుష్పించి ఉన్న పెద్ద సాలవృక్షము కొమ్మని విరిచి రాముడికి ఆసనంగా వేసి కుర్చోమన్నాడు. అలాగే హనుమంతుడు ఒక గంధపు చెట్టు కొమ్మని తీసుకొచ్చి లక్ష్మణుడిని కుర్చోమన్నాడు. రామలక్ష్మణులిద్దరు కూర్చున్న తరువాత సుగ్రీవుడు " రామ! నన్ను నా అన్నగారైన వాలి రాజ్యం నుండి వెళ్ళగొట్టాడు. నా భార్యని తన భార్యగా అనుభవిస్తున్నాడు. దిక్కులేనివాడినై ఈ కొండమీద మీద జీవితాన్ని గడుపుతున్నాను " అన్నాడు.
ఉపకార ఫలం మిత్రం విదితం మే మహాకపే |
వాలినం తం వధిష్యామి తవ భార్య అపహారిణం ||
అప్పుడు రాముడు " ఉపకారము చేసినవాడు స్నేహితుడు కాబట్టి, నువ్వు కష్టంలో ఉన్నావు కాబట్టి, నేను నీ స్నేహితుడిని కాబట్టి నీకు ఉపకారము చెయ్యాలి. నువ్వు బతికి ఉండగా నీ భార్యని తన భార్యగా అనుభవిస్తున్నాడు వాలి, ఈ ఒక్కమాట చాలు ధర్మం తప్పిన వాలిని చంపడానికి. అందుకని వాలిని చంపేస్తాను " అన్నాడు.
ఈ మాటలు విన్న సుగ్రీవుడు, సుగ్రీవుడి మంత్రులు పొంగిపోయారు. ఒకరిని ఒకరు చూపులతో తాగుతున్నార! అన్నట్టుగా చూసుకున్నారు. అలా రాముడు, సుగ్రీవుడు ఒకళ్ళ చేతిలో ఒకరు చెయ్యి వేసుకుని సంతోషంగా మాట్లాడుతుంటే, ముగ్గురికి ఎడమ కళ్ళు అదిరాయి. పద్మంలాంటి కన్నులున్న సీతమ్మ ఎడమ కన్ను, బంగారంలాంటి పచ్చటి కన్నులున్న వాలి ఎడమ కన్ను, ఎర్రటి కన్నులున్న రావణాసురుడి ఎడమ కన్ను అదిరాయి.
తరువాత సుగ్రీవుడు " కనపడకుండా పోయిన వేదాన్ని మళ్ళి తీసుకొచ్చి ఇచ్చినట్టు, నీకు నేను సీతమ్మని తీసుకొచ్చి ఇస్తాను. సీతమ్మని పాతాళలోకంలో కాని, స్వర్గలోకంలో కాని దాయని, నేను సీతమ్మని వెతికి తీసుకొస్తాను " అన్నాడు.
సుగ్రీవుడి మాటలు విన్న రాముడికి సీతమ్మ గుర్తుకువచ్చి భోరున రోదించాడు.
అప్పుడు సుగ్రీవుడు " రామ శోకించకు. నీకు ఒక ఆశ్చర్యకరమైన సంఘటన గురించి చెబుతాను. ఒకనాడు నేను ఈ పర్వత శిఖరాల మీద మంత్రులతో కలిసి కూర్చొని ఉన్నాను. అప్పుడు ఆకాశంలో ఎర్రటి నేత్రములు కలిగిన రాక్షసుడు పచ్చటి వస్త్రములు కట్టుకున్న ఒక స్త్రీని తీసుకుపోతున్నాడు. అప్పుడు ఆ తల్లి తన చీర కొంగుని చింపి, అందులో తన ఆభరణములను కొన్నిటిని మూటకట్టి పైనుండి కిందకి జారవిడిచింది. బహుశా ఆ స్త్రీ సీతమ్మ అయి ఉంటుందని నేను అనుకుంటున్నాను. నేను వెళ్ళి ఆ ఆభరణములు తీసుకొస్తాను, అవి సీతమ్మ ఆభారణాలేమో చూడు " అన్నాడు.
కొంతసేపటికి సుగ్రీవుడు ఆ ఆభరణాలని తీసుకొచ్చాడు. ఆ ఆభరణాలని చూసేసరికి, ఒక్కసారి శోకం తన్నుకొచ్చినవాడై రాముడు మూర్ఛపోయి నేలమీద పడిపోయాడు. తరువాత ఆయన తేరుకొని ఆ ఆభరణాలని చూద్దాము అంటె కళ్ళనిండా నీరు ఉండడం చేత, ఎన్నిసార్లు తుడుచుకున్నా ఆ కన్నీరు ఆగడంలేదు కనుక ఆయన లక్ష్మణుడిని పిలిచి " లక్ష్మణా! ఈ ఆభారణాలని ఒక్కసారి చూడు. ఇవి విరిగిపోయి ముక్కలు అవ్వలేదు, సీత ఈ ఆభరణాలని విడిచిపెట్టినప్పుడు ఇవి గడ్డి మీద పడిఉంటాయి. నువ్వు వీటిని ఒకసారి చూడు " అన్నాడు.
న అహం జానామి కేయూరే న అహం జానామి కుండలే |
నూపురే తు అభిజనామి నిత్యం పాద అభివందనాత్ ||
అప్పుడు లక్ష్మణుడు " అన్నయ్యా! ఈ కేయూరాలు వదిన పెట్టుకుందో లేదో నాకు తెలీదు, ఈ కుండలాలు వదిన పెట్టుకుందో లేదో నాకు తెలీదు. అన్నయ్యా! ఈ నూపురాలు మాత్రం వదినవే. నేను ప్రతిరోజు వదిన కాళ్ళకి నమస్కారం పెట్టేవాడిని, అప్పుడు ఈ నూపురాలని వదిన పాదాలకి చూశాను " అన్నాడు.
అప్పుడు సుగ్రీవుడి రాముడితో " అయ్యయ్యో, అలా ఏడవకు రామ. నేను కూడా నీలాగే కష్టపడుతున్నాను. నువ్వే ఆలోచించు, నేను నీలా ఏడుస్తున్నాన? నీలాగే నా భార్య కూడా అపహరింపబడింది. నీకు చెప్పగలిగేంత సమర్దుడిని కాదు, కాని ఒక్కసారి నీకు జ్ఞాపకం చేద్దామని స్నేహ లక్షణంతో చెప్పాను. నీ యొక్క దుఃఖాన్ని ఉపశమింప చేసుకో, నాయందు ఉన్న స్నేహాన్ని జ్ఞాపకం చేసుకో " అన్నాడు.
వెంటనే రాముడు స్వస్థతని పొంది " ఉత్తమమైన మిత్రుడు ఎటువంటి మాట చెప్పాలో అటువంటి మాట చెప్పావయ్య సుగ్రీవా. కాని నాకు ఒక విషయం చెప్పు. ఈ రాక్షసుడు ఎక్కడ ఉంటాడో నాకు చెప్పు, నేను వెంటనే వెళ్ళి రాక్షస సంహారం చేస్తాను " అన్నాడు.
అప్పుడు సుగ్రీవుడు " నేను సత్యం చెబుతున్నాను, నా మాట నమ్ము. నీ భార్యని తీసుకొచ్చే పూచి నాది. కాని నీ భార్యని అపహరించిన రాక్షసుడి పేరు నాకు తెలీదు. ఎక్కడుంటాడో నాకు తెలీదు. నువ్వు బెంగ పెట్టుకోవద్దు, ముందు నా కార్యానికి సహాయం చెయ్యి " అన్నాడు.
అప్పుడు రాముడు " ఆ వాలి ఎక్కడ ఉంటాడో చెప్పు, నేను వెంటనే సంహరిస్తాను. ఇంతకముందెన్నడు నేను అసత్యం పలకలేదు, ఇక ముందు కూడా అసత్యం పలకను. నీకు మాట ఇచ్చిన ప్రకారం వాలిని సంహరిస్తాను " అన్నాడు.
ఈ మాటలు విన్న సుగ్రీవుడు " నువ్వు ఇంత మాట అన్నావు, నాకు ఇంకేమి కావాలి. నీలాంటి స్నేహితుడు లభిస్తే స్వర్గలోకమే లభిస్తుంది, ఇక వానర రాజ్యం లభించడం గొప్ప విషయమా " అన్నాడు.
అప్పుడు రాముడు " అసలు ఏమి జెరిగిందో నాకు చెప్పు, నువ్వు ఈ కొండ మీద బతకవలసిన అవసరం ఎందుకు ఏర్పడింది. నాకు అన్నీ వివరంగా చెప్పు " అన్నాడు.
అప్పుడు సుగ్రీవుడు జెరిగిన కథని సంగ్రహంగా రాముడికి వివరించాడు. సుగ్రీవుడు చెప్పిన కథ విన్న రాముడు " అసలు నీకు, నీ అన్న అయిన వాలికి ఎందుకు శత్రుత్వం ఏర్పడింది. నువ్వు నాకు ఆ విషయాన్ని పూర్తిగా చెపితే, నేను మీ ఇద్దరి బలాబలాలని అంచనా వేస్తాను. అప్పుడు మనం వెంటనే వెళ్ళవచ్చు " అన్నాడు.
అప్పుడు సుగ్రీవుడు అసలు కథని వివరంగా ఇలా చెప్పాడు " రామ! ఒకానొకప్పుడు మా తండ్రి అయిన ఋక్షరజస్సు ఈ వానర రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. ఆ ఋక్షరజస్సుకి ఇంద్రుడి అనుగ్రహంగా వాలి ఔరసపుత్రుడిగా జన్మించాడు, సూర్యుడి అనుగ్రహంగా నేను ఔరసపుత్రుడిగా జన్మించాను. పెద్ద కుమారుడైన వాలి తండ్రి యొక్క ప్రీతిని పొందాడు. నేను కూడా చాలాకాలం వాలిని ప్రీతితో అనుగమించాను. కొంతకాలానికి ఋక్షరజస్సు శరీరాన్ని విడిచిపెట్టాక, పెద్ద కుమారుడు కనుక వాలికి పట్టాభిషేకం చేశారు. నేను వాలియందు వినయవిధేయలతో, భయభక్తులతో ఉండేవాడిని.
దుందుభి అనే రాక్షసుడి అన్న అయిన మయుడికి ఒక కుమారుడు ఉన్నాడు, వాడి పేరు మాయావి. ఆ మాయవికి, వాలికి ఒక స్త్రీ సంబంధంగా వైరం వచ్చింది. ఆ కారణం చేత మాయావి ఒకరోజు రాత్రి కిష్కిందా ద్వారం దెగ్గరికి వచ్చి గట్టిగా కేకలు వేసి ' వాలి బయటకి రా, మనిద్దరమూ యుద్ధం చేద్దాము. ఈరోజుతో నిన్ను సంహరిస్తాను ' అన్నాడు. అప్పటివరకూ తన భార్యలతో సంతోషంగా కాలం గడుపుతున్న వాలి గబగబా బయటకి వచ్చాడు. అప్పుడు నేను కూడా బయటకి వచ్చాను. ఆ మాయావి మా ఇద్దరినీ చూసి భయపడి పారిపోయాడు. అక్కడున్న స్త్రీలు ' ఎలాగు వాడు పారిపోతున్నాడు కాదా, ఇంక విడిచిపెట్టు ' అన్నారు. కాని, శత్రువుని విడిచిపెట్టనని వాలి వాడి వెనకాల పరిగెత్తాడు. అప్పుడు నేను కూడా వాలి వెనకాల వెళ్ళాను.
పరిగెత్తి పరిగెత్తి, తృణముల చేత కప్పబడిన ఒక పెద్ద బిలంలోకి ఆ మాయావి దూరిపోయాడు. అక్కడికి వెళ్ళి నేను, వాలి నిలబడ్డాము. అప్పుడు వాలి నాతో ' సుగ్రీవా! నువ్వు ఈ బిల ద్వారం దెగ్గర కాపలాగా ఉండు, నేను ఇందులోకి వెళ్ళి ఆ రాక్షసుడిని సంహరించి వస్తాను. నువ్వు నా తమ్ముడివి, చిన్నవాడివి నా పాదముల మీద ఒట్టు పెట్టి చెబుతున్నాను, నువ్వు ఇక్కడే ఉండు ' అని చెప్పి వాలి గుహలోపలికి వెళ్ళాడు.
వాలి లోపలికి వెళ్ళి ఒక సంవత్సర కాలం గడిచిపోయింది. నేను బయట అలాగే నిలబడ్డాను. అలా చాలాకాలం తరువాత లోపలినుండి రాక్షసుల కేకలు వినపడ్డాయి. ఆ ద్వారం దెగ్గర నురగతో కూడిన నెత్తురు ప్రవహిస్తూ బయటకి వచ్చింది. ఎక్కడా వాలి మాట కాని, వాలి అలికిడి కాని వినపడలేదు. బహుశా మా అన్నగారైన వాలిని ఈ రాక్షసులు సంహరించి ఉంటారు అనుకొని, ఈ రాక్షసులు బయటకి వస్తే ప్రమాదము అని, నేను ఒక పెద్ద శిలని తీసుకొచ్చి ఆ బిలానికి అడ్డుగా పెట్టాను. అప్పుడు నేను చనిపోయాడనుకున్న వాలికి అక్కడే ఉదకక్రియ నిర్వహించి తర్పణలు విడిచిపెట్టాను.
తరువాత నేను రాజ్యానికి వచ్చి, ఎవ్వరికీ తెలియకుండా శాస్త్రం ప్రకారం వాలికి చేయవలసిన కార్యములను చేశాను. నేను అంత జాగ్రత్తగా ఎవరికి తెలియకుండా చేసినప్పటికీ, మంత్రులు విషయాన్ని కనిపెట్టి, రాజు లేకుండా రాజ్యం ఉండకూడదు కనుక నన్ను బలవంతంగా సింహాసనం మీద కూర్చోపెట్టి పట్టాభిషేకం చేశారు. నేను చాలా ధర్మబద్ధంగా వానర రాజ్యాన్ని పరిపాలిస్తూ కాలం గడుపుతున్నాను.
ఒకనాడు అకస్మాత్తుగా మా అన్న వాలి తిరిగివచ్చాడు. అప్పుడాయన ఎర్రనైన కళ్ళతో నావంక చూశాడు. నా మంత్రులని, స్నేహితులని బంధించి కారాగారంలో వేశాడు. ఆ సమయంలో నేను ప్రభువుగా ఉన్నాను కనుక, నాకున్న బలం చేత, నేను వాలి బంధించి కారాగారంలో పెట్టగలను, కాని నేను అలా చెయ్యలేదు. ఆయన నాకు అన్నగారు, ఆయనని నేను గౌరవించాలి అందుకని నేను ఆయనని నిగ్రహించలేదు.
దిష్ట్యా అసి కుశలీ ప్రాప్తో నిహతః చ త్వయా రిపుః |
అనాథస్య హి మే నాథః త్వం ఏకో అనాథ నందనః ||
అప్పుడు నేను ఆయన దెగ్గరికి వెళ్ళి నా రెండు చేతులని జోడించి, శిరస్సు వంచి ' అన్నయ్యా! నువ్వు లేక నేను అనాథనయ్యాను. నువ్వు తిరిగి రావడం వలన ఇవ్వాళ నేను నాథుడున్న వాడిని అయ్యాను. నాకు ఎంతో సంతోషంగా ఉంది. అన్నయ్యా! నూరు తీగలున్న ఈ తెల్లటి ఛత్రాన్ని నీ శిరస్సుకి పెడతాను, నీకు చామరం వేస్తాను. నువ్వు మళ్ళి సింహాసనం మీద కూర్చొని పూర్వం ఎలా పరిపాలించేవాడివో అలా పరిపాలించు. నేనెప్పుడూ పట్టాభిషేకం చేసుకుందామని అనుకోలేదు. బలవంతంగా మంత్రులు, పౌరులు నాకు పట్టాభిషేకం చేశారు. నేను నీకు శిరస్సు వంచి అంజలి ఘటిస్తున్నాను, ఎప్పటికీ నువ్వే వానర రాజ్యానికి రాజువి. అందుకని రాజ్యాన్ని స్వీకరించు ' అన్నాను.
అప్పుడు వాలి ' చి ఛి, పరమ దుష్టుడా నేను లేని సమయం చూసి నువ్వు పట్టాభిషేకం చేసుకున్నావు. నువ్వు పరమ దుర్మార్గుడివి ' అన్నాడు. మరునాడు జానపదులను, మంత్రులను, ఇతరమైన వానరములను పిలిచి ఒక పెద్ద సభ తీర్చాడు. అప్పుడు నేను వాలి పక్కన నిలబడ్డాను. అప్పుడాయన నన్ను చూసి ' నేను దురాత్ముడైన మాయవిని చంపడం కోసమని ఒక రాత్రి పరిగెత్తుకుంటూ వెళ్ళాను. ఈ మహాపాపి అయిన నా తమ్ముడు నన్ను అనుగమించి వచ్చాడు. నేను రాక్షసులని చంపి వెనక్కి వస్తాను, నువ్వు బిల ద్వారం దెగ్గర కాపలాగా ఉండు అన్నాను. కాని పాపపు ఆలోచన కలిగిన సుగ్రీవుడు నేను లోపలికి వెళ్ళగానే శిలా ద్వారాన్ని అడ్డు పెట్టాడు. నేను లోపల మరణిస్తాను అని తిరిగొచ్చి పట్టాభిషేకం చేసుకున్నాడు. కాని నేను లోపలికి వెళ్ళాక మాయావి నాకు కనపడలేదు. ఒక సంవత్సర కాలం వెతికాక ఆ మాయావి తన బంధువులతో, స్నేహితులతో కనపడ్డాడు. నేను వాళ్ళందరినీ సంహరించాను. ఆ గుహ అంతా నెత్తురుతో నిండిపోయింది. నేను బయటకి వద్దాము అనుకున్నాను, కాని వీడు శిలని అడ్డుపెట్టాడు. నేను ఎంతో కష్టంతో ఆ శిలని పక్కకి తోసి ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చేసరికి వీడు రాజ్యాన్ని పరిపాలిస్తూ సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. కావాలనే నన్ను గుహలో పెట్టి రాజ్యాన్ని తీసుకున్నాడు. వీడిని ఎట్టి పరిస్థితులలోను ఆదరించకూడదు. రాజ్యం కోసమని అన్నని హత్య చెయ్యాలని ప్రయత్నం చేసినవాడు ' అన్నడు.
అప్పుడు వాలి నన్ను కట్టుబట్టతో బయటకి తరిమేశాడు. అప్పుడు నేను భయపడుతూ బయటకి వచ్చాను. కాని వాలి నన్ను వదిలిపెట్టకుండా చంపుతాను అని ఈ భూమండలం అంతా తరిమాడు. నేను ఈ భూమండలం అంతా పరిగెత్తాను. ఈ కొండమీదకి వాలి రాలేడు కనుక, చిట్టచివరికి నేను ఈ కొండ మీద కూర్చున్నాను. నాకు అత్యంత ప్రియమైన భార్య అయిన రుమని, నేను బ్రతికి ఉండగా వాలి తన భార్యగా అనుభవిస్తున్నాడు. నేను చెయ్యని పాపానికి నన్ను కట్టుబట్టలతో బయటకి తోసేశాడు. నేను ఎంత చెప్పినా వినలేదు, పైగా నా భార్యని తన భార్యగా చేసుకున్నాడు. ఇంత కష్టంలో ఉన్నాను రామ............." అని సుగ్రీవుడు ఏడిచాడు.
ఈ మాటలు విన్న రాముడు " గ్రద్దల యొక్క ఈకలు కట్టినటువంటి, ఒంపులు లేనటువంటి బంగారు బాణములు నా అమ్ములపొదిలో ఉన్నాయి. నడువడి తెలియక పాపాత్ముడైన వాలి ఎంతకాలం నా కంటికి కనపడడో, అంతకాలమే బతికి ఉంటాడు. వాలి నాకు కనపడగానే మరణిస్తాడు. నువ్వు బెంగ పెట్టుకోకు, వాలిని ఇప్పుడే సంహరిస్తాను. వాలి ఎక్కడ ఉంటాడో నాకు చూపించు " అన్నాడు.
సముద్రాత్ పశ్చిమాత్ పూర్వం దక్షిణాద్ అపి చ ఉత్తరం |
క్రామతి అనుదితే సూర్యే వాలీ వ్యపగత క్లమః ||
అప్పుడు సుగ్రీవుడు " రామ తొందరపడకు, నీకు ఒక విషయం చెబుతాను విను. సూర్యోదయానికి ముందరే వాలి నిద్రలేస్తాడు. అప్పుడు తన అంతఃపురం నుంచి ఒక్కసారి ఎగిరి తూర్పు సముద్రతీరం దెగ్గర దిగుతాడు. అక్కడ సంధ్యావందనం చేసి ఒకే దూకులో పశ్చిమ సముద్రతీరం దెగ్గర దిగుతాడు. మళ్ళి అక్కడ సంధ్యావందనం చేసి ఒకే దూకులో ఉత్తర సముద్రతీరం దెగ్గర దిగుతాడు. మళ్ళి అక్కడ సంధ్యావందనం చేసి ఒకే దూకులో దక్షిణ దిక్కుకి దూకుతాడు. ఇలా నాలుగు సముద్రాల దెగ్గర సూర్యుడు ఉదయించేలోపు సంధ్యావందనం చేస్తాడు. దానితో పాటు నీకు ఇంకొక విషయం చెబుతాను రామ " అని రాముడిని తీసుకువెళ్ళి ఒక పర్వతాన్ని చూపించి, " చూశావ ఈ పర్వతాలు. వాటికి ఎంత పెద్ద శిఖరాలు ఉన్నాయో చూశావ. వాలి సంధ్యావందనం చేశాక ఇంటికి వెళ్ళి కొన్ని పాలు తాగి మళ్ళి ఈ అరణ్యానికి వస్తాడు. ఇక్కడ ఉన్న ఈ పర్వత శిఖరాలని ఊపి విరగ్గొడతాడు. అప్పుడు వాటిని గాలిలోకి విసిరి బంతులు పట్టుకున్నట్టు పట్టుకుంటాడు " అని చెప్పి, రాముడిని మరొక్క ప్రదేశానికి తీసుకువెళ్ళి,
" పూర్వం దుందుభి అని ఒక రాక్షసుడు ఉండేవాడు. వాడికి ఒంట్లో బలం ఉందన్న పొగరు చేత ఒకరోజు సముద్రుడి దెగ్గరికి వెళ్ళి తనతో యుద్ధం చెయ్యమన్నాడు. నీతో నాకు యుద్ధం ఏమిటి, నీ బలం ఎక్కడ నా బలం ఎక్కడ. నేను నీతో యుద్ధ చెయ్యలేను అని సముద్రుడు అన్నాడు. అప్పుడా దుందుభి ' నువ్వు నాతో యుద్ధం చెయ్యలేనంటె నేను నిన్ను వదలను, నాతో యుద్ధం చెయ్యగలిగిన వాడిని నాకు చూపించు ' అన్నాడు. అప్పుడా సముద్రుడు ' హిమవంతుడని ఉత్తర భారతదేశంలో ఒక పెద్ద పర్వతం ఉంది, అది మంచు పర్వతం. ఆయన కూతురు పార్వతీ దేవి, ఆ పార్వతీ దేవిని పరమశివుడికి ఇచ్చి వివాహం చేశారు. ఆయన మీద గొప్ప గొప్ప అరణ్యాలు, గుహలు ఉన్నాయి. నువ్వు ఆ హిమవంతుడితో యుద్ధం చెయ్యి ' అన్నాడు.
అప్పుడా దుందుభి హిమవంత పర్వతం దెగ్గరికి వెళ్ళి ఆ పర్వత శిఖరాలని పీకేసి ముక్కలు చేస్తున్నాడు. దుందుభి చేస్తున్న అల్లరికి హిమవంతుడు పరుగు పరుగున వచ్చాడు. అప్పుడా దుందుభి హిమవంతుడిని యుద్ధానికి రమ్మన్నాడు, నాకు ఎవరితోనూ యుద్ధం చెయ్యాలని లేదు, నేను యుద్ధం చెయ్యను అని హిమవంతుడు అన్నాడు. అప్పుడా దుందుభి ' నువ్వు కూడా ఇలాగంటే ఎలా. సముద్రుడు కూడా నీలాగే యుద్ధం చెయ్యనన్నాడు. పోనీ నాతో యుద్ధం చేసేవాడి పేరు చెప్పు ' అన్నాడు. అప్పుడు హిమవంతుడు ' నీ ఒంటి తీట తీర్చగలిగినవాడు ఒకడున్నాడు. కిష్కిందా రాజ్యాన్ని ఏలే వాలి ఉన్నాడు. మంచి బలవంతుడు. ఆయన నీతో యుద్ధం చేస్తాడు ' అని చెప్పాడు.
అప్పుడా దుందుభి సంతోషంగా కిష్కిందకి వెళ్ళి, అక్కడున్న చెట్లని విరిచి, ఆ కిష్కింద ద్వారాన్ని పగులగొట్టి పెద్ద అల్లరి చేశాడు. భార్యలతో కామమోహితుడై రమిస్తున్న వాలి ఈ అల్లరికి బయటకి వచ్చాడు. ఆ దుందుభి వాలిని చూసి ' ఛి, భార్యలతో కామం అనుభవిస్తున్నావా. నా కోపాన్ని రేపటిదాకా ఆపుకుంటాను. పో, నీ భార్యలతో కామం అనుభవించు. నువ్వు ఈ రాత్రి నీ భార్యలతో హాయిగా భోగం అనుభవించు, నీకు స్నేహితులైన వారిని పిలిచి వారికి కానుకలు ఇవ్వు, నీతో సమానమైన వాడికి పట్టాభిషేకం చేసెయ్యి. తాగి ఉన్నవాడిని, కామం అనుభవిస్తున్న వాడిని, అప్రమత్తంగా లేనివాడిని, యుద్ధం నుంచి పారిపోతున్నవాడిని, ఆయుధం లేనివాడిని చంపితే పసిపిల్లాడిని చంపిన పాపం వస్తుంది, అందుకని నేను నిన్ను వదిలేస్తున్నాను. ఎలాగోలా ఈ రాత్రికి ఇక్కడ కూర్చొని ఉంటాను. రేపు పొద్దున్న రా, నిన్ను చంపి అవతల పడేస్తాను ' అన్నాడు.
అప్పుడా వాలి ' నువ్వు నా గురించి అంతగా బెంగ పెట్టుకోమాకు. నేను తాగి ఉన్నా కూడా, అది వీరరసం తాగినవాడితో సమానం, రా యుద్ధానికి ' అని, అడ్డువచ్చిన భార్యలని పక్కకు తోసేసి దుందుభి మీదకి యుద్ధానికి వెళ్ళాడు. ఇంద్రుడు ఇచ్చిన మాలని వాలి తన మెడలో వేసుకుని దుందుభి తల మీద ఒక్క గుద్దు గుద్దాడు. ఆ దెబ్బకి దుందుభి ముక్కు నుండి, చెవుల నుండి నెత్తురు కారి కిందపడిపోయాడు. ఆ హొరాహొరి యుద్ధంలో వాలి దుందుభిని సంహరించాడు. అప్పుడాయన ఆ దుందుభి శరీరాన్ని గిరగిర తిప్పుతూ విసిరేశాడు. అప్పుడది గాలిలో యోజన దూరం ఎగురుకుంటూ వెళ్ళి మతంగ మహర్షి ఆశ్రమం దెగ్గర పడింది. అలా పడిపోవడంలో ఆశ్రమం అంతా నెత్తురితో తడిసిపోయింది. అప్పుడా మతంగ మహర్షి బయటకి వచ్చి దివ్య దృష్టితో చూసి ' ఎవడురా ఒళ్ళు కొవ్వెక్కి దుందుభి కళేబరాన్ని ఇటు విసిరినవాడు, ఈ శరీరాన్ని విసిరిన దౌర్భాగ్యుడు ఇక్కడికి వస్తే వాడి తల వెయ్యి వ్రక్కలయ్యి మరణిస్తాడు ' అని చెప్పి, ' ఇక్కడ మీరందరూ మీ ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారు. వాలికి సంబంధించినవాడు ఎవడైనా సరే ఇక్కడి చెట్లని పాడుచేస్తూ తిరిగితే, రేపటి తరువాత వాళ్ళు మరణిస్తారని శపిస్తాను. నేను శపించే లోపల మీ అంతట మీరు ఇక్కడి నుండి వెళ్ళిపొండి ' అన్నాడు.
అప్పుడు అక్కడున్నటువంటి వానరాలు ఆ పర్వతాన్ని ఖాళీ చేసి వాలి దెగ్గరికి పారిపోయి మతంగ మహర్షి యొక్క శాపం గురించి వివరించారు. అందుకని వాలి ఈ పర్వతం వైపు కనీసం చూడను కూడా చూడడు. నేను బతకాలంటే ఈ బ్రహ్మాండంలో వాలి రాని ప్రదేశం ఇదే, అందుకని నేను ఇక్కడ ఉంటున్నాను. ఇంతకీ నేను నిన్ను ఇక్కడికి ఎందుకు తీసుకోచ్చానో తెలుసా, అదిగో అక్కడ ఎదురుగుండా కనపడుతుందే పెద్ద తెల్లటి పర్వతంలాంటిది, అదే దుందుభి యొక్క కాయం. ఆ అస్థిపంజరం ఇప్పుడు పర్వతంలా అయిపోయింది " అన్నాడు.

రామాయణం -- 46

త్వయా ఏవ నూనం దుష్టాత్మన్ భీరుణా హర్తుం ఇచ్ఛతా |
మమ అపవాహితో భర్తా మృగ రూపేణ మాయయా ||
రావణుడి చేత ఎత్తుకుపోబడుతున్న సీతమ్మ ఇలా అనింది " నువ్వు మాయా మృగాన్ని సృష్టించి, నా భర్త నా నుంచి చాలా దూరంగా వెళ్ళాలన్న దుష్టసంకల్పంతో ఆ మృగాన్ని ఆశ్రమంలోకి పంపించి, ఒక్కత్తిగా ఉన్న నన్ను అపహరించావు. ఇది ఒక గొప్ప కార్యమని ఎవరూ అనరు. అలాగే ఇది యాద్రుచ్చికముగా జెరిగిన సంఘటన కాదు. ఇలా జెరగాలని నువ్వు ముందుగానే ప్రణాళిక రచించావు. ఇలా చెయ్యడం నీ పరాక్రమానికి కాని, నీ తపస్సుకి కాని, ఒకనాడు నువ్వు జీవించిన జీవితానికి కాని ఏవిధంగా నిదర్శనంగా నిలబడుతుంది. ఒక పరస్త్రీని ఎత్తుకొచ్చి నేను గొప్పవాడిని అని చెప్పుకుంటున్నావు, ఇలా చెప్పుకోడానికి నీకు సిగ్గువెయ్యడం లేదా. నువ్వు నిజంగా అంత గొప్పవాడివి అయితే, రాముడు లేనప్పుడు నన్ను ఎందుకు తీసుకొచ్చావు, రాముడు ఉండగా ఎందుకు రాలేకపోయవు. నువ్వు చేసిన పని పెద్దలైనవారు, వీరులైనవారు అంగీకరించేటటువంటి పని కాదు. నన్ను ముట్టుకోవడం, నన్ను అనుభవించడం నువ్వు ఒక్కనాటికి చెయ్యగలిగే పని కాదు. కాని నన్ను ముట్టుకొని తేవడం వలన, నీ శరీరం పడిపోయాక నరకానికి తీసుకువెళ్ళి, చీము నెత్తురుతో ఉండే అసిపత్రవనంలొ పడేస్తారు, అలాగే ఘోరమైన వైతరణి నదిలో పడేస్తారు. ఇప్పుడు నన్ను పట్టుకున్నానని సంతోషపడుతున్నావు, రేపు నువ్వు చచ్చాక నరకంలో ఒంటి నిండా శూలాలుండే శాల్మలీ వృక్షాన్ని కూడా గట్టిగా పట్టుకుంటావు. నిన్ను పాశములతో కట్టేసి కాలము లాక్కొనిపోతుందిరా. నువ్వు ఎప్పుడైతే మహాత్ముడైన రాముడితో వైరం పెట్టుకున్నావో, ఆనాడే నీ జీవితంలో సుఖం అనేది పోయింది, నువ్వు మరణించడం తధ్యం " అనింది.
సీతమ్మ చెప్పిన మాటలని ఆ రావణుడు విని, గాలికి వదిలేశాడు. తరువాత వారు సముద్రాన్ని దాటి, మయుడు మాయతో నిర్మించిన గంధర్వ నగరంలా ఉండే లంకా పట్టణాన్ని చేరి, తన అంతఃపురం దెగ్గర దిగాడు.
అబ్రవీత్ చ దశగ్రీవః పిశాచీః ఘోర దర్శనాః |
యథా న ఏనాం పుమాన్ స్త్రీ వా సీతాం పశ్యతి అసమ్మతః ||
తరువాత భయంకరమైన ముఖాలు ఉన్నటువంటి పిశాచ స్త్రీలని పిలిచి " ఈ సీత అంతఃపురంలో ఉంటుంది, నా అనుమతి లేకుండా ఏ స్త్రీ కాని, పురుషుడు కాని సీతని చూడడానికి వీలులేదు. నేను మిమ్మల్ని ఎవన్నా రత్నాలు కాని, ఆభరణములు కాని, వస్త్రములు కాని తీసుకురండి అంటె, వేరొకరి అనుమతి లేకుండా నాకు తెచ్చి ఎలా ఇస్తారో, అలాగే ఈ సీత మణులు కాని, మాణిక్యములు కాని, ఆభరణములు కాని, వస్త్రములు కాని అడిగితే, ఎవరి అనుమతి అవసరం లేకుండా వెంటనే తీసుకొచ్చి ఇవ్వండి. ఈ సీతతో ఎవరూ మాట్లాడకూడదు. ఒకవేళ ఎవరన్నా మాట్లాడుతున్నప్పుడు తెలిసి కాని, తెలియక కాని సీత యొక్క మనస్సు నొచ్చుకుందా, ఇక వారి జీవితము అక్కడితో సమాప్తము " అని వాళ్ళతో చెప్పి, తాను చేసిన ఈ పనికి చాలా ఆనందపడినవాడై అంతఃపురం నుంచి బయటకివెళ్ళి, నరమంసాన్ని తినడానికి అలవాటు పడిన కొంతమంది రాక్షసులని పిలిచి " నేను చెప్పే మాటలని జాగ్రత్తగా వినండి. ఒకప్పుడు జనస్థానంలొ ఖర దూషణుల నాయకత్వంలో 14,000 మంది రాక్షసులు ఉండేవారు. ఇప్పుడు ఆ రాక్షసులందరూ రాముడి చేతిలో నిహతులయిపోయారు, ఆ జనస్థానం ఖాళీ అయిపోయింది. అప్పటినుంచీ నా కడుపు ఉడికిపోతుంది. ఆ రాముడిని చంపేవరకు నాకు నిద్ర పట్టదు. అందుకని మీరు ఉత్తరక్షణం బయలుదేరి అక్కడికి వెళ్ళండి, పరమ ధైర్యంగా ఉండండి. అక్కడ ఏమి జెరిగినా వెంటనే నాకు చెప్పండి " అన్నాడు.
రావణుడి ఆజ్ఞ ప్రకారం ఆ రాక్షసులు జనస్థానానికి బయలుదేరారు. అప్పుడు రావణుడు అక్కడినుంచి బయలుదేరి అంతఃపురానికి వచ్చి, సీతని తెచ్చానని మనసులో చాలా ఆనందపడ్డాడు.
అశ్రు పూర్ణ ముఖీం దీనాం శోక భార అవపీడితాం |
వాయు వేగైః ఇవ ఆక్రాంతాం మజ్జంతీం నావం అర్ణవే ||
ఆ అంతఃపురంలో కళ్ళనిండా ఏడుస్తూ, చెంపల మీద ఆ కన్నీళ్ళు కారుతూ, అత్యంత దీనంగా, శోకం చేత పీడింపబడి, పెను తుఫానులో చిక్కుకొని మునిగిపోతున్న నౌకలోని వారు ఎటువంటి దిగ్భ్రాంతికి లోనవుతారో, అటువంటి దిగ్భ్రాంతి స్థితిలో సీతమ్మ ఉంది. వేటకుక్కల మధ్య చిక్కుకొని ఉన్న లేడి పిల్ల ఎలా భయపడుతూ ఉంటుందో, అలా సీతమ్మ తల దించుకుని ఏడుస్తూ ఉంది.
అలా ఏడుస్తున్న సీతమ్మని రావణాసురుడు బలవంతంగా రెక్కపట్టి పైకి తీసుకువెళ్ళి, తాను కట్టుకున్న అంతఃపురాన్ని, వజ్రాలతో నిర్మించిన గవాక్షాలని, దిగుడు బావులని, సరోవరాలని, తన పుష్పక విమానాన్ని, బంగారంతో తాపడం చెయ్యబడ్డ స్తంభాలని, ఆసనాలని, శయనాలని మొదలైనవాటిని సీతమ్మకి చూపించాడు. అలా తన ఐశ్వర్యాన్ని సీతమ్మకి ప్రదర్శించాక " ఈ లంకలో ఉన్న బాలురని, వృద్ధులని లెక్కనుంచి మినహాయిస్తే, 32 కోట్ల మంది రాక్షసులు నా ఆధీనంలో ఉన్నారు. ఇందులో నేను లేచేసరికి నా వెంట పరుగు తీసేవారు 1000 మంది ఉంటారు. నాకు కొన్ని వందల మంది భార్యలు ఉన్నారు, వీరందరూ నన్ను కోరి వచ్చినవారే. ఓ ప్రియురాల! నీకు నేను ఇస్తున్న గొప్ప వరం ఏంటో తెలుసా, నాకున్న భార్యలందరికీ నువ్వు అధినాయకురాలివై నాకు భార్యగా ఉండు, నాయందు మనస్సు ఉంచు. సముద్రానికి 100 యోజనముల దూరంలో నిర్మింపబడిన నగరం ఈ కాంచన లంక. దీన్ని దేవతలు కాని, దానవులు కాని, గంధర్వులు కాని, యక్షులు కాని, నాగులు కాని, పక్షులు కాని కన్నెత్తి చూడలేరు. ఇటువంటి లంకా పట్టణానికి నువ్వు చేరుకున్నాక నిన్ను చూసేవాడు ఎవరు, తీసుకెళ్ళే వాడు ఎవరు?
రాజ్య భ్రష్టేన దీనేన తాపసేన పదాతినా |
కిం కరిష్యసి రామేణ మానుషేణ అల్ప తేజసా ||
ఇంకా రాముడు, రాముడు అంటావేంటి. ఆ రాముడు అల్పాయుర్దాయం కలిగినవాడు, రాజ్యభ్రష్టుడు, దీనుడు, అరణ్యములను పట్టి తిరుగుతున్నాడు, రాముడు కేవలం మనిషి, అటువంటి రాముడితో నీకేమి పని. నీకు తగినవాడిని నేను, అందుకని నన్ను భర్తగా స్వీకరించి ఆనందంగా, సంతోషంగా తిరుగు. హాయిగా నాతో కలిసి సింహాసనం మీద కూర్చో, మళ్ళి పట్టాభిషేకం చేసుకుందాము. ఆ పట్టాభిషేకము చేసినప్పుడు మీద పడినటువంటి జలములతో తడిసి, నాతో కలిసి సకల ఆనందములు అనుభవించు. నువ్వు నీ జీవితంలో ఏదో గొప్ప పాపం చేసుంటావు, ఆ పాపం వలన ఇన్నాళ్ళు వనవాసం చేశావు, రాముడికి భార్యగా ఉండిపోయావు. నువ్వు చేసిన పుణ్యం వలన నాదెగ్గరికి వచ్చావు. నువ్వు ఈ అందమైన మాలలు వేసుకొని చక్కగా అలంకరించుకో, మనమిద్దరమూ పుష్పక విమానంలో విహారం చేద్దాము " అన్నాడు.
ఏ ముఖాన్ని చూసి ఆ రావణుడు ఇలా హద్దులు మీరి మాట్లాడుతున్నాడో, ఆ ముఖాన్ని తన ఉత్తరీయంతో కప్పుకొని, సీతమ్మ తల్లి కళ్ళు ఒత్తుకుంటూ ఏడ్చింది.
ఏతౌ పాదౌ మయా స్నిగ్ధౌ శిరోభిః పరిపీడితౌ
ప్రసాదం కురు మే క్షిప్రం వశ్యో దాసో అహం అస్మి తే ||
ఏడుస్తూ ఉన్న సీతమ్మని చూసిన ఆ రావణుడు " నీ పాదాలు పట్టుకుంటున్నాను సీతా, నా కోరిక తీర్చి నన్ను అనుగ్రహించు " అన్నాడు. ( రావణుడు తెలిసి పట్టుకున్నా తెలియక పట్టుకున్నా, శిరస్సు వంచి సీతమ్మ పాదాలు పట్టుకున్నాడు కనుక, సీతమ్మని ఇన్ని మాటలు అన్నా కొంతకాలమైనా బతికాడు.)
అప్పుడు సీతమ్మ, తనకి రావణుడికి మధ్యలో ఒక గడ్డిపరకని పెట్టి " రాముడు ధర్మాత్ముడు, దీర్ఘమైన బాహువులు ఉన్నవాడు, విశాలమైన కన్నులున్నవాడు, ఆయన నా భర్త, నా దైవం. ఇక్ష్వాకు కులంలో పుట్టి, సింహం వంటి మూపు ఉండి, లక్ష్మణుడిని తమ్ముడిగా కలిగిన రాముడి చేతిలో ప్రాణములు పోగొట్టుకోడానికి సిద్ధంగా ఉండు రావణా. నువ్వే కనుక రాముడి సన్నిధిలో నన్ను ఇలా అవమానించి ఉంటె, ఈ పాటికి నువ్వు ఖరుడి పక్కన పడుకొని ఉండేవాడివిరా. నీ ఆయువు అయిపోతుంది, నీ ఐశ్వర్యము పోతుంది, నీ ఓపిక అయిపోతుంది, నీ ఇంద్రియాలు కూడా పతనమయిపోతాయి, నీ లంకా పట్టణం విధవగా నిలబడడానికి సిద్ధంగా ఉంది, ఇవన్నీ నువ్వు చేసిన పని వల్ల భవిష్యత్తులో జెరగబోతున్నాయి. నీటి మీద పట్టే నాచుని తినే నీటికాకిని, నిరంతరం రాజహంసతో కలిసి క్రీడించడానికి అలవాటుపడిన హంస చూస్తుందా. రాముడిని చూసిన కన్నులతో నిన్ను నేను చూడనురా పాపి, అవతలకి పో " అనింది.
ఈ మాటలకి ఆగ్రహించిన రావణుడు " నీకు 12 నెలలు సమయం ఇస్తున్నాను. ఈలోగా నీ అంతట నువ్వు బుద్ధి మార్చుకొని నా పాన్పు చేరితే బతికిపోతావు. అలాకాకపోతే 12 నెలల తరువాత నిన్ను నాకు అల్పాహారంగా పెడతారు " అని చెప్పి, భయంకరమైన స్వరూపం కలిగిన రాక్షస స్త్రీలని పిలిచి " ఈమెని అశోక వనానికి తీసుకువెళ్ళండి. ఆమె చుట్టూ మీరు భయంకరమైన స్వరూపాలతో నిలబడి, బతికీ బతకడానికి కావలసిన ఆహారాన్ని, నీళ్ళని ఇస్తూ, శూలాలలాంటి మాటలతో ఈ సీతని భయపెట్టి నా దారికి తీసుకురండి. ఇక తీసుకువెళ్ళండి " అన్నాడు.
వికృత నేత్రములు కలిగిన ఆ రాక్షస స్త్రీలు చుట్టూ నిలబడి భయపెడుతుంటే, అశోక వనంలో శోకంతో ఏడుస్తూ ఆ సీతమ్మ ఉంది.
ఇటుపక్క రామచంద్రమూర్తి మాంసం పట్టుకుని వస్తుంటే, విచిత్రంగా వెనకనుంచి ఒక నక్క కూత వినబడింది. అలాగే రాముడిని దీనంగా చూస్తూ అక్కడున్న మృగాలన్నీ ఎడమ వైపు నుండి ప్రదక్షిణంగా తిరిగాయి. ఈ శకునాలని చూసిన రాముడు, సీతమ్మకి ఏదో జెరిగిందని భావించి గబగబా వస్తుండగా ఆయనకి ఎదురగా లక్ష్మణుడు వచ్చాడు. లక్ష్మణుడిని చూడగానే రాముడి పైప్రాణాలు పైనే ఎగిరిపోయాయి.
అప్పుడాయన లక్ష్మణుడితో " సీతని వదిలి ఎందుకు వచ్చావు. సీత ప్రమాదంలో ఉందని నేను అనుకుంటున్నాను. సీత క్షేమంగా ఉంటుందా? బతికి ఉంటుందా? నాకు నమ్మకం లేదు. ఎందుకంటే నేను ఖర దూషణులని సంహరించాక రాక్షసులు నా మీద పగబట్టారు. మారీచుడు మరణిస్తూ 'హా సీతా! హా లక్ష్మణా!' అన్నాడు. సీత నిన్ను నిగ్రహించి పంపి ఉంటుంది, అందుకని నువ్వు వచ్చావు. నువ్వు వచ్చేశాక సీతని ఆ రాక్షసులు అపహరించడమైనా జెరిగుంటుంది, లేదా ఆమె కుత్తుక కోసి, ఆమెని తినెయ్యడం అయినా జెరిగుంటుంది. ఏదో ప్రమాదకరమైన పని జెరిగుంటుంది. లక్ష్మణా! నువ్వు ఇలా వస్తావని నేను ఊహించలేదు. నువ్వు రాకుండా ఉండి ఉండవలసింది. ఈ ముఖం పెట్టుకొని నేను అయోధ్యకి ఎలా వెళ్ళను. అందరూ వచ్చి సీతమ్మ ఏది అని అడిగితే, నేను ఏమని చెప్పుకోను. అరణ్యవాసానికి తనని అనుగమించి వచ్చిన సీతమ్మని రక్షించుకోలేని పరాక్రమహీనుడు రాముడు, అని అందరూ చెప్పుకుంటుంటే, ఆ మాటలు విని నేను ఎలా బతకను. నేను అసలు వెనక్కి రానే రాను. సీత ఆశ్రమంలో కనపడకపోతే నా ప్రాణాలు విడిచిపెట్టేస్తాను.
ఏ సీత యొక్క ఓదార్పు చేత 13 సంవత్సరాల అరణ్యవాసాన్ని క్షణములా గడిపానో, ఆ సీత నా కంటపడనప్పుడు నాకు రాజ్యం అక్కరలేదు, అంతఃపుర భోగములు అక్కరలేదు. నువ్వు అయోధ్యకి వెళ్ళి, నేను చెప్పానని చెప్పి, భరతుడిని పట్టాభిషేకం చేసుకొని రాజ్యం ఏలమన్నానని చెప్పు. నా తల్లి కౌసల్యని సేవించు. నేను అయోధ్యకి తిరిగొస్తే, జనకుడు నన్ను చూసి ' రామ! నీకు కన్యాదానం చేశాను కదా, ఏదయ్యా సీతమ్మ' అని అడుగుతారు, అప్పుడు నేను జనకుడి ముఖాన్ని ఏ ముఖంతో చూడను. సీతని వదిలి రావద్దని నేను నిన్ను ఆజ్ఞాపించాను. కాని నా ఆజ్ఞని పాటించకుండా సీతని వదిలి నువ్వు ఒక్కడివీ ఎందుకు వచ్చావు " అన్నాడు.
అప్పుడు లక్ష్మణుడు " అన్నయ్య! నా అంత నేనుగా రాలేదు, సీతమ్మని విడిచిపెట్టి రాలేదు. నీ మాటని పాటిద్దామని ప్రతిక్షణం సీతమ్మ దెగ్గరే ఉండి జాగ్రత్తగా కాపు కాశాను.
ఆర్యేణ ఏవ పరిక్రుష్టం - పరాక్రుష్టం - హా సీతే లక్ష్మణ ఇతి చ |
పరిత్రాహి ఇతి యత్ వాక్యం మైథిల్యాః తత్ శ్రుతిం గతం ||
కాని ఎప్పుడైతే అరణ్యంలోనుంచి నీ గొంతుతో 'హా సీతా! హా లక్ష్మణా' అన్న మాటలు సీతమ్మ విన్నదో, నీయందు ఉన్నటువంటి అపారమైన ప్రేమ చేత భయవిహ్వల అయిపోయింది. అప్పుడు సీతమ్మ ఏడుస్తూ, లక్ష్మణా వెళ్ళు, అని నన్ను ఒకటికి పదిమార్లు తొందరచేసింది. కాని మా అన్నయ్య అలా నీచంగా రక్షించండి అని ఒక్కనాటికి అరవడు, ఇది రాక్షస మాయ అని సీతమ్మకి చెప్పాను. కాని 'నువ్వు భరతుడితో కలిసి కుట్ర చేసి, నన్ను పొందడానికి రాముడి వెనకాల అరణ్యవాసానికి వచ్చావు' అని సీతమ్మ నన్ను ఒక కఠినమైన మాట అంటె, నేను ఇంక తట్టుకోలేక బయలుదేరి వచ్చేశాను. నాయందు ఏ దోషము లేదన్నయ్య, నన్ను మన్నించు " అన్నాడు.
అప్పుడు రాముడు " నువ్వు ఎన్నయినా చెప్పు లక్ష్మణా, సీతని ఒక్కదాన్ని అరణ్యంలో విడిచిపెట్టి నువ్వు ఇలా రాకూడదు. నా మాటగా రాక్షసుడి మాట వినపడితే, సీత నిన్ను ఒకమాట అని ఉండవచ్చు, అంతమాత్రాన సీతని విడిచి వచేస్తావ. ఇప్పుడు సీత ఎంత ప్రమాదంలో ఉందో. నువ్వు కోపానికి లోనయ్యావు, అందుకని సీతని విడిచిపెట్టి వచ్చేశావు. ఇప్పుడు నేను ఏమి చెయ్యను......." అని అంటూ ఆ పర్ణశాల ఉండే ప్రదేశానికి చేరుకున్నారు.
రాముడు ఆ పర్ణశాలలో అంతా చూశాడు, కాని సీతమ్మ ఎక్కడా కనపడలేదు. అప్పుడాయన ఆ చుట్టుపక్కల అంతా వెతికాడు, దెగ్గరలో ఉన్న పర్వతాలకి వెళ్ళాడు, నదుల దెగ్గరికి వెళ్ళి చూశాడు, అక్కడే ఉన్న జింకల దెగ్గరికి వెళ్ళాడు, పెద్ద పులుల్ని, చెట్లని అడిగాడు. అలా ఏనుగు దెగ్గరికి వెళ్ళి " ఓ ఏనుగా! నీ తొండం ఎలా ఉంటుందో సీత జెడ కూడా అలానే ఉంటుంది, నీకు తెలిసుంటుంది సీత ఎక్కడుందో, నాకు చెప్పవా " అన్నాడు. దెగ్గర ఉన్న చెట్ల దెగ్గరికి వెళ్ళి " సీత ఎక్కడుందో మీకు తెలిసుంటుంది, నాకు నిజం చెప్పరా " అన్నాడు. అక్కడే ఉన్న జింకల దెగ్గరికి వెళ్ళి " సీత మీతో ఆడుకునేది కాదా, సీతకి ప్రమాదం జెరిగినప్పుడు మీకు తెలిసి ఉంటుంది. నాకు సీత ఎక్కడ ఉందో చెబుతారా " అన్నాడు. అలాగే అక్కడ కూర్చొని ఏడుస్తూ " అయ్యో, రాక్షసులు వచ్చి సీత యొక్క పీక నులిమేసి, ఆమె రక్తాన్ని తాగేసి, మాంసాన్ని భక్షిస్తుంటే, 'హా! రామ, హా! రామ' అని అరిచి ఉంటుంది. ఎంత అస్త్ర-శస్త్ర సంపద తెలిసి మాత్రం నేను ఏమి చెయ్యగలిగాను, సీతని కాపాడుకోలేకపోయాను " అని ఏడుస్తున్నాడు.
రాముడి బాధని చూసి లక్ష్మణుడు " అన్నయ్యా! బెంగ పెట్టుకోకు, వదిన గోదావరి తీరానికి నీళ్ళు తేవడానికి వెళ్ళి ఉంటుంది. అందుకని నేను గోదావరి తీరానికి వెళ్ళి చూసి వస్తాను " అని చెప్పి లక్ష్మణుడు గోదావరి తీరానికి వెళ్ళాడు.
తిరిగొచ్చిన లక్ష్మణుడు " సీతమ్మ ఎక్కడా కనపడలేదు " అన్నాడు. అప్పుడు రాముడు పరిగెత్తుకుంటూ గోదావరి నది దెగ్గరికి వెళ్ళి " గోదావరి! నిజం చెప్పు. ఎక్కడుంది సీత. నీకు తెలిసే ఉంటుంది. నువ్వు ఈ ప్రాంతం అంతా ప్రవహిస్తున్నావు, కనుక నాకు సీత ఎక్కడుందో చెప్పు " అన్నాడు.
భూతాని రాక్షసేంద్రేణ వధ అర్హేణ హృతాం అపి |
న తాం శశంసూ రామాయ తథా గోదావరీ నదీ ||
అక్కడున్న పంచభూతాలు జెరిగినది చూసాయి, కాని చెపుదాము అంటె, రావణుడు గుర్తుకు వచ్చి భయపడ్డాయి. అప్పుడా పంచభూతాలు గోదావరితో " గోదావరి! సీతమ్మని రావణుడు ఎత్తుకుపోయిన సంగతి చెప్పెయ్యి. రాముడి బాధ చూడలేకపోతున్నాము " అన్నాయి. కాని రావణుడి దుష్ట చేష్టితములు, భయంకరమైన స్వరూపం, వాడి పనులు జ్ఞాపకం వచ్చి గోదావరి నోరు విప్పలేదు, నిజం చెప్పలేదు. అక్కడున్న మృగాలు జెరిగినదాన్ని చెబుదాము అనుకున్నాయి, కాని అవి మాట్లాడలేవు కనుక ఆకాశం వైపు చూస్తూ, సీతమ్మని రావణుడు ఎత్తుకుపోయిన దక్షిణ దిక్కు వైపు పరుగులు తీశాయి.
మృగాలన్నీ దక్షిణ దిక్కుకి పరుగులు తీయడాన్ని చూసిన లక్ష్మణుడు " అన్నయ్యా! ప్రమాదం వచ్చి జంతువులన్నీ అటు పరిగెత్తడం లేదు. అవి కొంత దూరం పరిగెడుతున్నాయి, ఆగుతున్నాయి, వెనక్కి తిరుగుతున్నాయి, 'మాకు చెప్పడం రాదు, నీకు అర్ధం అవ్వడం లేదా, మా వెంట రా' అని పిలుస్తున్నట్టుగా మన వంక చూసి ఏడుస్తున్నాయి, మళ్ళి పరిగెడుతున్నాయి, ఆకాశం వంక చూస్తున్నాయి. బహుశా సీతమ్మని ఎవరో అపహరించి ఇటూ వైపు తీసుకెళ్ళారేమో అన్నయ్యా, మనకి ఆనవాలు దొరుకుతుంది, ఈ మృగాల వెనకాల వెళదాము " అన్నాడు.
అప్పుడు రామలక్ష్మణులు ఇద్దరూ ఆ మృగాల వెనుక పరుగు తీసారు. అక్కడ వాళ్ళకి సీతమ్మ తలలో పెట్టుకున్న పూలదండ కింద పడిపోయి కనపడింది. అప్పుడు రాముడు " మారీచుడు వచ్చేముందు నేనే సీత తలలో ఈ పూలదండ పెట్టాను. ఎవడో దురాత్ముడు సీతని భక్షించి ఉంటాడు. చూశావ ఇక్కడ భూషణములు కింద పడిపోయి ఉన్నాయి, రక్త బిందువులు కనపడుతున్నాయి, అంటె ఎవరో సీతని తినేశారు. ఇక్కడ ఒక పెద్ద రథం విరిగిపోయి కనపడుతుంది, ఎవరిదో గొప్ప ధనుస్సు విరిగి కింద పడిపోయి ఉంది, ఎవరో ఒక సారధి కూడా కింద పడిపోయి ఉన్నాడు, పిశాచ ముఖాలతో ఉన్న గాడిదలు కింద పడిపోయి ఉన్నాయి. ఎవరో ఇద్దరు రాక్షసులు సీత కోసం యుద్ధం చేసుకున్నారు. ఆ యుద్ధంలో గెలిచినవాడు సీతని తీసుకెళ్ళి తినేశాడు.
సీత ఏ ధర్మాన్ని పాటించిందో, ఆ ధర్మం సీతని కాపడలేదు. ఎవడు పరాక్రమము ఉన్నా మృదువుగా ప్రవర్తిస్తాడో, వాడిని లోకం చేతకానివాడు అంటుంది. లక్ష్మణా! ఇప్పుడు చూపిస్తాను నా ప్రతాపము ఏమిటో. ఈ పర్వతం ముందు నిలబడి 'సీత ఎక్కడుంది' అని అడిగితే, నాతో వెటకారమాడి నేను మాట్లాడిన మాటనే మళ్ళి ప్రతిధ్వనిగా పైకి పంపింది. ఇప్పుడే ఈ పర్వతాన్ని నాశనం చేసేస్తాను, నాకున్న అస్త్ర-శస్త్రములన్నిటిని ప్రయోగించి సూర్య చంద్రులని గతిలేకుండా చేస్తాను, ఆకాశాన్ని బాణాలతో కప్పేస్తాను, దేవతలు ఎవరూ తిరగడానికి వీలులేకుండా చేసేస్తాను, నదులలో, సముద్రాలలో ఉన్న నీటిని ఇంకింప చేసేస్తాను, భూమి మీద అగ్నిహోత్రాన్ని పుట్టిస్తాను, నా బాణాలతో భూమిని బద్దలుకొడతాను, రాక్షసులు అనే వాళ్ళు ఈ బ్రహ్మాండాల్లో ఎక్కడా లేకుండా చేస్తాను, నా క్రోధం అంటె ఎలా ఉంటుందో ఈ దేవతలు చూస్తారు, మూడులోకాలని లయం చేసేస్తాను. సీత ఎక్కడున్నా, బతికున్నా మరణించినా, దేవతలు తీసుకువచ్చి నా పాదములకి నమస్కరించి ప్రార్ధన చేస్తే వదిలిపెడతాను, లేకపోతె ఇవ్వాళతో ఈ బ్రహ్మండాలని నాశనం చేసేస్తాను. వృద్ధాప్యం రాకుండా, మృత్యువు రాకుండా ఎవడూ ఎలా నిరోధించుకోలేడో, అలా క్రోధముర్తి అయిన నా ముందు నిలబడడానికి దేవతలకి కూడా ధైర్యం చాలదు. పడగోట్టేస్తున్నాను లక్ష్మణా......" అని కోదండాన్ని తీసి చేతిలో పట్టుకున్నాడు.
అప్పుడు లక్ష్మణుడు పరుగు పరుగున వచ్చి, అంజలి ఘటించి " అన్నయ్యా! నువ్వు సర్వభూత హితేరతుడివి అన్న పేరు తెచ్చుకున్నవాడివి. అటువంటివాడివి నువ్వు క్రోధమునకు వశమయిపోయి మూడులోకాలని కాల్చేస్తే, ఇంక లోకంలో శాంతి అన్న మాటకి అర్ధం ఎక్కడుంది అన్నయ్యా. ఎవడో ఒక దుర్మార్గుడు తప్పు చేశాడని, వాడిని నిగ్రహించడం మానేసి లోకాలన్నిటిని బాధపెడతావ అన్నయ్యా. నీ క్రోధాన్ని కొంచెం వెనక్కి తగ్గించు. రాజు ప్రశాంతమూర్తుడై తగినంత శిక్ష వెయ్యాలి, అంతేకాని ఎవడో ఏదో తప్పు చేశాడని లోకాన్ని ఇలా పీడిస్తావ. అన్నయ్యా! ఇక్కడ ఇద్దరు యుద్ధం చెయ్యలేదు. ఎవడొ ఒకడే రాక్షసుడు వచ్చాడు. ఆ రాక్షసుడు ఇక్కడ తన రథాన్ని పోగొట్టుకుని, సీతమ్మని ఆకాశ మార్గంలో తీసుకెళ్ళాడు. అందుకే మృగాలు ఆకాశం వంక చూస్తూ పరిగెడుతున్నాయి. అన్నయ్యా! నీకు అంజలి ఘటించి, నీ పాదములకు నమస్కరించి అడుగుతున్నాను, నువ్వు శాంతించు. రాముడే ఆగ్రహాన్ని పొందితే, ఇక లోకాలు నిలపడలేవు. నువ్వు ఏ ఋషులని గౌరవిస్తావో ఆ ఋషుల యొక్క అనుగ్రహంతో, వారి మాట సాయంతో, నీ పక్కన నేనుండగా, సీతమ్మని అన్వేషించి ఎక్కడ ఉన్నా పట్టుకుందాము. అంత సాదుధర్మంతో నువ్వు అన్వేషించిననాడు కూడా సీతమ్మ నీకు లభించకపోతే, ఆనాడు నువ్వు కోదండం పట్టుకొని లోకాలన్నిటిని లయం చేసెయ్యి. కాని ఈలోగా నీకు ఉపకారం తప్పక జెరిగితీరుతుంది. నీకు ఋషులు, పంచభూతాలు, దేవతలు సహకరిస్తారు. ఇంత ధర్మమూర్తివైన నీకు సహకరించని భూతము ఈ బ్రహ్మండములలో ఉండదు. నువ్వు సీతమ్మని పొందుతావు, ఇది సత్యం, సత్యం సత్యం. నేను నీ పక్కన ఉండగా నువ్వు ఇంత క్రోధమూర్తివి కాకు. నువ్వు శాంతిని పొందు " అన్నాడు.
లక్ష్మణమూర్తి మాటల చేత శాంతిని పొందినవాడై, రాముడు తూణీరం నుండి బాణాన్ని తీయకుండా ఆగిపోయాడు.

రామాయణం -- 47

శాంతించిన రాముడితో లక్ష్మణుడు " అన్నయ్యా! చూశావ లోకం యొక్క పోకడ ఎలా ఉంటుందో. కష్టాలు అనేవి ఒక్కరికే కాదు, గతంలో కూడా కష్టపడినవారు ఎందరో ఉన్నారు. నహుషుని కుమారుడైన యయాతి ఎంత కష్టపడ్డాడో జ్ఞాపకం ఉందా. ( ఎన్నో కష్టాలు పడి, ఎంతో గొప్పగా జీవించిన యయాతి చనిపోయాక స్వర్గానికి వెళ్ళాడు. అప్పుడు దేవేంద్రుడు యయాతిని ఒక ప్రశ్న అడిగాడు, అదేంటంటే " యయాతి! నీ రాజ్యంలో అసత్యం చెప్పని వాడు ఎవరు? " అని అడిగాడు. తాను ఎన్నడూ అసత్యం చెప్పలేదు కనుక ఆ యయాతి ఎంతో వినయంగా " నేను ఎన్నడూ అసత్యం పలకలేదు " అన్నాడు. " నీ వైపుకి చూపించి, ఒక విషయాన్ని నీ అంతట నువ్వు పొగుడుకున్నావు కనుక నువ్వు మహా పాపత్ముడివి. అందుచేత నీకు స్వర్గలోక ప్రవేశం కుదరదు " అని చెప్పి దేవేంద్రుడు యయాతిని కిందకి తోసేశాడు.) జీవితకాలం కష్టపడిన యయాతి, ఒక్క మాటకి, అది కూడా దేవేంద్రుడు అడిగితే చెప్పిన జవాబుకి, స్వర్గమునుండి పతనమై భూమి మీద పడిపోయాడు.
అలాగే మన గురువుగారైన వశిష్ఠుడికి నూరుగురు కుమారులు జన్మించారు. వాళ్ళల్లో ఒక్కడు కూడా భ్రష్టుడు కాదు, అందరూ తండ్రిమాట వినేవారే. అటువంటి నూరుగురు కుమారులు తండ్రిని గౌరవించి మాట్లాడిన పాపానికి ఒకే రోజూ శాపానికి గురై శరీరాలని వదిలేశారు. అంత కష్టమొచ్చినా మన గురువు గారు బెంగపెట్టుకోలేదు. మనం రోజూ చూసే భూమికి ఎంతో ఓర్పు ఉంది, ఎంతోమందిని భరిస్తుంది. ఈ భూమి ఎప్పటినుంచో ఉంది. ఇటువంటి భూమి కూడా ఒక్కొక్కనాడు పాపభారాన్ని మోయలేక కదులుతుంది. అంత గొప్ప భూమికి కూడా కష్టమొచ్చి కదులుతుంది. ఆకాశంలో ఉన్న సూర్యచంద్రులిద్దరు మహాబలం కలిగినవారు, వాళ్ళిద్దరి చేత ఈ లోకములన్ని ప్రకాశిస్తున్నాయి. అటువంటి సూర్యచంద్రులని పాప గ్రహాలైన రాహు కేతువులు గ్రహణ సమయంలో గ్రశిస్తున్నారు, మళ్ళి విడిచిపెడుతున్నారు. మనిషికి జీవితంలో కష్టం వచ్చిననాడు, ఆ కష్టాన్ని తట్టుకొని నిలబడిననాడు కదా, అప్పుడు కూడా ధర్మం విడిచిపెట్టకుండా ఉన్ననాడు కదా వాడిలో ఉన్నటువంటి సౌశీల్యం ప్రకాశించేది. అందుకని అన్నయ్యా, దయ చేసి నీ కోపాన్ని విడిచిపెట్టు. నువ్వు జ్ఞానివి అన్నయ్యా, నీకు సమస్తం తెలుసు. కాని నిప్పుని బూది కప్పినట్టు, నీలో ఉన్న జ్ఞానాన్ని శోకం కప్పింది. అందువలన నువ్వు కోపానికి వశుడవయ్యావు. నీకు చెప్పగలిగిన వాడిని అని నేను నీకు చెప్పడంలేదు, నేను కేవలం నీ మీద కప్పబడ్డ శోకం అనే దాన్ని తొలగించే ప్రయత్నం చేస్తున్నాను, అంతే " అన్నాడు.
పూర్వజో అపి ఉక్త మాత్రః తు లక్ష్మణేన సుభాషితం |
సార గ్రాహీ మహాసారం ప్రతిజగ్రాహ రాఘవః ||
అవతలివారు చెప్పిన దానిలోని సారమును గ్రహించి, తన స్వరూపమును దిద్దుకోగలిగిన గొప్ప శక్తి కలిగిన రాముడు, లక్ష్మణుడు చెప్పిన మాటలని విని తన కోపాన్ని విడిచిపెట్టి " తమ్ముడా! నువ్వు చెప్పిన మాట యదార్ధం రా. కాని నన్ను అనుగమించి వచ్చిన సీత కనపడకపోతే నేను బతకలేను. ఈ పర్వతగుహలలో ఎన్నో గుహలు, పొదలు ఉన్నాయి. సీత వాటిల్లో ఎక్కడన్నా ఉందేమో వెతుకుదాము " అని రామలక్ష్మణులు ముందుకి బయలుదేరారు.
అలా ముందుకు వెళ్ళిన వాళ్ళకి ఒంటినిండా రక్తంతో తడిసిపోయి, ముక్కుకి రక్తంతో, రెక్కలు తెగిపోయి, ఒక పక్కకి కూర్చుని ఉన్న జటాయువు కనపడింది. అప్పుడు రాముడు ' రాక్షస రూపంలో ఉన్నవాడు ఈ పక్షి రూపాన్ని పొందాడు. నేను, లక్ష్మణుడు వెళ్ళగానే సీతని ఈ పక్షే తినేసింది. దీనిని నేను నమ్మాను, ఇప్పుడిది నాకు ప్రమాదం తెచ్చింది. అందుకని ఇప్పుడు నేను ఈ జటాయువు యొక్క శరీరాన్ని చీల్చేస్తాను' అని మనసులో అనుకొని, కొదండంలో బాణాన్ని సంధించి జటాయువు వైపు పరుగులు తీశాడు.
అప్పుడు జటాయువు " రామ! నువ్వు ఏ ఓషధిని గూర్చి ఈ అరణ్యంలో వెతుకుతున్నావో, అటువంటి ఓషధీ స్వరూపమైన సీతమ్మని, నా ప్రాణాలని పట్టుకుపోయినవాడు రావణాసురుడయ్యా. నువ్వు, లక్ష్మణుడు లేని సమయంలో రావణాసురుడు సీతమ్మని అపహరించి తీసుకుపోయాడు. సీతమ్మని అపహరిస్తుంటే రావణాసురిడితో యుద్ధం చేశానయ్యా, నా శక్తి మేర అడ్డుపడ్డాను. రావణుడి రథాన్ని, సారధిని, ధ్వజాన్ని పడగొట్టాను, కాని వాడిని నిగ్రహించలేకపోయాను. ఆకాశమార్గంలో సీతమ్మని ఎత్తుకుపోతూ ధూళిని, మేఘాల్ని సృష్టి చేశాడు, ఖడ్గంతో నా రెక్కలని కోసేశాడు, నా కాళ్ళు నరికేశాడు, అందుకని నేను ఏమి చెయ్యలేకపోయాను. రామ! నేను చచ్చిపోయానయ్య, ఇంకొక్కసారి నన్ను చంపకు " అన్నాడు.
జటాయువు మాటలు విన్న రాముడు, ఆ కొదండంతో పరిగెత్తుకుంటూ వెళ్ళి జటాయువుని గట్టిగా కౌగలించుకుని ఏడిచాడు. ఆయన అలా ఏడుస్తున్నప్పుడు ఆ కోదండం చేతినుండి విడిపోయి కింద పడిపోయింది. రాముడితో పాటు లక్ష్మణుడు కూడా జటాయువు మీద పడి ఏడిచాడు.
రాజ్యం భ్రష్టం వనే వాసః సీతా నష్టా మృతే ద్విజః |
ఈదృశీ ఇయం మమా లక్ష్మీః నిర్దహేత్ అపి పావకం ||
అప్పుడు రాముడు " నాకు రాజ్యం పోయింది, అరణ్యానికి వచ్చాను, సీతని పోగొట్టుకున్నాను, నమ్మిన స్నేహితుడైన జటాయువు మరణిస్తున్నాడు. ఇవ్వాళ నేను పొందుతున్న శోకానికి అగ్నిని తీసుకొచ్చి అక్కడ పెడితే, ఆ అగ్నిని నా శోకం కాల్చేస్తుంది. అంత శోకంలో నేను ఉన్నాను లక్ష్మణా! " అన్నాడు. అలాగే " జటాయు! నాకోసం నువ్వు ఇంత కష్టపడ్డావు. ఒక్కసారి చెప్పు ఆ రావణుడు ఎక్కడ ఉంటాడు, అతని పౌరుష పరాక్రమాలు ఎటువంటివి, సీతని ఎటువైపుకి తీసుకెళ్ళాడు, ఏ రాజ్యాన్ని పరిపాలిస్తాడు, అతని స్వరూపం ఏమిటి. నాకు చెప్పు " అన్నాడు.
అప్పుడా జటాయువు " ఆ రావణుడు సీతమ్మని అపహరించి, మేఘములను, ధూళిని సృష్టించి, సీతమ్మని తన ఒడిలో కూర్చోపెట్టుకుని, ఆకాశ మార్గంలో దక్షిణ దిక్కుకి తీసుకెళ్ళిపోయాడు. ఇంతకన్నా చెప్పాలని ఉంది కాని, నా రెక్కలు తెగిపోవడం వలన, నా కళ్ళు కనపడడం మానేశాయి. నా నోటి వెంట మాట రావడంలేదు. నువ్వు మాట్లాడుతున్నది వినపడడం లేదు. నాలొ ఉన్న భావాలని చెప్పగలుగుతున్నానో, చెప్పలేకపోతున్నానో తెలియని పరిస్థితి ఏర్పడుతుంది. అన్నిటినీ మించి ఈ అరణ్యం అంతా నాకు బంగారంగా కనపడుతుంది. వింద అనే ముహూర్తంలో రావణుడు దొంగిలించాడు కనుక, నీ వస్తువు నీకు దొరుకుతుంది. ఆ ముహూర్తంలో దొంగలించబడ్డ వస్తువుని తిరిగి యజమాని పొందుతాడు. నువ్వు సీతమ్మని పొందుతావు, మీ ఇద్దరికీ పట్టాభిషేకం అవుతుంది, నువ్వు చాలా కాలం రాజ్యపాలన చేస్తావయ్య...." అని చెబుతుండగా ఆయన నోటినుండి రక్తంతో కూడిన మాంసం ముద్దని కక్కి, తన చిట్టచివర ప్రాణాలని కూడా లాగి " ఆ రావణాసురుడి తండ్రి విశ్రవసో బ్రహ్మ, ఆయన తమ్ముడు కుబేరుడు....." అని చెప్పి, శిరస్సు పక్కకి పడిపోగా, ఆ జటాయువు మరణించాడు.
అప్పుడు రాముడు " చూశావ లక్ష్మణా! రావణుడు సీతని బలవంతంగా అపహరించుకుపోతుంటే, తన ప్రాణాలను అడ్డుపెట్టి ఈ పక్షి సీతని కాపాడే ప్రయత్నం చేసింది. మనం ఆలోచించి చూస్తే, ధర్మాన్ని పాటించేవారు, శూరులైనవారు, శరణాగతి చేసినవారిని రక్షించేవారు మనుష్యులలోనే కాదు, జంతువులలో కూడా ఉన్నారు. సీతని అపహరించారు అన్న సంగతి తెలుసుకున్నప్పుడు నేను పొందిన దుఖం కన్నా, ఒక పక్షి నాకు ఉపకారం చెయ్యడం కోసమని తన ప్రాణాలు వదిలేసిందని తెలుసుకొని నేను ఇవ్వాళ ఎక్కువ దుఖం పొందుతున్నాను. నాయనా లక్ష్మణా! దశరథ మహారాజు మనకి ఎలా గౌరవించదగ్గవాడో, ఆయనకి స్నేహితుడైన జటాయువు కూడా మనకి గౌరవింపదగ్గవాడు. ఆనాడు నేను తండ్రిగారికి ఎలా అంచేష్టి సంస్కారం చేశానో, జటాయువుకి ఇవ్వాళ అలా చెయ్యాలని అనుకుంటున్నాను.
అందుకని లక్ష్మణా! అక్కడ ఏనుగులు చెట్లని ఒరుసుకుంటూ వెళ్ళినప్పుడు, ఆ చెట్ల యొక్క ఎండుకర్రలు కిందపడతాయి, నువ్వు వెళ్ళి ఆ కర్రలని పట్టుకురా. అప్పుడు మనం ఈ జటాయువు శరీరాన్ని చితి మీద పెడదాము. ఆయన శరీరాన్ని అగ్నిలో కాల్చాక, రోహి మాంసాన్ని పిండంగా పెడదాము " అన్నాడు. (రోహి అనేది ఒక మృగం పేరు, జటాయువు మాంసం తింటాడు కనుక ఆయనకి ఆ మృగ మాంసంతో పిండం పెట్టారు).
ఆ జటాయువుకి పిండాలు పెట్టాక గోదావరి నదికి వెళ్ళి ఉదకక్రియలు చేసి " నాచేత సంస్కరింపబడుతున్న ఓ జటాయువా! నేను నీకు అనుజ్ఞ ఇస్తున్నాను, నీకు ఇష్టం వచ్చిన ఉత్తమలోకాలకి వెళ్ళు" అని రాముడు అన్నాడు. తరువాత నదిలో జలతర్పణ చేశారు.
జటాయువు ఉత్తమలోకాలని పొందాడు అని వాల్మీకి మహర్షి చెప్పారు.
తరువాత రామలక్ష్మణులు అక్కడినుంచి బయలుదేరి క్రౌంచారణ్యంలోకి ప్రవేశించారు. అతి భయంకరంగా ఉండే ఆ క్రౌంచారణ్యాన్ని రామలక్ష్మణులు దాటి కొంత దూరం వెళ్ళాక ఒక చీకటి గుహ కనబడింది. ఆ చీకటి గుహ దెగ్గర అలికిడి, చప్పుడు వినబడ్డాయి. అంతలోనే ఎక్కడినుంచో ఒక భయంకరమైన రాక్షస స్త్రీ పరిగెత్తుకుంటూ వచ్చింది. ఆమె పేరు అయోముఖి. కడుపు కిందకి జారిపోయి, వికృతమైన రూపంతో ఉన్న ఆ అయోముఖికి లక్ష్మణుడి మీద వ్యామోహం పుట్టింది. అప్పుడామె పరుగు పరుగున వచ్చి లక్ష్మణుడిని పట్టుకొని " నువ్వు చాలా బాగున్నావు, మంచి యవ్వనంలో ఉన్నావు. మనిద్దరమూ ఈ పర్వాతాల మీద తిరుగుతూ క్రీడిద్దాము " అనింది.
లక్ష్మణుడు వెంటనే తన ఖడ్గాన్ని తీసి ఆవిడ ముక్కుని, చెవులని, స్తనాలని నరికేశాడు. అప్పుడా అయోముఖి నెత్తురు కారుతుండగా ఏడుస్తూ, గుండెలు బాదుకుంటూ ఆ గుహలోకి పారిపోయింది.
తరువాత వారు అక్కడినుండి కొంతదూరం ప్రయాణించాక, లక్ష్మణుడు రాముడితో ఇలా అన్నాడు " అన్నయ్యా! చాలా దుర్నిమిత్తాలు కనపడుతున్నాయి. ఏదో తీవ్రమైన భయం వేస్తుంది. ఇక్కడ వంజులకం అనే పక్షి కూస్తోంది, ఈ పక్షి కూత ఎవరికి వినపడుతుందో వారికి జయం కలుగుతుంది, కాని పరమ దారుణమైన యుద్ధం జెరుగుతుంది........" అని చెపుతుండగా ఒక పెద్ద శబ్దం వినపడింది. ఈ శబ్దం ఏమిటి అని రామలక్ష్మణులు చూసేసరికి, సృష్టిలో కనీ వినీ ఎరుగనటువంటి రూపం వాళ్ళకి కనపడింది. దానికి తలకాయ, కాళ్ళు లేవు. కేవలం గుండెల దెగ్గరినుంచి నడుము కిందభాగం వరకు మాత్రమే దాని శరీరం ఉంది. అందులోనే ఒక పెద్ద నోరు, కన్ను ఉన్నాయి. ఆ కన్ను దూరంగా ఉన్న వస్తువులని కూడా చూస్తుంది. దానికి యోజనం పొడవున్న చేతులు ఉన్నాయి. అది నడవలేదు కనుక, ఆ చేతులతో అడవిలో తడిమి, దొరికిన దాన్ని తిని బతుకుతుంది. ఆ వింత స్వరూపాన్ని చూసి, అసలు ఇదేమిటిరా ఇలా ఉంది అని వాళ్ళు అనుకుంటున్నారు, ఇంతలోనే అది తన రెండు చేతులతో రామలక్ష్మణులను పట్టేసుకుంది. అప్పుడది " నేను రాక్షసుడిని, నన్ను కబంధుడు అని అంటారు. అరణ్యానికి వచ్చి ఇటువైపునకు ఎందుకు వచ్చారు, ఇప్పుడు నేను మీ ఇద్దరినీ తినేస్తాను " అని అంటూ వాళ్ళని దెగ్గరిగా తీసుకునే ప్రయత్నంలో ఉండగా, లక్ష్మణుడు రాముడితో " మనం వీడిని ఉపేక్షిస్తే వీడు మనిద్దరినీ మింగేస్తాడు, అందుకని వీడి చేతులని ఖండించేద్దాము " అన్నాడు.
అప్పుడు లక్ష్మణుడు ఎడమ బాహువుని, రాముడు కుడి బాహువుని నరికేశారు. అప్పుడా కబంధుడు " మీరు ఇద్దరు ఎవరు? " అని అడిగాడు.
" ఈయనని రాముడు అంటారు, దశరరథుడి కుమారుడు, తండ్రి మాటకి కట్టుబడి 14 సంవత్సరాలు అరణ్యవాసానికి వచ్చాడు. ఈయన భార్య అయిన సీతమ్మని ఎవరో అపహరించారు. సీతమ్మని వెతుక్కుంటూ మేము ఈ మార్గంలో వచ్చాము. అసలు నువ్వు ఎవరు? నువ్వు ఇలా ఉన్నవేంటి? నీలాంటి రక్షాసుడిని మేము ఎప్పుడూ చూడలేదు " అని లక్ష్మణుడు అన్నాడు.
అప్పుడా కబంధుడు " నేను మీకు నా కథ చెబుతాను, కాని మీరు నాకు ఒక ఉపకారం చెయ్యాలి. అదేంటంటే, ఒక పెద్ద గొయ్య తీసి, లేకపోతె ఒక చితి పేర్చి, దానిమీద నన్ను పడుకోబెట్టి కాల్చెయ్యండి " అన్నాడు. " సరే, నువ్వు కోరినట్టే నిన్ను కల్చేస్తాములే కాని, సీతమ్మని ఎవరో రాక్షసుడు అపహరించాడు. నువ్వూ రాక్షసుడివి కదా, నీకేమన్నా తెలుసా " అని రామలక్ష్మణులు అడిగారు.
అప్పుడా కబంధుడు " మీకు ఆ విషయాన్ని ఈ శరీరంతో చెప్పలేను. నన్ను కాల్చేస్తే, నాకు నా పూర్వ శరీరం వచ్చేస్తుంది. అప్పుడు ఆ శరీరంతో చెబుతాను. ఈ శరీరానికి అన్నీ జ్ఞాపకం లేవు, కాని ఆ శరీరానికి అన్నీ తెలుసు. కనుక నన్ను కాల్చెయ్యండి " అన్నాడు.
" కాలుస్తాములే కాని, నువ్వు అసలు ఎవరు, ఇలా ఎందుకు ఉన్నావు" అని రామలక్ష్మణులు అడిగారు.
అప్పుడు కబంధుడు " పూర్వకాలంలో నేను ఎంతో గొప్ప తేజస్సుతో ఉండేవాడిని. నా పేరు ధనువు. సూర్యుడు ఎలా ఉంటాడో, చంద్రుడు ఎలా ఉంటాడో, ఇంద్రుడు ఎలా ఉంటాడో నాకూ అటువంటి శరీరం ఉండేది. నా స్వరూపాన్ని చూసి అందరూ పొంగిపోయేవారు. అంత అందమైన శరీరంతో ఉన్న నాకు ఒక దిక్కుమాలిని ఆలోచన వచ్చింది, అదేంటంటే, ' నేను కామరూపిని కనుక, ఒక విచిత్రమైన స్వరూపాన్ని పొంది, అరణ్యంలోకి వెళ్ళి అందరినీ భయపెడితే ఎలా ఉంటుంది ' అని. అప్పుడు నేను వెంటనే ఒక వికృత స్వరూపాన్ని పొంది అరణ్యంలోకి వెళ్ళాను. అక్కడ స్థూలశిరుడు అనే మహర్షి దర్భలు ఏరుకుంటూ ఉండగా, నేను ఆయన వెనకాలకి వెళ్ళి, ఒక పెద్ద కేక వేశాను. అప్పుడా మహర్షి నా వంక చూసి ' ఇలా ఈ రూపంతో తిరగడం నీకు ఎంత సరదాగా ఉందో, నువ్వు ఇలాగె చాలా కాలం ఇక్కడ తిరుగుతూ ఉండు' అని వెళ్ళిపోయారు. అప్పుడు నేను నా నిజ స్వరూపాన్ని పొంది ఆయన కాళ్ళ మీద పడి ' మీరు చెప్పిన మాట ప్రకారం, నాకు ఆ భయంకరమైన స్వరూపం తొందరలో వస్తుంది. కాని నాకు ఆ స్వరూపం ఎలా పోతుంది' అని అడిగాను. అప్పుడా స్థూలశిర మహర్షి అన్నాడు ' నీకు వచ్చిన ఈ ప్రకోపం పోవాలి. కొంతకాలానికి ఇక్కడికి రామలక్ష్మణులు వచ్చి నీ రెండు చేతులు నరికేస్తారు. అప్పుడు నీకు శాపవిమోచనం అవుతుంది' అని చెప్పారు.
అప్పుడు నేను వెంటనే వెళ్ళి తపస్సు చెయ్యడం ప్రారంభించాను. కొంతకాలానికి బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యి ' ఏమి కావాలి ' అని అడిగారు. అప్పుడు నేను ' నాకు దీర్ఘాయువు కావాలి ' అని అడిగాను. బ్రహ్మగారు తధాస్తు అని చెప్పి వెళ్ళిపోయారు. నాకు దీర్ఘ ఆయుర్దాయం ఉందన్న అహంకారంతో ఇంద్రుడి మీదకి యుద్ధానికి వెళ్ళాను. అప్పుడు ఇంద్రుడు నూరు అంచులు ఉన్న వజ్రాయుధాన్ని నా మీద ప్రయోగించాడు. ఆ వజ్రాయుధం నా రెండు కాళ్ళని ఛాతిలోకి నొక్కేసింది, అలాగే నా తలని కూడా ఛాతిలోకి నొక్కేసింది, నా రెండుచేతులని కూడా లోపలికి నొక్కేసింది. నేను అప్పుడు నడుము నుంచి ఛాతి వరకూ ఉన్న శరీరంతో కిందపడ్డాను.
అప్పుడు నేను ఇంద్రుడితో ' నువ్వు నన్ను కొట్టేశావు, బాగానేఉంది. నా చేతులు, కాళ్ళు లోపలికి తోసేశావు. నాకు బ్రహ్మగారు దీర్ఘ ఆయుర్దాయం ఉందని వరమిచ్చారు. ఇప్పుడు నా నోరు లోపలికి వెళ్ళింది కాదా, మరి నేను ఏమి తిని బతకను ' అని ఇంద్రుడిని అడిగాను. అప్పుడు ఇంద్రుడు నా కన్నుని, నోరుని నా ఉదరభాగం మీద ఏర్పాటు చేసి, యోజనం పొడువున్న రెండు చేతులు ఇచ్చాడు.
రామ! నేను అప్పటినుండి నేను ఇలా పడి ఉన్నాను. ఈ అరణ్యంలో తడుముకుంటూ దొరికినది తింటూ ఉంటాను. ఎప్పటినుంచో రామలక్ష్మణులు దొరికితే బాగుండు అనుకుంటున్నాను, ఇప్పటికి మీరు దొరికారు. మీరు నా శరీరాన్ని కాల్చెయ్యండి నేను మీకు ఉపకారం చేస్తాను " అన్నాడు.
( మనకి ఉన్న ఒకే ఒక్క సుగుణం నుండి అహంకారం అనే భూతం వస్తుంది. ఒకడికి అందం ఉందని, ఒకడికి డబ్బు ఉందని, ఒకడికి అధికారం ఉందని, ఒకడికి చదువు ఉందని, ఒకడికి తెలివి ఉందని అహంకరిస్తుంటారు. మనకి ఉన్నదానిని పదిమందికి ఉపయోగపడే విధంగా బతుకుదామని ఉండదు. ఇదే కబంధుడి జీవితం నుంచి మనం నేర్చుకోవలసింది)
అప్పుడు వాళ్ళు కబంధుడి శరీరాన్ని చితి మీద పెట్టి కాల్చేశారు. అప్పుడు ఆ చితి నుండి ఆభరణములు పెట్టుకుని, మంచి తేజస్సుతో, ఒక దివ్య శరీరంతొ ధనువు పైకి వచ్చి " రామ! ఇప్పుడు నీకు చాలా కష్టమైన కాలం నడుస్తుంది. నీలాగే భార్యని పోగొట్టుకుని బాధపడుతున్నవాడు ఒకడు ఉన్నాడు. ఆయన కూడా ధర్మాత్ముడు. ఆయన పేరు సుగ్రీవుడు, నలుగురు వానరములతో కలిసి ఋష్యమూక పర్వతం మీద ఉన్నాడు. ఆయనని, ఆయన అన్నగారైన వాలి రాజ్యం నుండి వెడలగొట్టాడు. ఋక్షరజస్సు అనే వానరుని భార్యకి సూర్యుడి తేజస్సు వల్ల సుగ్రీవుడు ఔరస పుత్రుడిగా జన్మించాడు. నువ్వు ఆయనతో అగ్నిసాక్షిగా స్నేహం చేసుకో. వానరుడు కాదా అని ఎన్నడూ సుగ్రీవుడిని అవమానించద్దు. ఇప్పుడు నీకు ఒక గొప్ప మిత్రుడు కావాలి, సుగ్రీవుడు నీకు తగిన మిత్రుడు. ఆ సుగ్రీవుడిని కలుసుకోవడానికి నువ్వు ఇక్కడినుంచి పశ్చిమ దిక్కుకి వెళ్ళు, అక్కడ అనేకమైన వృక్ష సమూహములు కనపడతాయి. ఆ వృక్షములకు ఉండే పళ్ళు సామాన్యమైనవి కావు, అవి చాలా మధురంగా ఉంటాయి. మీరు ఆ పళ్ళు తిని ముందుకి వెళితే కొన్ని వనాలు వస్తాయి. మీరు ఆ వనాలన్నీ దాటి ముందుకి వెళితే ఆఖరికి పంపా అనే పద్మ సరస్సు వస్తుంది. ఆ సరస్సు దెగ్గర హంసలు, ప్లవములు, క్రౌంచములు, కురరవములు అనే పక్షులు నేతిముద్దల్లా ఉంటాయి. మీరు ఆ పక్షులని చంపి వాటి మాంసాన్ని తినండి. అలా చెయ్యడం వల్ల మీరు సేద తీరుతారు. అలాగే ఆ సరస్సులో రుచికరమైన చేపలు ఉంటాయి, మీరు వాటిని కూడా తినండి. తరువాత సుగంధ భరితమై, నిర్మలమై, చల్లగా ఉండేటటువంటి ఆ సరస్సులోని నీటిని తాగండి. మీరు సాయంత్రం పూట అక్కడ విహరించండి, అప్పుడు మీకొక విచిత్రమైన విషయం కనపడుతుంది. అక్కడ వాడని పూలదండలు పడి ఉంటాయి. ఆ పూలదండలని ఎవరూ వేసుకోరు.
ఇక్కడికి ఈ పూలదండలు ఎలా వచ్చాయో తెలుసా రామ. పూర్వం మతంగ మహర్షి ఉన్నప్పుడు, ఆయన శిష్యులు ఆయనకి కావలసిన దర్భలు, ఇతర పదార్ధాలు అరణ్యమునుండి మూట కట్టి తీసుకెళ్ళేవారు. వారు అలా తీసుకెళుతున్నప్పుడు వారి ఒంటికి చెమట పట్టి, ఆ చెమట బిందువులు భూమి మీద పడ్డాయి. వారు ఎంతగా గురు సుశ్రూష చేసినవారంటే, వాళ్ళ చెమట బిందువులు భూమి మీద పడగానే పూలదండలుగా మారిపోయాయి. ఆ పూల దండలు ఇప్పటికీ వాడకుండా అలానే ఉన్నాయి. నువ్వు ఆ పూలదండలని చూసి సంతోషించు. ఆ పంపా సరోవరానికి ముందరే ఋష్యమూక పర్వతం కనపడుతుంది.
ఆ ఋష్యమూక పర్వతాన్ని పూర్వకాలంలో బ్రహ్మగారు నిర్మించారు, దానిని ఎక్కడం చాలా కష్టం. చిత్రమేమిటంటే, ఆ పర్వతాన్ని గున్న ఏనుగులు రక్షిస్తూ ఉంటాయి. ఆ గున్న ఏనుగులు రోజూ పంపా సరోవరం దెగ్గరికి గుంపులుగా వచ్చి నీళ్ళు తాగుతాయి. దాహం తీరిపోగానే పౌరుషం వచ్చి ఆ ఎనుగులన్నీ నోట్లోనుంచి నెత్తురు కారేటట్టు కొట్టుకుంటాయి. అంతగా కొట్టుకున్నాక, అవి స్నేహితులు చెయ్యి చెయ్యి కలుపుకొని వెళ్ళినట్టు, తొండాలు తొండాలు ముడివేసుకొని ఆ ఋష్యమూక పర్వతం చుట్టూ తిరుగుతాయి. ఆ ఋష్యమూక పర్వత శిఖరం మీద ఎవడన్నా ఒక రాత్రి పడుకుంటే, ఆ రాత్రి వారికి కలలో ఏది కనపడుతుందో, ఉదయానికల్లా అది జెరిగి తీరుతుంది. పాపకర్మ ఉన్నవాడు, దుష్టబుద్ధి ఉన్నవాడు ఆ పర్వతాన్ని ఎక్కలేడు. ఆ పర్వతాల మీద 5 వానరాలు ఉన్నాయి. ఆ పర్వతం మీదకి వెళితే ఒక పెద్ద గుహ ఉంటుంది, దానిని ఒక రాతి పలకతో మూసి ఉంచుతారు. ఆ గుహలోకి ఎవరూ ప్రవేశించలేరు. దాని పక్కనే ఒక పెద్ద తోట ఉంటుంది, అందులో అన్ని ఫలాలు లభిస్తాయి. ఆ ఫలాలని తింటూ, అక్కడే ఉన్న సరస్సులోని నీళ్ళు తాగుతూ సుగ్రీవుడు ఆ గుహలో కూర్చొని ఉంటాడు.
ఆ సుగ్రీవుడు అప్పుడప్పుడూ గుహ నుండి బయటకి వచ్చి, ఆ పర్వత శిఖరాల మీద ఒక పెద్ద బండరాయి మీద కూర్చుంటూ ఉంటాడు. గుర్తుపెట్టుకో రామ, ఆ సుగ్రీవుడికి సూర్యకిరణాలు ఎంత దూరం వరకూ భూమి మీద పడతాయో, అంతవరకు ఏ పర్వతాలు ఉన్నాయో, ఎన్ని గుహలు ఉన్నాయో, ఆ గుహలలో ఎవరు ఉంటారో, ఎవరు ఎక్కడ ఉంటారో, ఎక్కడ పాలిస్తారో, వారి వంశం ఏమిటో అన్నీ తెలుసు. అందుకని అటువంటి సుగ్రీవుడితో స్నేహం చెయ్యి " అని చెప్పి వెళ్ళిపోయాడు.
అప్పుడు రామలక్ష్మణులు బయలుదేరి మతంగ మహర్షి యొక్క ఆశ్రమానికి చేరుకున్నారు. అప్పుడు మతంగ మహర్షి యొక్క శిష్యురాలైన శబరి రామలక్ష్మణులను చూసి గబగబా బయటకి వచ్చి వారి పాదాలని గట్టిగా పట్టుకుంది. వారికి అర్ఘ్యము, పాద్యము మొదలైనటువంటి అతిథికి ఇవ్వవలసిన సమస్త సంభారములు చేకూర్చింది. అవన్నీ స్వీకరించాక, రాముడు శబరితో " నువ్వు నియమంగా జీవితం గడపగలుగుతున్నావా, నియమముతో కూడిన ఆహారాన్ని తీసుకుంటున్నావా, తపస్సు చెయ్యగలుగుతున్నావా, నీ గురువుల యొక్క అనుగ్రహాన్ని నిలబెట్టుకుంటున్నావా " అని అడిగాడు.
అప్పుడా శబరి " రామ! ఏనాడు నీ దర్శనం చేశానో, ఆనాడే నా తపస్సు సిద్ధించింది. నేను కూడా మా గురువుగారైన మతంగ మహర్షి శిష్యులతో పాటు తపస్సు చేశాను. నువ్వు చిత్రకూట పర్వతం మీద ఉండగా మా గురువులందరూ దివ్యమైన విమానములు ఎక్కి ఉత్తమలోకాలకి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోతూ నాతో ఒక మాట అన్నారు ' మహానుభావుడైన రామచంద్రమూర్తి ఈ ఆశ్రమం వైపుకి వస్తారు. అప్పుడు వాళ్ళకి ఆతిధ్యం ఇచ్చాక నువ్వు కూడా మేము ఉన్నటువంటి ప్రదేశానికి వద్దువు ' అని చెప్పి వెళ్ళారు. అందుకని నీకోసం నేను ఇక్కడే ఉండిపోయాను " అని చెప్పింది.
అప్పుడా రాముడు శబరితో " నీ యొక్క ప్రభావాన్ని నేను చూడాలి అనుకుంటున్నాను శబరి " అన్నాడు.
అప్పుడు శబరి రాముడిని ఆ ఆశ్రమం లోపలికి తీసుకువెళ్ళి ఒక అగ్నివేదిని చూపించి " రామ! మా గురువుగారు ఈ అగ్నివేది దెగ్గరే అగ్నిహోత్రం చేసేవారు. వృద్ధులైన మా గురువులు వొణికిపోతున్న చేతులతో పువ్వులు తీసి ఆ వేది మీద పెట్టేవారు. రామ! ఒక్కసారి ఆ వేది మీద చూడు, ఆ పువ్వులు ఇప్పటికీ వాడకుండా అలానే ఉన్నాయి. నువ్వు చిత్రకూట పర్వతం మీద ఉన్నప్పుడు వాళ్ళు ఇక్కడ అగ్నికార్యం చేసి వెళ్ళిపోయారు. ఇప్పటికీ ఆ అగ్నివేదిలో నుంచి వచ్చే కాంతి దశదిశలని ప్రకాశింప చేస్తుంది. మా గురువులు చాలా వృద్ధులు అవ్వడం వలన, నదీ తీరానికి వెళ్ళి స్నానం చెయ్యలేకపోయేవారు. అందుకని వారు అక్కడే కూర్చొని ఒక్క నమస్కారం చేసేవారు. వారు అలా నమస్కారం చెయ్యగానే ఏడు సముద్రముల యొక్క పాయలు ఇటుగా ప్రవహించాయి, అప్పుడు మా గురువులు అందులో స్నానం చేశారు. మా గురువులు స్నానం చేసి తమ వస్త్రములను పిండి, ఇక్కడే తీగల మీద ఆరేసేవారు. నువ్వు ఆ వస్త్రములను ముట్టుకొని చూడు, అవి ఇప్పటికీ అలానే తడిగా ఉంటాయి. వారు ముట్టుకున్న ప్రతి వస్తువుని వారు ఏ స్థితిలో ముట్టుకున్నారో, అవి ఆ స్థితిలోనే ఉండిపోయాయి తప్ప ప్రకృతి యొక్క పరిణామగతంగా ఆ వస్తువులు మారలేదు. వారు అంతగా ఆత్మగతులై ఆత్మస్వరూపంగా ఉండిపోయారు.
రామ! నీకోసమని చెప్పి నేను ఈ అరణ్యం నుండి చాలా సంభారాలని సేకరించాను, నువ్వు వాటిని స్వీకరించు" అని చెప్పి, ఆ సంభారములని రాముడికి ఇచ్చి " మా గురువులు నీకు ఆతిధ్యం ఇవ్వమన్నారు, నేను ఇచ్చేశాను. అందుకని నేను వెళ్ళిపోదామని అనుకుంటున్నాను " అని చెప్పి, సంకల్పమాత్రం చేత అగ్నిని రగిల్చి, అందులో చీర క్రిష్ణాంబరాలతో సహా దూకి తన శరీరాన్ని వదిలేసింది. అప్పుడా అగ్నిలోనుంచి దివ్యమైన అంబరములతో, దివ్యమైన వస్త్రములతో ఆమె శరీరం బయటకి వచ్చి, తన గురువులు ఉన్న లోకాలకి వెళ్ళిపోయింది.
ఆహా, ఏమి ఋషులు, ఏమి తపస్సు అని రామలక్ష్మణులు పొంగిపోయి, అక్కడినుండి బయలుదేరి ఋష్యమూక పర్వతం వైపు బయలుదేరారు.